తెలంగాణ

telangana

కేరళలో రెండోరోజూ 30 వేలకు పైగా కరోనా కేసులు

By

Published : Aug 26, 2021, 8:51 PM IST

కేరళలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. వరుసగా రెండో రోజు కూడా 30 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రజలు హోం క్వారంటైన్ ఆదేశాలను ఉల్లంఘించడమే ప్రస్తుతం ఉన్న పరిస్థితికి కారణమని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్​ అన్నారు. ఇటు ఒక్క కేరళలోనే లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు ఉండటం ఆందోళనకు గురి చేస్తోందన్నారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా.

kerala corona cases
కేరళలో కరోనా

కేరళలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ కొవిడ్ కేసుల సంఖ్య 30 వేలు దాటింది. గత 24 గంటల్లో 30 వేల 7 కొత్త కేసులు నమోదు కాగా మహమ్మారితో 162 మంది మృత్యువాత పడ్డారు. పాజిటివ్ రేటు 18 శాతం దాటింది. రెండు రోజుల క్రితం రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై సమీక్షించిన కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్.. ప్రజలు హోం క్వారంటైన్ ఆదేశాలను ఉల్లంఘించడమే ప్రస్తుతం ఉన్న పరిస్థితికి కారణమని చెప్పారు.

కరోనా ఆంక్షలను అమలు చేయడంలో కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షపార్టీ నేతలు, ప్రజారోగ్య నిపుణులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రప్రభుత్వ తెలివి తక్కువ నిర్ణయాలు, అజాగ్రత్తలతోనే ప్రజలకు ఈ పరిస్థితి వచ్చినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వీ. మురళీధరన్​ పేర్కొన్నారు. కొవిడ్​ వ్యాప్తిని అరికట్టడానికి బదులు.. మలబార్​ అల్లర్లకు సంబంధించి వేడుకలు చేసుకుంటోందని మండిపడ్డారు.

పరిస్థితులపై కేంద్రం సమీక్ష...

దేశంలో తాజాగా నమోదైన మొత్తం కొవిడ్ కేసుల్లో 68 శాతం కేసులు ఒక్క కేరళలోనే వెలుగు చూసినట్లు కేంద్రం తెలిపింది. ఆ రాష్ట్రంలోని విపత్కర పరిస్థితులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒక్క కేరళలోనే లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు ఉండటం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

వచ్చే రెండు నెలలు అత్యంత కీలకం..

ప్రస్తుతం దేశం కరోనా రెండో వేవ్‌ మధ్యలోనే ఉందని రానున్న రెండు నెలలు అత్యంత కీలకమని కేంద్రం హెచ్చరించింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో పండగలను ప్రజలు తగిన జాగ్రత్తలతో జరుపుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. టీకా వేయించుకున్నా ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం మనం సెకండ్‌ వేవ్‌ మధ్యలో ఉన్నామని తెలిపిన ఆరోగ్యశాఖ కార్యదర్శి దేశంలోని 41 జిల్లాల్లో ఒక వారపు పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువగానే ఉందని తెలిపారు.

ఇదీ చూడండి:Corona cases: దేశంలో మరో 46వేల కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details