తెలంగాణ

telangana

'దేశ విభజనకు మోదీ యత్నం.. ఐక్యత కోసం కాంగ్రెస్ కృషి'

By

Published : May 16, 2022, 3:32 PM IST

Rahul Gandhi in Rajasthan: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. దేశాన్ని విభజించాలని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలకు ఒక దేశం, పేదలు అణగారిణ వర్గాలతో కూడిన మరో దేశాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

Rahul Gandhi in Rajasthan
Rahul Gandhi in Rajasthan

Rahul Gandhi on PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని రెండుగా మార్చుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హిందుస్థాన్ ధనిక, పేద అనే దేశాలుగా మారిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అందరినీ కలుపుకొంటూ వెళ్తుంటే.. భాజపా ప్రజలను విభజిస్తోందని ఆరోపించారు. ఆదివాసీల ప్రాబల్యం అధికంగా ఉండే దక్షిణ రాజస్థాన్​లోని బంస్వారా ప్రాంతంలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. భాజపాపై విమర్శలు గుప్పించారు. రెండు భిన్నమైన భావజాలాల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు.

"మోదీ రెండు భారత దేశాలను తయారు చేయాలని అనుకుంటున్నారు. దళితులు, రైతులు, పేదలు, అణగారిన వర్గాలకు ఒక దేశాన్ని.. ఇద్దరు- ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసం మరో దేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్​ మాత్రం ఒకే భారత్​ను కోరుకుంటోంది. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలనే కాంగ్రెస్ చెబుతుంది. అణచివేయడం, విభజించడం, చరిత్రను ఏమార్చేందుకు ప్రయత్నించడం, ఆదివాసీల సంస్కృతిని నాశనం చేయడమే భాజపా చేసే పని. మేం పేద ప్రజలకు అండగా ఉంటే.. వారు కొందరు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్నారు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

Rahul Gandhi on Indian economy:యూపీఏ ప్రభుత్వం బలంగా తీర్చిదిద్దిన భారత ఆర్థిక వ్యవస్థను మోదీ ధ్వంసం చేస్తున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. "భాజపా ప్రభుత్వం మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. నోట్లరద్దు పరిణామాలు, జీఎస్టీని సరిగా అమలు చేయకపోవడం వంటి కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా మారేందుకు యూపీఏ ప్రభుత్వం పనిచేసింది. నరేంద్ర మోదీ మాత్రం ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తున్నారు. తమకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదని దేశంలో యువత భావిస్తోంది. ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరుగుతోంది" అని రాహుల్ విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం మూడు చట్టాలను తీసుకొచ్చిందన్న రాహుల్.. అన్నదాతల నిరసనలకు తలొగ్గి వెనక్కి తీసుకుందని అన్నారు. ఆ చట్టాల వల్ల ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలకే ప్రయోజనం కలిగేదని ఆరోపించారు.

Rahul Rajasthan Banswara rally: కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీలతో ఎంతో కాలం నుంచి లోతైన అనుబంధం ఉందని రాహుల్ చెప్పుకొచ్చారు. 'మీ చరిత్రను గౌరవిస్తాం. దాన్ని సంరక్షిస్తాం. యూపీఏ పాలనలో చారిత్రక చట్టాలను తీసుకొచ్చి ఆదివాసీల అడవులు, నీటివనరులను సంరక్షించాం' అని చెప్పారు. ఈ సందర్భంగా రాజస్థాన్​లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు. రైతులు, దళితులు, ఆదివాసీలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అశోక్ గహ్లోత్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.

ఇదే సభలో మాట్లాడిన గహ్లోత్.. దేశంలో ఆందోళనకర పరిస్థితి ఉందని.. శాంతి భద్రతలు ఉంటేనే దేశం పురోగతి సాధిస్తుందని అన్నారు. 70 ఏళ్లుగా దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్ పనిచేస్తూ వచ్చిందని.. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ దేశానికి ప్రయోజనం కలిగేలా ఉంటాయని చెప్పారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details