తెలంగాణ

telangana

'బిహార్ కల్తీ మద్యానికి 200 మంది బలి'.. ఆ పోలీస్ స్టేషన్ నుంచే 'సారా' లీక్!

By

Published : Dec 17, 2022, 5:06 PM IST

బిహార్​లో కల్తీ మద్యానికి బలయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా మరికొంతమంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 73కు పెరిగింది. అయితే, మరణాలపై ప్రభుత్వం వాస్తవాలు దాచేస్తోందని చిరాగ్ పాసవాన్ ఆరోపించారు. ఇప్పటివరకు 200 మంది చనిపోయారని చెప్పారు.

Etv Bharat
Etv Bharat

బిహార్​లో కల్తీ మద్యానికి బలయ్యే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఛాప్రా జిల్లాతో పాటు సరన్, సివాన్, బెగుసరాయ్ జిల్లాల్లోనూ కల్తీ మద్యం బారిన పడి పలువురు మరణించారు. ఫలితంగా ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 73కు పెరిగింది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకొని పరీక్షలకు తరలించారు.

మరోవైపు, ఈ కల్తీ మద్యం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్తీ మద్యం పోలీస్ స్టేషన్ల నుంచే బయటకు వెళ్లిందని సమాచారం. బిహార్​లోని ఎక్సైజ్ శాఖ భారీ మోతాదులో కల్తీ మద్యాన్ని తయారు చేసే పదార్థాలను స్వాధీనం చేసుకుని.. ధ్వంసం చేసేందుకని మష్రక్ పోలీస్ స్టేషన్​లో ఉంచింది. అయితే, డ్రముల్లో ఉంచిన కల్తీ మద్యం అదృశ్యం అయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇది కచ్చితంగా పోలీస్​ స్టేషన్​లోని సిబ్బంది నిర్వకమే అని పలువురు విమర్శిస్తున్నారు. కాగా, చికిత్స పొందుతున్న బాధితులు.. తాము మద్యాన్ని మష్రక్‌ మార్కెట్‌ నుంచే కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. కల్తీ మద్యం కేసులో 48 గంటల్లో 213 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. బాధితుల్లో 25 మంది కంటిచూపు కోల్పోయారని చెప్పారు. మృతుల్లో 30 మందికి శవపరీక్షలు జరిగాయని తెలిపారు.

'200 మంది చనిపోయారు'
కాగా, కల్తీ మద్యానికి 200 మందికి పైగా బలయ్యారని విపక్ష ఎల్​జేపీ(రాంవిలాస్) నేత చిరాగ్ పాసవాన్ ఆరోపించారు. నిజాన్ని అణచివేస్తున్నారని మండిపడ్డారు. పోస్టుమార్టం పరీక్షలు లేకుండానే అంత్యక్రియలు ముగించేస్తున్నారని చెప్పుకొచ్చారు. 'బాధిత కుటుంబాలపై ఒత్తిడి తెస్తున్నారు. మరణానికి కల్తీ మద్యం కాదని చెప్పాలని బెదిరిస్తున్నారు. లేదంటే జైలుకు పంపుతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. సీఎం మౌనం అవినీతి అధికారులకు వరంగా మారింది' అని పాశవాన్ వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టులో పిటిషన్..
ఈ కల్తీ మద్యం ఘటనపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ దుర్ఘటనపై సిట్‌తో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని పిటిషన్‌లో డిమాండ్‌ చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ముందు న్యాయవాది పవన్‌ ప్రకాశ్‌ పాఠక్‌ ఈ పిటిషన్‌ను ప్రస్తావించారు. అయితే, అత్యవసర విచారణ కోసం పిటిషన్‌ను జాబితా చేయడానికి ధర్మాసనం నిరాకరించింది.

ABOUT THE AUTHOR

...view details