తెలంగాణ

telangana

లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన​ BJP ఎమ్మెల్యే కొడుకు.. పదవికి రాజీనామా

By

Published : Mar 3, 2023, 10:34 AM IST

Updated : Mar 3, 2023, 12:57 PM IST

కర్ణాటకలోని ఓ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. అనంతరం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు రూ. 6 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

BJP MLA SON Caughte receiveing 40 lakh bribe
BJP MLA SON Caughte receiveing 40 lakh bribe

కర్ణాటక చెన్నగిరి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే, సోప్స్‌ అండ్‌ డిటర్జెంట్స్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ మాడాళు విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్​ కుమార్​ లోకాయుక్త అధికారులకు చిక్కారు. గురువారం తన కార్యాలయంలో రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. నిందితుడి​తో పాటు డబ్బులు ఇచ్చేందుకు వచ్చిన అతడి బంధువు సిద్ధేశ్, అకౌంటంట్​ సురేంద్ర, నికోలస్​, గంగాధర్​ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రశాంత్​ కుమార్​ ఇంట్లో శుక్రవారం ఉదయం 4 గంటల వరకు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ. 6 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కాగా, కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు ఇలా పట్టుబడటం.. ప్రతిపక్షాలకు ఓ ఆయుధంగా మారింది. దీంతో ప్రశాంత్​ కుమార్​ తన తండ్రికి బదులు కాంట్రాక్టర్​ నుంచి లంచం తీసుకుంటున్నారంటూ అధికార పక్షంపై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు.

సోదాలు నిర్వహిస్తున్న అధికారులుసోదాలు నిర్వహిస్తున్న అధికారులు

లోకాయుక్త అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రశాంత్​ కుమార్.. ​బెంగళూరు వాటర్​ సప్లై, సీవరేజ్​ బోర్డులో చీఫ్​ అకౌంటంట్​గా పనిచేస్తున్నారు. కాగా, ఆయన తండ్రి, చెన్నగిరి ఎమ్మెల్యే మాడాళు విరూపాక్షప్ప కర్ణాటక సోప్స్ అండ్ డిటెర్జెంట్​ లిమిటెడ్​​ కంపెనీకి ఛైర్మన్​గా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీ ప్రముఖ మైసూర్​ సాండల్​ సోప్​ అనే బ్రాండ్​ సబ్బులను తయారు చేస్తోంది. సబ్బు, ఇతర డిటెర్జెంట్ల తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు సప్లై చేసే కాంట్రాక్టు కావాలంటే రూ. 80 లక్షల లంచం ఇవ్వాల్సిందిగా ఓ వ్యాపారిని డిమాండ్​ చేశారు ప్రశాంత్​ కుమార్​. దీంతో బాధితుడు వారం రోజుల క్రితం లోకాయుక్త అధికారులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పాడు. అనంతరం బాధితుడితో కలిసి అధికారులు ప్రశాంత్​ కుమార్​కు వల పన్నారు. రూ. 40 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అయితే, గతేడాది అవినీతి నిరోధక శాఖను రద్దు చేసి.. దానికి బదులు లోకాయుక్తను ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం.

డబ్బు కట్టలు లెక్కిస్తున్న అధికారులు

ఎమ్మెల్యే రాజీనామా..
ఈ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే మాడాళు విరూపాక్షప్ప.. కర్ణాటక సోప్స్ అండ్ డిటెర్జెంట్​ లిమిటెడ్​​ కంపెనీ ఛైర్మన్​ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. "నా కుటుంబంపై ఏదో కుట్ర జరుగుతోంది. నాపై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ.. కేఎస్​డిఎల్​ కంపెనీ పదవికి రాజీనామా చేస్తున్నా" అని లేఖలో పేర్కొన్నారు.

మా స్టాండ్​ క్లియర్​ : ముఖ్యమంత్రి
'లోకాయుక్త.. మా ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో సోదాలు చేసింది'.. అవినీతిని తాము అరికడుతునామని చెప్పడానికి ఈ సంఘటనే ఓ నిదర్శనమని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వ్యాఖ్యానించారు. అందుకే లోకాయుక్తను తీసుకొచ్చామని చెప్పారు. కానీ.. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, మంత్రులు తమపై అవినీతి కేసుల్ని కప్పిపుచ్చుకోడానికి గత ప్రభుత్వంలో ఈ సంస్థ రాకుండా అడ్డుకున్నారని.. అందుకోసం అవినీతి నిరోధక శాఖను వాడుకున్నారని ఆరోపించారు. లోకాయుక్త లాంటి సంస్థ లేనందునే గతంలో అవినీతి కేసులు విచారించేవారు కాదన్నారు. "మా స్టాండ్​ క్లియర్​గా ఉంది. స్వంతంత్ర లోకాయుక్త నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుంది. నిందితులపై చర్యలు తీసుకుంటాము" అని బొమ్మై అన్నారు.

కర్ణాటక మంత్రి రాజీనామా..
గతంలో కూడా కర్ణాటక అధికార బీజేపీ పార్టీ నేతలపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పనిచేసిన ఈశ్వరప్పపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. లంచం డిమాండ్ చేయడం వల్ల ఓ కాంట్రాక్టర్​ మరణానికి కారణమయ్యారని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈశ్వరప్పపై కేసు కూడా నమోదైంది. దీంతో పలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ పరిణామాల వల్ల ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేశారు.

Last Updated : Mar 3, 2023, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details