తెలంగాణ

telangana

చిరిగిన రూ. 20 నోటు కోసం గొడవ.. మహిళ మృతి.. బంగారం కోసం భార్యను చంపిన భర్త

By

Published : Oct 25, 2022, 8:54 PM IST

Updated : Oct 25, 2022, 9:36 PM IST

కొందరు చిన్నచిన్న విషయాలకే గొడవ పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. దాదాపు అలాంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. చిరిగిన 20 రూపాయల విషయంలో ఇద్దరు మహిళలు గొడవ పడగా ఒకరు ప్రాణాలు విడిచారు. మరో ఘటనలో కట్టుకున్న భర్తే కాలయముడై.. భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు.

Fight for torn 20 rupee note
చిరిగిన 20 రూపాయల నోటు కోసం గొడవ

కర్ణాటకలో చిరిగిన 20 రుపాయల నోటు విషయంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణాలు తీసింది. రాయచూరులోని సిందనూరు ప్రాంతంలో ఇద్దరు మహిళలు రూ. 20 కోసం గొవడపడ్డారు. ఈ వివాదంలో ఓ మహిళ మృతి చెందగా.. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ విషయంపై ఇరువర్గాలపై సిందనూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

అసలు ఏం జరిగిందంటే.. మల్లమ్మ అనే మహిళ సిందనూరులోని గీతా క్యాంపులో దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తుంది. రుక్కమ్మ అనే మహిళ కూతురు.. మల్లమ్మ దుకాణానికి వెళ్లగా ఆమెకు మల్లమ్మ చిరిగిన 20 రూపాయల నోటు ఇచ్చింది. ఈ విషయంలో రుక్కమ్మ, మల్లమ్మలు తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారు. ప్రమాదవశాత్తు షాపులో ఉన్న పెట్రోల్ ఇద్దరిపై పడింది. దుకాణంలో ఉన్న దీపం తగిలి ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి. ఫలితంగా ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన మల్లమ్మను బళ్లారిలోని ఓ ఆస్పత్రిలో, రుక్కమ్మను రాయచూరులోని మరో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. రుక్కమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది.

బంగారం కోసం భార్యను చంపిన భర్త
గుజరాత్​ సౌరాష్ట్ర ప్రాంతంలోని భావ్​నగర్​లో ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా కత్తితో పొడిచి హతమార్చాడు. అడ్డు వచ్చిన మామను కూడా గాయపరిచాడు. దీంతో నిందితుడు సహా మరో ముగ్గురిపై కేసు నమోదుచేశారు పోలీసులు. ప్రస్తుతం వారు పరారిలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
భావ్‌నగర్‌లోని ఇందిరానగర్​కు చెందిన హిమ్మత్ దాంజీ జోగాడియా, దీప్తి 2014 అక్టోబర్ 19న వివాహం చేసుకున్నారు. దీప్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. గత ఏడు సంవత్సరాలుగా పుట్టింటికి వెళ్లకుండా అత్తవారింటికే పరిమితమైంది. దీపావళి సందర్భంగా దీప్తికి ఆభరణాలు ఇవ్వడానికి ఆమె తండ్రి ప్రగ్జీభాయ్.. అల్లుడు ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికి బంగారం విషయంలో వారి మధ్య గొడవ తలెత్తింది. కోపంతో ఉన్న జోగాడియా తన భార్యపై కత్తితో దాడి చేయడం వల్ల ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తండ్రికి కూడా తలపై గాయాలు కావడం వల్ల వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న నలుగురిపై బాధిత కుటుంబీకులు స్టేషన్​లో కేసు నమోదు చేశారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడతామని తెలిపారు.

Last Updated :Oct 25, 2022, 9:36 PM IST

ABOUT THE AUTHOR

...view details