తెలంగాణ

telangana

'త్వరలో బంగాల్ విభజన! రెండు రాష్ట్రాలా? కేంద్ర పాలిత ప్రాంతంగానా?'

By

Published : Nov 7, 2022, 3:51 PM IST

దేశం.. మరో రాష్ట్ర విభజనను చూడనుందా? బంగాల్ రెండుగా విడిపోనుందా? ఉత్తర బంగాల్​ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చనున్నారా?... బంగాల్​లో అసలు ఏం జరుగుతోంది?

division-of-bengal
division-of-bengal

బంగాల్​ రాష్ట్రాన్ని రెండుగా విభజించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. భాజపా నేతలతో గ్రేటర్ కూచ్​బెహర్ పీపుల్స్ అసోసియేషన్ నేత అనంత్ రాయ్ భేటీ కావడం ఈ వాదనలకు ఆజ్యం పోసింది. ఉత్తర బంగాల్​ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చటం దాదాపుగా ఖాయమైందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఏమైందంటే?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్, భాజపా నేత సునీల్ బన్సల్, బంగాల్ భాజపా అధ్యక్షుడు సుకాంత మజుందార్​తో.. గ్రేటర్ కూచ్​బెహర్ పీపుల్స్ అసోసియేషన్ నేత అనంత్ రాయ్(మహారాజ్​) భేటీ అయ్యారు. సిలిగుడిలో ఆదివారం రాత్రి జరిగిన ఈ 90 నిమిషాల భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉత్తర బంగాల్​ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలన్న తన డిమాండ్​లో మార్పు లేదని అనంత మహారాజ్.. భేటీ తర్వాత స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు బంగాల్​లో దుమారం రేపాయి. రాష్ట్ర విభజన తథ్యం అనే రీతిలో ప్రచారం సాగుతోంది. దీనిపై విపక్షాలు మండిపడుతుండగా.. కాషాయ క్యాంపులోనూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే, నిశిత్ ప్రామాణిక్ మాత్రం.. విభజనపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 'సునీల్ బన్సల్ తొలిసారి ఉత్తర బంగాల్​కు వచ్చారు. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే. అనంత్ మహారాజ్ సైతం మర్యాదపూర్వకంగానే కలిశారు' అని ప్రామాణిక్ చెప్పుకొచ్చారు. బంగాల్ భాజపా అధ్యక్షుడు సుకాంత మజుందార్ సైతం విభజన వార్తలను కొట్టిపారేశారు. 'శ్యామాప్రసాద్ ముఖర్జీ కోరుకున్న బంగాల్ రాష్ట్రం మాకు కావాలి. రాష్ట్ర విభజన గురించి కానీ, కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చే విషయంపై గానీ కేంద్రం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు' అని స్పష్టం చేశారు.

త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం వెలుగులోకి రావడం రాష్ట్రంలో రాజకీయ దుమారానికి కారణమవుతోంది. అటు, వామపక్షాలు ఈ అంశంపై మండిపడుతున్నాయి. 'ఇవి నీచ రాజకీయాలు. పంచాయతీ ఎన్నికలకు ముందు ఇలాంటి ఊహాగానాలు ఎందుకు లేవనెత్తుతున్నారు?' అని సీపీఎం నేత అశోక్ భట్టాచార్య ప్రశ్నించారు. సిలిగుడి మేయర్ గౌతమ్ దేబ్.. కాషాయ వర్గాల వాదనను ఖండిస్తున్నారు. 'బంగాల్​ను ఎవరైనా విభజించేందుకు ప్రయత్నిస్తే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలను చూస్తారు' అని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details