తెలంగాణ

telangana

TSPSC పేపర్‌ లీక్ కేసు.. రంగంలోకి ఈడీ.. దర్యాప్తు నివేదికతో నేడు హైకోర్టుకు సిట్

By

Published : Apr 11, 2023, 10:11 AM IST

TSPSC Paper Leakage Update : టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలో ఈడీ రంగంలోకి దిగింది. ప్రశ్నపత్రాల లీక్ కోసం భారీగా నగదు చేతులు మారినట్లు అనుమానిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. మనీ లాండరింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి సహా పలువురిని విచారించాలని నిర్ణయించారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటి వరకు జరిపిన విచారణ నివేదికను సిట్‌ అధికారులు నేడు హైకోర్టుకు సమర్పించనున్నారు.

TSPSC Paper Leakage Update
TSPSC Paper Leakage Update

TSPSC Paper Leakage Update : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ రంగప్రవేశం చేసింది. ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ రెడ్డి వాంగ్మూలాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈడీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. నిందితుల వాంగ్మూలాల నమోదుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

ED inquiry in TSPSC paper leak : ప్రశ్నపత్రాల లీక్ కోసం భారీగా నగదు చేతులు మారినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అనుమానిస్తున్నారు. మనీ లాండరింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. సిట్ అధికారులు సాక్షిగా పేర్కొన్న కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే శంకరలక్ష్మితో పాటు కమిషన్‌కు చెందిన సత్యనారాయణకు నోటీసులు ఇచ్చింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు ప్రవీణ్, రాజశేఖర్‌లను కస్టడీకి తీసుకొని విచారించనుంది.

SIT Report to Telangana HC in paper leak case..: ఇదిలా ఉండగా.. ఈ కేసులో నెల రోజుల పాటు దర్యాప్తు కొనసాగించిన సిట్‌ అధికారులు.. మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 15 మందిని కస్టడీకి తీసుకుని పలు వివరాలు రాబట్టారు. దాదాపు 150 మందిని విచారించిన అధికారులు.. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సెక్రటరీ సహా పలువురి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ మొత్తం నివేదికను నేడు హైకోర్టుకు సమర్పించనున్నారు. దర్యాప్తు నివేదికలో నిందితుల పెన్‌డ్రైవ్, మొబైల్స్‌లో ప్రశ్నపత్రాలు ఉన్నట్లు రూపొందించిన ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికనూ జతపరిచారు.

ఉద్యోగాలు అమ్మేసుకుంటూ పోతే ఎలా..: మరోవైపు ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై విపక్షాలు సహా పలువురు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో తాజాగా ప్రముఖ నటుడు ఆర్‌.నారాయణమూర్తి స్పందించారు. పేపర్ లీకేజీలతో విద్యార్థి, నిరుద్యోగుల ఆశలు నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ఈ ఉదంతంతో నిజంగా చదివే వారి పరిస్థితి అధ్వానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఉద్యోగాలు అమ్మేసుకుంటూ పోతే.. నిజమైన విద్యార్థుల భవిష్యత్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

ప్రభుత్వం స్పందించాలి..: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన నిరసన దీక్షను సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణతో పాటు రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరాలు ప్రారంభించారు. లీకేజీల్లో ఎవరు తప్పు చేశారో.. వారిని వెంటనే శిక్షిస్తే.. మరొకరు చేసేందుకు భయపడతారన్నారు. వెంటనే ప్రభుత్వం దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.

ఇవీ చూడండి..

TSPSC పేపర్​ లీక్ కేసులో మరో ట్విస్ట్.. రూ.6 లక్షలకు DAO ప్రశ్నాపత్రం విక్రయం

TSPSC పేపర్ లీకేజీలో మరో ట్విస్ట్.. నిందితుల పెన్​డ్రైవ్​లో 15 ప్రశ్నపత్రాలు

ABOUT THE AUTHOR

...view details