తెలంగాణ

telangana

యూపీలో మరో మంత్రి రాజీనామా.. భాజపాలోకి ఎస్​పీ నేతలు!

By

Published : Jan 12, 2022, 6:04 PM IST

Updated : Jan 12, 2022, 7:42 PM IST

dara singh chauhan

Dara Singh Chauhan Quits BJP: మరికొద్ది రోజుల్లో యూపీ ఎన్నికలు జరుగుతాయనగా అక్కడి భాజపా ప్రభుత్వానికి వరుస షాక్​లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి మరో కీలక నేత తప్పుకున్నారు. మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. ఇదే సమయంలో ఎస్​పీకి చెందిన ఇద్దరు నేతలు, ఓ కాంగ్రెస్​ నేత భాజపాలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Dara Singh Chauhan Quits BJP: ఉత్తర్​ప్రదేశ్​ భాజపాలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. కేబినెట్​ నుంచి సీనియర్​ నేత స్వామిప్రసాద్​ మౌర్య తప్పుకున్న మరుసటిరోజే మరో మంత్రి రాజీనామా బాట పట్టారు. పర్యావరణ శాఖ మంత్రి, ఓబీసీ వర్గానికి చెందిన కీలక నేత దారా సింగ్​ చౌహాన్​ కూడా పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. భాజపాను వీడుతున్నట్లు తెలిపారు.

ఎస్​పీలోకి వెళ్తారా?

"భాజపా ప్రభుత్వంలో దళితులు, వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగట్లేదు. అందుకే కేబినెట్​ నుంచి తప్పుకుంటున్నాను" అని దారా సింగ్​ చౌహాన్ తెలిపారు. ఎస్​పీలో చేరికపై స్పందిస్తూ.. మద్దతుదార్లను సంప్రదించి తన తదుపరి కార్యాచరణ ప్రణాళిక వెల్లడిస్తానని పేర్కొన్నారు.

మంగళవారం.. మాజీ మంత్రి స్వామిప్రసాద్​ మౌర్య సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు భాజపాను వీడారు.

చౌహాన్​కు అఖిలేశ్​ ఆహ్వానం..

దారా సింగ్​ చౌహాన్​ రాజీనామాను స్వాగతించారు ఎస్​పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్​. ఆయన్ను ఎస్​పీలోకి ఆహ్వానిస్తూ ట్వీట్​ చేశారు.

"సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడే దారా సింగ్​ చౌహాన్​కు నా హృదయపూర్వక అభినందనలు. ఎస్​పీ సహా మిత్ర పక్షాలు కలిసి ఈ వివక్షను అంతం చేసేందుకు పోరాడతాయి." అని అఖిలేశ్​ పేర్కొన్నారు. ​

ఒకసారి ఆలోచించుకోండి..

రాజీనామాపై చౌహాన్​ పునరాలోచించుకోవాలని సూచించారు యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్​ మౌర్య. "ఓ వ్యక్తి కుటుంబాన్ని విడిచి వెళ్తుండటం చాలా బాధాకరం. మునుగుతున్న పడవను ఎక్కితే వారే నష్టపోతారు. కాబట్టి దారా సింగ్​జీ.. మీరు తీసుకున్న నిర్ణయం గురించి మరోసారి ఆలోచించుకోండి." అని ట్వీట్​ చేశారు.

అందుకే తప్పుకున్నాను..

మరోవైపు.. భాజపాను వీడటంపై షాహ్​జహాన్​పుర్​ ఎమ్మెల్యే రోషన్​ లాల్​ వర్మ స్పందించారు. గత ఐదేళ్లుగా తాను అణచివేతకు గురైనట్లు వెల్లడించారు. పేదలకు, వెనుకబడిన వారి సంక్షేమం కోసం ఏ కార్యక్రమం చేపట్టినా దానిని ప్రభుత్వం అడ్డుకునేదని ఆరోపించారు. భాజపా నియంతలా వ్యవహరిస్తోందని.. అందుకు భిన్నంగా ఎస్​పీ.. పేదలు, మైనారటీల సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ అని వ్యాఖ్యానించారు.

తదుపరి కార్యాచరణపై క్లారిటీ అప్పుడే..

రాజీనామా ప్రకటించి భాజపా ప్రభుత్వానికి షాక్​ ఇచ్చిన స్వామి ప్రసాద్​ మౌర్య.. తన భవిష్యత్​ కార్యాచరణ ప్రణాళికను శుక్రవారం వెల్లడిస్తానని ప్రకటించారు. మౌర్య ఎస్​పీలో చేరతారని యూపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు మౌర్య.. శుక్రవారమే ఎస్​పీలో చేరతారని రాజకీయా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇదంతా కుట్ర

తాను భాజపా నుంచి వైదొలుగుతానన్న వార్తల్లో నిజం లేదన్నారు ఎమ్మెల్యే రవీంద్రనాథ్​ త్రిపాఠి. త్రిపాఠి భాజపాకు రాజీనామా చేశారంటూ ఓ లేఖ సోషల్​ మీడియాలో వైరలవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు పలువురు చేస్తున్న కుట్ర అని పేర్కొన్నారు.

భాజపాకు నష్టం లేదు

వరుస ఫిరాయింపులపై భాజపా నేత సాక్షి మహారాజ్​ స్పందించారు. "పార్టీని వీడిన నేతలంతా ఒకప్పుడు ఇతర పార్టీల నుంచి భాజపాలోకి వచ్చిన వారే. వీరి వల్ల పార్టీకి ఏం నష్టం కలగదు. మేము చేసిన అభివృద్ధి గురించి ప్రజలు మరిచిపోరు. వాళ్లు భాజపాకే ఓటు వేస్తారు" అని ధీమా వ్యక్తం చేశారు.

మౌర్య రాజీనామా చేసిన నేపథ్యంలో హైకమాండ్​ ఆయనతో చర్చలు జరుపుతోందన్నారు భాజపా ఎంపీ రీటా బహుగుణ జోషి. ఓబీసీలను భాజపా నిర్లక్ష్యం చేసిందన్న మౌర్య ఆరోపణల్లో నిజం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం భాజపా విశేష కృషి చేసిందని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు కులాన్ని దృష్టిలో ఉంచుకుని జరిగేది కాదని తెలిపారు.

భాజపాలోకి ఎస్​పీ నేతలు

పార్టీ ఫిరాయింపులలో భాగంగా ఓవైపు కమలనాథులు ఎస్​పీలో చేరుతుంటే.. అటు ఎస్​పీ ఎమ్మెల్యేలు కూడా భాజపాలోకి వస్తున్నారు. ఎస్​పీ ఎమ్మెల్యే హరి ఓం యాదవ్​ సహా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ధర్మపాల్​లు బుధవారం కాషాయ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు కాంగ్రెస్​ ఎమ్మెల్యే నరేశ్​ సైనీ కూడా భాజపాలో చేరారు.

ఎస్​పీ అభ్యర్థుల ప్రకటన

భాజపా నేతలు ఎస్​పీలో చేరుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల అభ్యర్థుల జాబితాపై ఆసక్తి నెలకొంది. మరో రెండు రోజుల్లో తొలి, రెండో దశ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎస్​పీ.. నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ, రాష్ట్రీయ లోక్​ దళ్​, మహాన్​ దళ్​, ప్రగతిశీల్​ సమాజ్​వాదీ పార్టీ, సుహేల్​దేవ్​ భారతీయ సమాజ్​ పార్టీలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతోంది.

ఇదీ చూడండి :వృద్ధుడి పెన్షన్ అకౌంట్​లో రూ.75 కోట్లు జమ!

Last Updated :Jan 12, 2022, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details