తెలంగాణ

telangana

శిందేపై వేటు.. సీఎంగా పవార్.. బీజేపీ కొత్త స్కెచ్ ఇదేనా?

By

Published : Jul 3, 2023, 5:37 PM IST

Updated : Jul 3, 2023, 5:57 PM IST

Ajit Pawar Next CM Maharashtra : మహారాష్ట్ర రాజకీయం మరో మలుపు తిరగనుందా? ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే, ఆయన వర్గంలోని 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమా? శిందే స్థానంలోకి అజిత్ పవార్ రానున్నారా? 2024 లోక్​సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో ఏం జరగనుంది?

ajit pawar as maharastra cm
ajit pawar as maharastra cm

"అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం.. ఏక్​నాథ్​ శిందే ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడానికి ఆరంభం. శిందే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది. అయినా బీజేపీ అధికారంలో కొనసాగేందుకు వీలుగా అజిత్ పవార్, ఎన్​సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో చేరారు."
--సంజయ్ రౌత్, శివసేన(యూబీటీ) నేత

"అజిత్ పవార్​ బీజేపీతో వెళ్తారని నేను గతంలో చెబితే అంతా విమర్శించారు. అజిత్​ పవార్​కు ఏం పదవి ఇవ్వాలన్నదానిపైనే ఇప్పటివరకు బేరసారాలు జరిగాయి. మాకు ఉన్న సమాచారం ప్రకారం.. స్పీకర్ సాయంతో ఏక్​నాథ్​ శిందే వర్గాన్ని పక్కకు నెట్టి, అజిత్ పవార్​ను ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు."
--పృథ్వీరాజ్ చవాన్, కాంగ్రెస్ సీనియర్ నేత

Ajit Pawar Next CM Maharashtra : మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమా? ప్రస్తుత సీఎం ఏక్​నాథ్​ శిందే సహా ఆయన వర్గానికి చెందిన మొత్తం 16 శాసనసభ్యులపై అనర్హత వేటు పడుతుందా? ఎన్​సీపీ నేత అజిత్ పవార్.. మహారాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపడతారా? ఆదివారం జరిగిన నాటకీయ పరిణామాల వెనుక బీజేపీ అసలు వ్యూహం ఇదేనా?.. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇవే ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఏక్​నాథ్ శిందే వర్గం ఎమ్మెల్యేల మెడపై 'అనర్హత కత్తి' వేలాడుతూ ఉండడమే. శివసేనను చీల్చి, కమలదళంతో చేతులు కలిపిన శిందే వర్గంపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేస్తే మహారాష్ట్ర రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అనర్హత ఎందుకు?
2019 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ 145. అజిత్ పవార్ సాయంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. నాలుగు రోజులకే కుప్పకూలింది. ఆ తర్వాత కాంగ్రెస్, ఎన్​సీపీ, శివసేన కలిసి 'మహా వికాస్​ అఘాడీ' పేరుతో జట్టుకట్టాయి. కూటమి బలం 154 సీట్లకు చేరింది. శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరింది.

అయితే.. శిందే రూపంలో కూటమికి పెద్ద షాక్ తగిలింది. శివసేన రెండు వర్గాలుగా విడిపోయింది. 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని వీడి బీజేపీతో జట్టుకట్టారు ఏక్​నాథ్ శిందే. ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత శిందే వర్గంలోని శివసేన ఎమ్మెల్యేల సంఖ్య 40కి పెరిగింది.

శింథే తిరుగుబాటుపై శివసేన-ఉద్ధవ్ బాల్​ ఠాక్రే వర్గం న్యాయపోరాటానికి దిగింది. అయితే.. 16 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే అనర్హత నోటీసులు జారీ చేసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ రాహుల్​ నర్వేకర్​కు మే 11న సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకు ఆగస్టు 11 వరకు గడువు ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.

