తెలంగాణ

telangana

Cash On Delivery Fake Orders : క్యాష్ ఆన్​ డెలివరీతో బిగ్ స్కామ్.. ఫేక్ ప్రొడక్ట్స్​ ఇచ్చి, డబ్బులు కాజేసి..

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 7:42 AM IST

Cash On Delivery Fake Orders : ఈ-కామర్స్​ కంపెనీల డేటా దొంగిలించి.. వినియోగదారులకు నకిలీ వస్తువులు పంపిస్తున్న మోసగాళ్ల గుట్టురట్టైంది. ఈ మేరకు బెంగళూరు పోలీసులు 21 మందితో కూడిన అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు.

Cash On Delivery Fake Orders
Cash On Delivery Fake Orders

Cash On Delivery Fake Orders :బెంగళూరులో ఆన్​లైన్​ మోసగాళ్ల గుట్టురట్టైంది. ఈ-కామర్స్​ కంపెనీల నుంచి 'క్యాష్​ ఆన్​ డెలివరీ' ఆర్డర్ల డేటాను దొంగిలించి.. ఆర్డర్​ చేసిన వస్తువులకు బదులుగా నకిలీ వస్తువులను పంపుతున్న మోసగాళ్లను బెంగళూరు నార్త్​ డివిజన్ సీఈఎన్ పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి, గుజరాత్​, మధ్యప్రదేశ్​కు చెందిన మొత్తం 21 మందిని అరెస్ట్ చేశారు. వీరు రెండేళ్లుగా దాదాపు రూ. 70 లక్షల దాకా మోసం చేశారని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఈ-కామర్స్​ కంపెనీలు, షిప్పింగ్ కంపెనీల నుంచి డేటా దొంగిలించే వారు. ఎక్కువగా క్యాష్​ ఆన్ డెలివరీ ఆర్డర్లను (Cash On Delivery Orders) లక్ష్యంగా చేసుకునే వారు. ఇలా కొన్ని కొరియర్​ సర్వీసులను వాడుకుని.. వినియోగదారులు ఆర్డర్​ చేసిన తేదీ కన్నా.. ముందే వారి అడ్రస్​కు నకిలీ వస్తువులు పంపించేవారు. అనంతరం డబ్బులు వసూలు చేసుకునే వారు. అయితే, అవి నకిలీ వస్తువులు అని గ్రహించిన వినియోగదారులు.. వాటిని ఈ-కామర్స్​ కంపెనీలకు రిటర్న్ చేసేవారు. ఫలితంగా ఈ-కామర్స్​ కంపెనీలు నష్టాలు చవిచూసేవి.

'సాధారణంగా ఈ-కామర్స్ కంపెనీలు వస్తువులను ఔట్‌సోర్స్‌ కంపెనీలకు (E Commerce Outsourcing Services) విక్రయిస్తాయి. ఆ కంపెనీల్లో పనిచేసే కొందరు వ్యక్తులు.. మోసగాళ్ల నుంచి డబ్బులు తీసుకుని డేటా విక్రయిస్తున్నారు. అయితే, ఆ కంపెనీలు ఎట్టిపరిస్థితుల్లోనూ డేటాను బహిర్గతం చేయకూడదని నిబంధన ఉంది. చాలా ఆర్డర్‌లలో వినియోగదారులు నగదు రూపంలో డబ్బులు చెల్లిస్తారు. దీంతో ఎవరి నుంచి డబ్బులు తీసుకున్నా.. సమాచారం బయటకు రాకూడదనే ఉద్దేశంతో మోసగాళ్లు ఇలా చేసేవారు. కొన్నిసార్లు మోసగాళ్లు క్యూఆర్‌ కోడ్‌ను ఉపయోగించి కూడా కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకునేవారు' అని బెంగళూరు నార్త్​ డివిజన్ డీసీపీ శివప్రకాశ్ దేవరాజు తెలిపారు.

2021 జూన్ నుంచి రూ.70 లక్షల నష్టం వాటిల్లిందని నార్త్ డివిజన్‌లోని సీఈఎన్ స్టేషన్‌లో ఒక షిప్‌మెంట్ కంపెనీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. కొరియర్ సబ్-షిప్పింగ్​ కంపెనీ సమాచారం, నిందితులు కస్టమర్లకు పంపిన నకిలీ షిప్​మెంట్​ డాక్యుమెంట్, కేవైసీ, బ్యాంక్ ఖాతా సమాచారాన్ని రాబట్టి దర్యాప్తు చేశారు. ముంబయి, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి మొత్తం 21 మంది నిందితులను అరెస్టు చేశారు. అయితే, దొంగిలించిన డేటాను అమ్మి నిందితులు మరిన్ని డబ్బులు సంపాదించారని పోలీసుల విచారణలో వెల్లడైంది. అరెస్టయిన వారి ఖాతాల నుంచి రూ.26.95 లక్షలు నగదు, 11 మొబైల్ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ శివప్రకాశ్ తెలిపారు.

భారీ ఆన్​లైన్ మోసం.. ఆర్డర్​ చేసిన ఐఫోన్స్, యాపిల్ వాచ్​ను ఎత్తుకెళ్లిన డెలివరీ బాయ్స్

ఆన్​లైన్ ఆఫర్ల వలలో పడితే.. తప్పదు భారీ మూల్యం

ABOUT THE AUTHOR

...view details