తెలంగాణ

telangana

చలి పంజా.. మూడు రోజులు కోల్డ్ స్పెల్.. 3డిగ్రీల కన్నా తక్కువకు ఉష్ణోగ్రతలు

By

Published : Jan 16, 2023, 6:40 AM IST

దేశ రాజధాని దిల్లీ, పరిసర ప్రాంతాల్లో మరోసారి కోల్డ్‌ స్పెల్‌ ఏర్పడే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఇది కొనసాగుతుందని, ఫలితంగా మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

DELHI COLD SPELL
DELHI COLD SPELL

దేశ రాజధాని దిల్లీలో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు మరో కోల్డ్‌ స్పెల్‌ ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. వరుసగా కొన్ని రోజుల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే దీనిని ఓల్డ్‌ స్పెల్‌గా వ్యవహరిస్తారు. ఈ నెల 5 నుంచి 9 తేదీల మధ్య ఏర్పడిన కోల్డ్‌ స్పెల్‌లో దిల్లీ పరిసర ప్రాంతాల్లో వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన పదేళ్లలో ఇంతటి తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది రెండోసారి. ఐఎండీ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 15 రోజుల్లో 50 గంటలపాటు పొగమంచు కురిసింది. 2019 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో మంచు కురవడం ఇదే తొలిసారి. ఈ నెల 10 నుంచి క్రమంగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. వాయవ్య ప్రాంతం మీదుగా వస్తున్న గాలులతో మరోసారి తగ్గుముఖం పట్టాయి.

రానున్న 5 రోజుల్లో దిల్లీతోపాటు పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయవ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలిగాలుల వల్ల జనవరి 18 వరకు ఆయా ప్రాంతాల్లో రెండు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వదులుగా, పొరలుపొరలుగా ఉండే దుస్తులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. ఇళ్లల్లో ఉష్ణోగ్రతలను సమతుల్యం చేసేలా రూమ్‌ హీటర్లు ఏర్పాటు చేసుకోవాలని కోరింది. జనవరి 18 తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అధికారి ఒకరు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details