అనర్హత వేటు ఖాయమా?
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై మే 11న తీర్పు ఇచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2022 జూన్​లో విశ్వాస పరీక్షకు పిలుపునిచ్చే విషయంలో గవర్నర్​ పొరపాటు చేశారని అభిప్రాయపడింది. తద్వారా ఏక్​నాథ్ శిందే సహా ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు మార్గం సుగమం చేసిందనేది నిపుణుల విశ్లేషణ. అదే జరిగితే అజిత్​ పవార్​ సీఎం అయ్యే అవకాశముంది.

అనర్హత వేటు వేస్తే ఏమవుతుంది?
సీఎం ఏక్​నాథ్​ శిందే, ఆయన వర్గంలోని 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా.. మహారాష్ట్రలోని ఎన్​డీఏ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారిక వర్గాలు తెలిపాయి. అజిత్ పవార్ వర్గం మద్దతు లభించడమే ఇందుకు కారణమని వివరించాయి.

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 288. ఇందులో బీజేపీకి 105 సభ్యుల బలం ఉంది. అజిత్​ పవార్​ వెంట 40 మంది ఎన్​సీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. కనీసం మరో 10 మంది స్వతంత్రులు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే మహారాష్ట్రలోని ఎన్​డీఏ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నట్టే. ఇలాంటి పరిస్థితుల్లో 16 మంది శిందే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా అధికార పక్షానికి ఎలాంటి ముప్పు లేదు.

కావాలనే తప్పిస్తారా?
అజిత్ పవార్​ చేరిక తర్వాత మహారాష్ట్ర విషయంలో బీజేపీ వ్యూహంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శిందే నేతృత్వంలో లోక్​సభ ఎన్నికలకు వెళ్తే మెరుగైన ఫలితాలు సాధించలేమని.. కావాలనే ఆయన్ను పక్కకు తప్పిస్తున్నారన్న విశ్లేషణలు వచ్చాయి. "మహారాష్ట్రలో 48 లోక్​సభ స్థానాలు ఉండగా.. కనీసం 45 లోక్​సభ స్థానాలు గెలుచుకోవాలని బీజేపీ అనుకుంటోంది. అయితే.. శిందే నాయకత్వంలో అది సాధ్యం కాదని ఆ పార్టీ అనుమానం. గతేడాది జూన్​లో శిందేను సీఎంగా చేయడం ద్వారా బీజేపీ మరాఠా కార్డ్ ప్రయోగించింది. ఇప్పుడు ఆయన్ను మించిన మరాఠా నేత అజిత్ పవార్ రూపంలో ఆ పార్టీకి దొరికారు." అని సీనియర్ జర్నలిస్ట్, ప్రకాశ్ అకోల్కర్​ అభిప్రాయపడ్డారు.

అయితే.. ఈ వాదనల్ని బీజేపీ తోసిపుచ్చింది. "అనర్హత వేటు విషయంలో అసలు మాకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడదు. ఒకవేళ వచ్చినా మా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మాకు సరిపడా సంఖ్యాబలం ఉంది." అని బీజేపీ నేత మాధవ్ భండారి సోమవారం అన్నారు.

శాఖల కేటాయింపుపై తర్జనభర్జన
అజిత్​ పవార్​ వర్గానికి మంత్రివర్గంలో శాఖల కేటాయింపుపై ఎన్​డీఏలో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. సోమవారం ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​తో ముంబయిలో సమావేశమై ఇదే విషయంపై సమాలోచనలు జరిపారు అజిత్ పవార్. కొత్త కూటమికి సంబంధించిన ఇతర అంశాలపైనా చర్చించారు.
మహారాష్ట్ర మంత్రిమండలిలో మొత్తం 43 మంది ఉండొచ్చు. ఇప్పటివరకు బీజేపీ తరఫున 10 మంది, శివసేన(శిందే వర్గం) తరఫున 10 మంది కేబినెట్​లో ఉన్నారు. ఆదివారం అజిత్​ పవార్ సహా మొత్తం 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశాక.. మహారాష్ట్ర మంత్రుల సంఖ్య 29కి చేరింది. మరో 14 మందిని చేర్చుకునే అవకాశం ఉంది.

Last Updated : Jul 3, 2023, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details