తెలంగాణ

telangana

టీఎంసీ ఎంపీ మహువాపై బహిష్కరణ వేటు- లోక్​సభ నుంచి విపక్షాలు వాకౌట్

By PTI

Published : Dec 8, 2023, 12:58 PM IST

Updated : Dec 8, 2023, 3:53 PM IST

TMC MP Mahua Moitra Expelled : ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ మేరకు ఎథిక్స్‌ కమిటీ సిఫారసు చేయగా లోక్‌సభ ఆమోదం తెలిపింది.

Ethics Committee Report On TMC MP Mahua Moitra
Ethics Committee Report On TMC MP Mahua Moitra

TMC MP Mahua Moitra Expelled : పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. ఈ వ్యవహారంపై పార్లమెంట్‌ ఎథిక్స్​ కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభ ఆమోదించింది. 'ఎంపీ మహువా అనైతికంగా, అమర్యాదకరంగా ప్రవర్తించారని కమిటీ చేసిన తీర్మానాన్ని ఈ సభ అంగీకరించింది. అందువల్ల ఆమె ఇక ఎంపీగా కొనసాగడం తగదు' అని స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు. మహువా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆమెను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

మహువాపై వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికను శుక్రవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆమెను బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తీర్మానాన్ని పెట్టారు. అయితే ఈ తీర్మానాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసేందుకు తమకు కొంత సమయమివ్వాలని, నివేదికపై ఓటింగ్‌కు ముందు సభలో చర్చ జరపాలని డిమాండ్‌ టీఎంసీ సహా పలువురు విపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు.

లోక్​సభలో వాడీవేడీ చర్చ
ఈ క్రమంలోనే నివేదికపై కొంతసేపు చర్చించేందుకు స్పీకర్‌ ఓం బిర్లా అనుమతినిచ్చారు. అప్పుడు అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. అయితే, ఈ చర్చలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మహువా కోరగా సభాపతి అందుకు నిరాకరించారు. అనంతరం మూజువాణీ ఓటు చేపట్టి ఈ నివేదికను లోక్‌సభ ఆమోదించింది. అనంతరం మహువాను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్‌ ఓం బిర్లా. అనంతరం సభను వచ్చే సోమవారానికి (డిసెంబరు 11) వాయిదా వేశారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఓటింగ్‌ సమయంలో విపక్షాలు వాకౌట్‌ చేశాయి.

మహువాపై ఆరోపణలు
లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరా నందాని నుంచి మొయిత్రా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ విచారణ జరిపింది. ఈ దర్యాప్తులో భాగంగానే మహువా మొయిత్రాతో పాటు ఆమెపై ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దుబే, న్యాయవాది జై అనంత్‌ దెహద్రాయ్‌ (మహువా మాజీ మిత్రుడు)ను కమిటీ విచారించింది. అనంతరం 500 పేజీలతో కూడిన నివేదికను రూపొందించింది. మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని ఎథిక్స్‌ కమిటీ పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా తన పార్లమెంట్‌ లాగిన్‌ వివరాలను బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు కమిటీ నిర్ధరించింది.

Last Updated : Dec 8, 2023, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details