తెలంగాణ

telangana

వర్చువల్ భేటీలో శ్రీలంకకు భారత్ ఆర్థిక వరాలు

By

Published : Sep 26, 2020, 3:33 PM IST

భారత్- శ్రీలంక ప్రధానమంత్రుల మధ్య జరిగిన అత్యున్నత సమావేశంపై విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. శ్రీలంక కేంద్ర బ్యాంకుకు 400 మి. డాలర్ల నగదు మార్పిడి సహాయాన్ని భారత్ అందించినట్లు తెలిపింది. ఇరుదేశాల మధ్య బౌద్ధ సంబంధాలు పెంపొందించేందుకు ప్రధాని మోదీ.. 15 మిలియన్ డాలర్లు ప్రకటించారని పేర్కొంది.

India extends USD 15 mn grant assistance to Sri Lanka
వర్చువల్ భేటీలో శ్రీలంకకు భారత్ ఆర్థిక వరాలు!

భారత్- శ్రీలంక మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీలంకకు ఆర్థిక సాయం ప్రకటించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇరు దేశాల మధ్య బౌద్ధ సంబంధాలు పెంపొందించేందుకు 15 మిలియన్ డాలర్లు ప్రకటించారని వెల్లడించింది.

ఇదీ చదవండి-పొరుగు దేశాల్లో శ్రీలంకకే తొలి ప్రాధాన్యం: మోదీ

ఆర్థిక సహకారాన్ని మరింత సుదృఢం చేసుకునేందుకు ఇరుదేశాలు చర్యలు తీసుకుంటున్నాయని విదేశాంగ శాఖ హిందూ మహాసముద్ర ప్రాంత డివిజన్ సంయుక్త కార్యదర్శి అమిత్ నారంగ్ వివరించారు. కరోనా పోరు సహా వైరస్ ప్రభావ పరిస్థితులపై పోరాడేందుకు శ్రీలంక కేంద్రీయ బ్యాంకుకు 400 మిలియన్ డాలర్ల నగదు మార్పిడి సహాయాన్ని భారత్ అందించినట్లు తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్​లోని కుశీనగర్​కు ప్రారంభించనున్న తొలి విమానంలో శ్రీలంక బౌద్ధ యాత్రికులకు అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.

తమిళుల సమస్యపై

తమిళుల ఆకాంక్షలను సాకారం చేసేలా పనిచేయాలని శ్రీలంక ప్రభుత్వానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. రక్షణ సంబంధాలతో పాటు మత్స్యకారుల సమస్యపైనా చర్చించినట్లు పేర్కొంది.

"న్యాయం, సమానత్వం, శాంతి, గౌరవంపై తమిళులు పెట్టుకున్న అంచనాలను నిజం చేసేలా పనిచేయాలని శ్రీలంక ప్రభుత్వానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తమిళుల సమస్యను పరిష్కరించేందుకు శ్రీలంక రాజ్యాంగం 13వ సవరణను అమలు చేయాలని నొక్కిచెప్పారు. మత్స్యకారుల సమస్యపై చర్చించిన నేతలు.. నిర్మాణాత్మక, మానవత్వంతో కూడిన విధానంతో బంధం బలోపేతం చేయాలని నిర్ణయించారు. రక్షణ రంగంలో సహకారంపై ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. నావికా దళ భద్రత సంబంధాలను మరింత పటిష్ఠపరుచుకోవాలని నిర్ణయించారు."

-మోదీ, రాజపక్స భేటీపై విదేశాంగ శాఖ ప్రకటన

మోదీకి ఆహ్వానం

భారత్ సహకారంతో నిర్మిస్తున్న జాఫ్నా సాంస్కృతిక కేంద్రం గురించి శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నిర్మాణం దాదాపుగా పూర్తయిందని పేర్కొంది. సాంస్కృతిక కేంద్రం ఆవిష్కరణ మహోత్సవానికి ప్రధాని మోదీని రాజపక్స ఆహ్వానించారని వెల్లడించింది.

మరోవైపు, పలు ఉత్పత్తుల ఎగుమతిపై శ్రీలంక విధించిన తాత్కాలిక నిషేధం త్వరలోనే ఎత్తివేస్తారని మోదీ ఆశాభావం వ్యక్తం చేసినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. నిషేధం ఎత్తివేయడం ద్వారా శ్రీలంకతో పాటు సాధారణ పౌరులకూ మేలు కలుగుతుందని మోదీ పేర్కొన్నట్లు తెలిపింది.

చర్చల ఫలితాలపై..

ప్రధాని మోదీ, శ్రీలంక ప్రధాని రాజపక్స మధ్య జరిగిన చర్చల ఫలితాలు ముందుచూపుతో కూడి ఉన్నాయని తెలిపింది. ఇరుదేశాల సంబంధాలు మరింత పెంచుకోవడానికి, ప్రతిష్ఠాత్మక అజెండాలు రూపొందించుకోవడానికి చర్చల ఫలితాలు ఉపయోగపడతాయని పేర్కొంది. కరోనా ఆంక్షలు ఉన్నప్పటికీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం.. నేతల నిబద్ధతకు నిదర్శనమని కొనియాడింది.

రుణాల చెల్లింపును వాయిదా వేయాలన్న శ్రీలంక అభ్యర్థనపై సాంకేతిక అంశాల్లో చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details