తెలంగాణ

telangana

పెద్దల సభలో పెరగనున్న కాంగ్రెస్‌ బలం.. 11 మంది ఎన్నికయ్యే అవకాశం!

By

Published : May 26, 2022, 8:00 AM IST

Congress rajya sabha: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల ద్వారా పెద్దల సభలో కాంగ్రెస్​ బలం పెరగనుంది. 11 మంది నేతలు ఆ పార్టీ తరఫున రాజ్యసభలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. కొత్తగా జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌.. రాజస్థాన్‌లో 3; ఛత్తీస్‌గఢ్‌లో 2; తమిళనాడు, ఝార్ఖండ్‌, మహారాష్ట్రల్లో ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలను గెలుచుకోవడం దాదాపు ఖాయమని ధీమాగా ఉంది.

కాంగ్రెస్
కాంగ్రెస్

Congress rajya sabha: రాజ్యసభలో కాంగ్రెస్‌ బలం కాస్త పెరగనుంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలవడం ద్వారా ఆ పార్టీకి చెందిన 11 మంది నేతలు సభలో అడుగుపెట్టే అవకాశాలున్నాయి. ఆయా స్థానాలకు పార్టీ నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. పి.చిదంబరం, జైరాం రమేశ్‌ వంటి సీనియర్‌ నాయకులు తమకు మరోసారి రాజ్యసభ ఎంపీలుగా అవకాశం దక్కడం ఖాయమనే విశ్వాసంతో ఉన్నారు. పెద్దల సభలో కాంగ్రెస్‌ ప్రస్తుత బలం 29. రాబోయే రెండు నెలల్లో సభలో 55 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో భాగంగా హస్తం పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు- పి.చిదంబరం (మహారాష్ట్ర), జైరాం రమేశ్‌ (కర్ణాటక), అంబికా సోని (పంజాబ్‌), వివేక్‌ టంకా (మధ్యప్రదేశ్‌), ప్రదీప్‌ టంటా (ఉత్తరాఖండ్‌), కపిల్‌ సిబల్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), ఛాయా వర్మ (ఛత్తీస్‌గఢ్‌) తమ పదవీకాలాన్ని పూర్తిచేసుకోనున్నారు.

ఆ రాష్ట్రాల్లో ఎన్నంటే..: కొత్తగా జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ రాజస్థాన్‌లో 3; ఛత్తీస్‌గఢ్‌లో 2; తమిళనాడు, ఝార్ఖండ్‌, మహారాష్ట్రల్లో ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలను గెలుచుకోవడం దాదాపు ఖాయం. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే హరియాణా, మధ్యప్రదేశ్‌, కర్ణాటకల్లోనూ ఒక్కో స్థానాన్ని ఖాతాలో వేసుకోవచ్చు. దీంతో పెద్దల సభలో కాంగ్రెస్‌ బలం 33కు పెరిగే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, ముకుల్‌ వాస్నిక్‌, రణదీప్‌ సుర్జేవాలా, అజయ్‌ మాకెన్‌, రాజీవ్‌ శుక్లా తదితర సీనియర్‌ నాయకులు పార్టీలో రాజ్యసభ స్థానాలను ఆశిస్తున్నారు. వీరికి కొందరు జూనియర్ల నుంచీ పోటీ ఎదురవుతోంది. ఈ దఫా తమిళనాడు నుంచి పెద్దల సభకు ఎన్నికవ్వాలని ప్రయత్నిస్తున్న చిదంబరం.. ఇప్పటికే సీఎం స్టాలిన్‌ను కలిశారు. అయితే కాంగ్రెస్‌ డేటా అనలిటిక్స్‌ విభాగం అధినేత ప్రవీణ్‌ చక్రవర్తిని ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపాలని రాహుల్‌ గాంధీ బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో సీటుకు జైరాం రమేశ్‌, సుర్జేవాలా పోటీ పడుతున్నారు. సుర్జేవాలాకు హరియాణా నుంచీ అవకాశాలున్నాయి. అక్కడ ఆయనకు కుమారి సెల్జా, కుల్దీప్‌ బిష్ణోయ్‌ల నుంచి పోటీ ఉంది. హరియాణాలో ఆనంద్‌ శర్మను నామినేట్‌ చేయాలని మాజీ సీఎం భూపిందర్‌సింగ్‌ హుడ్డా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాజస్థాన్‌లో రెండు స్థానాలకు ఆజాద్‌, మాకెన్‌ బలమైన పోటీదారులుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి :'పొలిటిక‌ల్ క్లియ‌రెన్స్' లేకుండానే లండ‌న్ వెళ్లిన రాహుల్‌?

ABOUT THE AUTHOR

...view details