తెలంగాణ

telangana

ఛత్తీస్​గఢ్​ కొత్త సీఎంగా గిరిజన నేత- పేదలకు 18లక్షల ఇళ్లు ఇస్తామన్న విష్ణుదేవ్​ సాయ్​!

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 3:41 PM IST

Updated : Dec 10, 2023, 4:44 PM IST

Chhattisgarh New CM Vishnudev Sai : ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయ్‌ను బీజేపీ ఎంపిక చేసింది. కొత్త గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలంతా శాసనసభాపక్ష నేతగా సాయ్‌ను ఎన్నుకున్నారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా ఆయన సేవలందించారు.

Chhattisgarh New CM Vishnudev Sai
Chhattisgarh New CM Vishnudev Sai

Chhattisgarh New CM Vishnudev Sai :ఛత్తీస్​గఢ్​ నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్​ను ఎంపిక చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ మేరకు బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై విష్ణుదేవ్ సాయ్​ను తమ నాయకుడిగా ఎంచుకుంది. గతంలో ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా పనిచేసిన రమణ్‌ సింగ్‌ను కాదని ఈసారి బీజేపీ అధిష్ఠానం గిరిజన నాయకుడైన విష్ణుదేవ్‌ సాయ్‌వైపు మొగ్గు చూపింది.

మోదీ, షాకు కృతజ్ఞతలు!
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తానని కొత్త సీఎం విష్ణుదేవ్​ సాయ్ తెలిపారు. ముఖ్యమంత్రిగా తనను ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు చెప్పారు. తమ ప్రభుత్వం హౌసింగ్​ స్కీమ్​ ద్వారా పేదలకు 18 లక్షల ఇళ్లను మంజూరు చేస్తుందని వెల్లడించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లోని కుంకూరి నుంచి సాయ్​ విజయం సాధించారు.

అందరి ఎమ్యెలేలతో మాట్లాడిన తర్వాతే!
రాయ్​పుర్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శాసనసభా పక్షం ఆదివారం సమావేశమైంది. ఈ సమావేశంలో బీజేపీ అధిష్ఠానం నియమించిన ముగ్గురు పరిశీలకులు అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ కుమార్ హాజరయ్యారు. ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలందరితో విడివిడిగా మాట్లాడారు. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. చివరకు విష్ణుదేవ్​ సాయ్​ పేరును ఖరారు చేశారు.

పార్టీ పరిశీలకులు విష్ణుదేవ్​ సాయ్ పేరును ప్రతిపాదించగా 54 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆ తర్వాత శాసనసభా పక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ పరిశీలకులు హైకమాండ్‌కు కూడా తెలియజేశారు. విష్ణుదేవ్​ సాయ్​ను ముఖ్యమంత్రిగా ప్రకటించారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన విష్ణు దేవ్ సాయ్​కు పార్టీ హైకమాండ్ కూడా అభినందనలు తెలిపింది. విష్ణుదేవ్​ సాయ్​ను ముఖ్యమంత్రిగా ప్రకటించిన వెంటనే రాయ్​పుర్​లోని బీజేపీ కార్యాలయం బయట ఉన్న పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచుకుంటూ బీజేపీ, మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు.

ఎవరీ విష్ణుదేవ్​ సాయ్​?
1964 ఫిబ్రవర్ 21వ తేదీన జన్మించిన విష్ణుదేవ్​ సాయ్​కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. నాలుగు సార్లు ఎంపీ, రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా సేవలందించారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్‌లో కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రిగా సేవలందించారు. 2020 నుంచి 2022 వరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. జష్​పుర్​ నుంచి అసెంబ్లీ పోటీ చేయమని కేంద్ర మంత్రి ఆదేశించడం వల్ల సిద్ధమయ్యారు. జష్​పుర్​లోని మూడుస్థానాల్లో బీజేపీని గెలిపించారు. మొత్తం సర్గుజా డివిజన్‌లోని మొత్తం 14 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా, అందులో సాయ్​ మాత్రం కీలకం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బీజేపీ ఎన్నడూ గెలవని అనేక స్థానాల్లో కూడా సాయ్​ వ్యూహంతో బీజేపీ గెలిచింది.

తాజాగా డిసెంబర్​ 3వ తేదీన వెలువడిన ఫలితాల్లో బీజేపీ ఏకంగా 54 స్థానాల్లో విజయం సాధించింది. ఎగ్జిట్​ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయకేతనం ఎగరవేసింది. 90 సీట్లు ఉన్న అసెంబ్లీలో 2003లో 50, 2008లో 50, 2013లో 49 సీట్లు గెలుచుకొని సాధారణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాషాయదళం మునుపెన్నడూ లేనంతగా మెజార్టీని సొంతం చేసుకుంది. ఇక, గత నాలుగు ఎన్నికల్లో ఎన్నడూలేనంత తక్కువకు కాంగ్రెస్‌ సీట్లు పడిపోయింది.

Last Updated : Dec 10, 2023, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details