తెలంగాణ

telangana

సోనియా, రాహుల్​కు దిల్లీ హైకోర్టు నోటీసులు

By

Published : Feb 22, 2021, 12:03 PM IST

Updated : Feb 22, 2021, 2:30 PM IST

నేషనల్​ హెరాల్డ్​ కేసులో.. సాక్షులను ప్రవేశపెట్టి విచారించాలన్న భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వ్యాజ్యంపై స్పందించాలంటూ.. కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్​లకు నోటీసులు జారీ చేసింది దిల్లీ హైకోర్టు. ఇందుకోసం ఏప్రిల్​ 12 వరకు గడువునిచ్చింది. అప్పటివరకు పిటిషన్​పై స్టే విధించింది.

National Herald case
నేషనల్​ హెరాల్డ్ కేసు విచారణపై దిల్లీ హైకోర్టు స్టే

నేషనల్​ హెరాల్డ్​ కేసులో కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్​ గాంధీకి నోటీసులు జారీ చేసింది దిల్లీ హైకోర్టు. సాక్షులను ప్రవేశపెట్టి.. వారిని విచారించేందుకు అనుమతించాలన్న భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వ్యాజ్యంపై స్పందించాలని ఆదేశించింది.

గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్​ ఫెర్నాండెజ్​, సుమన్​ దూబే, సామ్​ పిట్రోడా, యంగ్​ ఇండియా సంస్థకు ఈ నోటీసులు జారీ చేశారు జస్టిస్​ సురేశ్​ కైట్​. ఏప్రిల్​ 12లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేస్తూ.. అప్పటివరకు కేసు విచారణపై స్టే విధించారు.

కేసుకు సంబంధించి సాక్షులు ప్రవేశపెట్టాలన్న తన అభ్యర్థనను ట్రయల్​ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఈ నెల 11న దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు స్వామి.

సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్​(రిజిస్ట్రీ ఆఫీసర్​), డిప్యూటీ ల్యాండ్​ అండ్​ డెవెలప్​మెంట్​ ఆఫీసర్​, ఐటీ డిప్యూటీ కమీషనర్​కు సమన్లు జారీ చేయాలని వ్యాజ్యంలో కోరారు స్వామి. కేసుకు సంబంధించిన పత్రాలను కూడా వారు సమర్పించే విధంగా ఆదేశాలు అందించాలని పేర్కొన్నారు.

ఇదీ జరిగింది...

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కాంగ్రెస్‌ పార్టీకి బకాయి ఉన్న రూ.90.25కోట్లు వసూలు చేసుకొనే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియా‌ ప్రై.లి. ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు యత్నించారని ఆరోపించారు.

కేసుకు సంబంధించిన మరో నిందితుడు మోతీలాల్​ వోరా.. 2014లో మృతిచెందారు.

అయితే, ఈ కేసు విచారణను జాప్యం చేసేందుకు సుబ్రమణ్య స్వామి ప్రయతిస్తున్నారని సోనియా, రాహుల్‌ తరఫు న్యాయవాది ఆరోపించారు.

ఇదీ చూడండి: '100 రక్షణ ఉత్పత్తుల దిగుమతిపై కేంద్రం ఆంక్షలు'

Last Updated : Feb 22, 2021, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details