తెలంగాణ

telangana

పిల్లలకు కరోనా టీకా వేయించాలా? రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా...

By

Published : Dec 27, 2021, 12:49 PM IST

Updated : Dec 27, 2021, 2:28 PM IST

Children vaccination registration: 15-18 ఏళ్ల వారికి టీకా పంపిణీకి సంబంధించిన రిజిస్ట్రేషన్​ను జనవరి 1న ప్రారంభించనుంది కేంద్రం. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలిపింది. ఏఏ గుర్తింపు పత్రాలు అవసరమో వివరించింది.

Children will be able to register on the CoWIN app from Jan 1 for vaccine
పిల్లల టీకా

Children vaccination in India: 18 ఏళ్ల లోపు చిన్నారులకు కొవిడ్ వ్యాక్సినేషన్ దిశగా కేంద్రం సమగ్ర ఏర్పాట్లు చేస్తోంది. 15-18 ఏళ్ల మధ్య వయస్కులకు టీకాలు ఇవ్వాలని ఇదివరకే నిర్ణయించిన కేంద్రం.. రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. టీకా తీసుకోవాలనుకునే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని కొవిన్ చీఫ్​ డా.ఆర్​ఎస్​ శర్మ సూచించారు.

రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

జనవరి 1 నుంచి 15-18 ఏళ్ల వయస్కుల కోసం టీకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?

కొవిన్ యాప్​లో టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లబ్ధిదారులు తమ పేరు, వివరాలను నమోదు చేసి అప్లికేషన్ నింపాల్సి ఉంటుంది.

ఏఏ గుర్తింపు పత్రాలు అవసరం?

ఆధార్ కార్డు నెంబర్ ద్వారా కొవిన్​లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఆధార్ కార్డు లేని విద్యార్థుల సౌలభ్యం కోసం మరో గుర్తింపు పత్రాన్ని సైతం జాబితాలో చేర్చారు. ఇదివరకు 9 గుర్తింపు పత్రాలను టీకా రిజిస్ట్రేషన్ కోసం అనుమతిస్తుండగా.. తాజాగా విద్యా సంస్థ ఐడీ కార్డును సైతం టీకా రిజిస్ట్రేషన్ కోసం అనుమతించనున్నారు.

టీకాలు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు?

జనవరి 3వ తేదీ నుంచి అర్హులైన టీనేజర్లకు టీకాలు వేయనున్నారు. దీనిపై డిసెంబర్ 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేశారు.

పిల్లలకు ఏ కరోనా టీకాలు ఇస్తారు?

పిల్లలకు ఉపయోగపడే రెండు కరోనా టీకాలకు డీసీజీఐ అత్యవసర అనుమతులు జారీ చేసింది. భారత్​ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్, జైడస్ క్యాడిలా రూపొందించిన జైకోవ్-డీ టీకాలకు పచ్చజెండా ఊపింది. అయితే, చిన్నారుల వ్యాక్సినేషన్​లో కొవాగ్జిన్​ను మాత్రమే ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. జైకోవ్ టీకాకు అనుమతులు వచ్చినప్పటికీ.. ఆ వ్యాక్సిన్​ను పెద్దలకు ఇవ్వడం ప్రారంభించని నేపథ్యంలో ఒకే టీకాతో పిల్లల వ్యాక్సినేషన్ కొనసాగించనున్నట్లు సమాచారం.

వృద్ధులకు ప్రికాషన్ డోసు...

మూడో డోసు అందించే అంశంపైనా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ మాట్లాడారు. 60ఏళ్లు పైబడిన వృద్ధులకు, హెల్త్​కేర్ సిబ్బందికి 'ప్రికాషన్' డోసును అందించనున్నట్లు తెలిపారు.

'ప్రికాషన్ డోసు' అంటే ఏంటి?

ప్రికాషన్​ డోసుకు ప్రస్తుతం సరైన నిర్వచనం లేదు. టీకా రెండు డోసులు తీసుకున్నవారు.. మూడో డోసుగా వేరే రకం వ్యాక్సిన్​ను తీసుకోవడాన్ని ప్రికాషన్​ డోసు అనొచ్చని కొవిడ్​ వ్యాక్సినేషన్​ సాంకేతిక బృందం చెబుతోంది. అంటే, కొవాగ్జిన్​ టీకాలు తీసుకున్నవారికి మరో డోసుగా.. ఇతర వ్యాక్సిన్లు ఇవ్వడం అని అర్థం! ఇదే నిజమైతే.. మూడో డోసు తీసుకున్నామంటే.. అది పూర్తిగా కొత్త టీకా అవుతుంది.

ప్రికాషన్ డోసు ఎవరికి ఇస్తారు?

ఈ డోసు ప్రారంభంలోనే అందరికీ అందుబాటులో ఉండదు. హెల్త్​కేర్ సిబ్బందితో పాటు 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి ముందుగా ప్రికాషన్ డోసు అందిస్తారు. వైద్యుల సలహా మేరకు పంపిణీ చేస్తారు. మొత్తం 20 ఆరోగ్య సమస్యలను ఇందులో చేర్చారు. ఇవి ఉన్నవారు ప్రికాషన్ డోసు తీసుకోవచ్చు.

రెండు డోసులు తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకు ప్రికాషన్ డోసు ఇస్తారు?

రెండో డోసు తీసుకున్న తర్వాత 9 నుంచి 12 నెలలకు ప్రికాషన్ డోసు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీకా పంపిణీపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం ఈ మేరకు కాలవ్యవధిపై సమాలోచనలు చేస్తోంది. శాస్త్రీయ పద్ధతుల్లో అంచనా వేసి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ప్రికాషన్ డోసు తీసుకోవాలంటే ఏఏ సర్టిఫికేట్లు అవసరం?

వైద్య సమస్యలు ఉండి, రెండు టీకాలు తీసుకున్న 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు.. మెడికల్ సర్టిఫికెట్​ను సమర్పించాల్సి ఉంటుంది. తమకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి అందులో పేర్కొనాలి. నమోదిత మెడికల్ ప్రాక్టీషనర్ సంతకం దానిపై ఉండాలి. మిగతా రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. సాధారణ టీకా తీసుకున్నప్పటి మాదిరిగానే ఉంటుంది.

ప్రికాషన్ డోసు పంపిణీ ఎప్పుడు ప్రారంభిస్తారు?

జనవరి 10న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

ప్రికాషన్ డోసు తీసుకున్నట్టు ధ్రువీకరణ ఎలా?

మూడో డోసు తీసుకున్న లబ్ధిదారులకు మరో సర్టిఫికెట్​ జారీ చేస్తారు. రెండు డోసులు తీసుకున్న సర్టిఫికెట్ మాదిరిగానే ఇది కొవిన్ యాప్​లో అందుబాటులో ఉంటుంది.

ఇదీ చూడండి:India Covid cases: దేశంలో మరో 6,531 కరోనా కేసులు

Last Updated :Dec 27, 2021, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details