తెలంగాణ

telangana

స్పైస్​జెట్​కు షోకాజ్​ నోటీసులు! మరో విమానంలోనూ సాంకేతిక సమస్య

By

Published : Jul 6, 2022, 8:28 PM IST

స్పైస్​జెట్​ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది పౌరవిమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్‌(డీజీసీఏ). ఇటీవల తరచూ జరుగుతున్న సాంకేతిక లోపాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. అన్నింటికన్నా ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమైందని ట్వీట్ చేశారు.

spicejet news
spicejet news

స్పైస్‌జెట్‌ విమానాల్లో ఇటీవల తరచూ జరుగుతున్న సాంకేతిక లోపాలపై వివరణ ఇవ్వాలని ఆ సంస్థకు పౌరవిమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్‌(డీజీసీఏ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. విడిభాగాలు అందించే సంస్థలకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడం వల్ల భద్రతా లోపాలున్నాయని డీజీసీఏ ఎత్తిచూపింది. దీనిపై స్పందించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. అన్నింటికన్నా ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమైందని ట్వీట్ చేశారు. భద్రతకు సంబంధించి చిన్న చిన్న లోపాలను కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేసి సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారమే రెండు స్పైస్‌జెట్‌ విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తగా.. తాజాగా మరో కార్గో విమానం సాంకేతిక లోపంతో కోల్‌కతాకు వెనుదిరిగింది. ఇది కూడా మంగళవారమే జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మంగళవారం సాయంత్రం ఓ స్పైస్‌జెట్‌ బోయింగ్‌ 737 ఫ్రీటర్‌ (సరకు రవాణాకు ఉపయోగించే కార్గో విమానం) కోల్‌కతా నుంచి చాంగ్‌కింగ్‌(చైనా) బయల్దేరింది. అయితే టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికి విమానంలో వెదర్‌ రాడార్‌ (వాతావరణ సూచీ) పనిచేయడం లేదని కమాండ్ పైలట్‌ గుర్తించారు. దీంతో వెంటనే విమానాన్ని తిరిగి కోల్‌కతా మళ్లించినట్లు స్పైస్‌జెట్ అధికార ప్రతినిధి వెల్లడించారు. కోల్‌కతా విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయినట్లు తెలిపారు.

కాగా.. స్పైస్‌జెట్‌ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం 18 రోజుల్లో ఇది ఎనిమిదో ఘటన. ఇందులో మూడు ఘటనలు మంగళవారమే జరిగాయి. నిన్న దిల్లీ నుంచి దుబాయి వెళ్తోన్న స్పైస్‌జెట్‌ విమానం ఒకటి పాక్‌ గగనతలంలో ఉండగా.. ఇంధన ఇండికేటర్‌ సరిగా పనిచేయలేదు. దీంతో విమానాన్ని వెంటనే కరాచీకి దారిమళ్లించారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే గుజరాత్‌లోని కాండ్లా నుంచి ముంబయి వెళ్తోన్న మరో స్పైస్‌జెట్ విమానంలో.. 23వేల అడుగుల ఎత్తులో విండ్‌షీల్డ్‌కు పగులు ఏర్పడింది. దీంతో పైలట్లు ముంబయి విమానాశ్రయంలో ప్రాధాన్య ప్రాతిపదికన ల్యాండింగ్‌ నిర్వహించారు.

లాభాల్లోకి స్పైస్​జెట్​ షేర్లు: వరుస ఘటనలతో తల్లడిల్లుతోన్న స్పైస్​జెట్​కు షేర్ మార్కెట్​ కొంత ఊరటనిచ్చింది. స్టాక్​మార్కెట్ల సానుకూల పవనాలతో 2 శాతం మేర స్పైస్​జెట్​ షేర్​ పెరిగింది. బుధవారం రూ.37 వద్ద ప్రారంభమై.. రూ.39 వద్ద స్థిరపడింది. అంతకుముందు సోమవారం స్పైస్​జెట్​ షేర్​ విలువ 52 వారాల కనిష్ఠానికి పడిపోయింది.

మరో రెండు విమానాల్లో సాంకేతిక సమస్యలు: ఇండిగో సంస్థకు చెందిన ఓ విమానంలో పొగలు వచ్చాయి. రాయ్​పుర్​ నుంచి ఇందోర్ వెళ్లిన విమానం ల్యాండైన తర్వాత క్యాబిన్​లో పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా దించారు. దీనిపై విచారణ చేపటనున్నట్లు డీజీసీఏ తెలిపింది. మరోవైపు విస్తారాకు చెందిన ఓ విమాన ఇంజిన్​ విఫలమవడం వల్ల దిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులను సురక్షితంగా దించినట్లు డీజీసీఏ అధికారులు వెల్లడించారు. ఇంజిన్​లో స్వల్ప ఎలక్ట్రికల్​ షార్ట్​ ​సర్క్యూట్​ జరిగిందని చెప్పారు.

ఇదీ చదవండి:ముంబయిని ముంచెత్తిన వర్షాలు.. 'మహా'లో మరో 3 రోజులు కుండపోతే..!

ABOUT THE AUTHOR

...view details