తెలంగాణ

telangana

'కర్తార్​పుర్ నడవా పునరుద్ధరణ పాక్ కపట నాటకమే!'

By

Published : Jun 27, 2020, 8:35 PM IST

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కర్తార్​పుర్​ నడవా పునఃప్రారంభం సాధ్యం కాదని భారత్​ తేల్చిచెప్పింది. నడవా పునరుద్ధరణకు పాక్​ చేసిన ప్రతిపాదన మంచితనాన్ని చాటుకునే ప్రయత్నమని భారత్ విమర్శించింది. రెండురోజుల ముందు సంసిద్ధత వ్యక్తం చేయటం నడవా ఒప్పందానికి విరుద్ధమని స్పష్టం చేసింది.

Kartarpur
కర్తార్​పుర్

కర్తార్​పుర్ నడవా పునరుద్ధరణ విషయంలో పాక్ ప్రతిపాదనపై భారత్​ స్పందించింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో నడవాను తిరిగి ప్రారంభించేందుకు విముఖత వ్యక్తం చేసింది. తన సహృదయాన్ని చాటుకున్నట్లు పాక్ తప్పుడు ప్రయత్నాలు చేస్తోందని భారత సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

"రెండు రోజుల స్వల్ప వ్యవధిలో జూన్ 29న కర్తార్‌పుర్ నడవాను తిరిగి ప్రారంభించాలని ప్రతిపాదించింది. ఇది తన సద్భావనగా చెప్పుకొనేందుకు పాక్​ చేస్తోన్న అసంబద్ధ ప్రయత్నమని గమనించాలి. నడవాకు సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ప్రయాణ తేదీకి కనీసం 7 రోజుల ముందు సమాచారం పంచుకోవాలి. రిజిస్ట్రేషన్​ ప్రకియ తదితరాల కోసం ఈ ఏర్పాటు చేసుకున్నాం."

- భారత సీనియర్ అధికారి

కరోనా కారణంగా మార్చి 16 నుంచి మూతపడిన కర్తార్​పుర్​ కారిడార్​ను పునఃప్రారంభించడానికి పాకిస్థాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. సిక్కుల మత గురువు రంజీత్ సింగ్ వర్ధంతి నేపథ్యంలో సోమవారం నుంచి రహదారిని తిరిగి తెరవడానికి సిద్ధమని ఆ దేశ విదేశాంగ కార్యాలయం ప్రకటించింది. దీనికోసం అవసరమైన మార్గదర్శకాలు రూపొందించుకునేందుకు భారత్​ను ఆహ్వానించింది.

కరోనా కారణంగా...

అయితే భారత్​తో పాటు పాకిస్థాన్​లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. నానాటికీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వ్యాప్తి రేటులో పాకిస్థాన్​ ముందంజలో ఉంది. ఇప్పటికే పడకలు నిండుకోగా ఆసుపత్రుల్లో సరైన వసతులు కూడా లేవు.

ఈ నేపథ్యంలో నడవా ప్రారంభం సాధ్యం కాదని అధికారి వివరించారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా సరిహద్దు ప్రయాణాలపై నిషేధం ఉంది. ఈ విషయంలో వైద్యులు, సంబంధిత అధికారుల సలహాలను పరిశీలించి ముందుకెళతామని స్పష్టం చేశారు.

దౌత్య సంబంధాలూ..

దిల్లీలోని హైకమిషన్​ ఉద్యోగులను 50 శాతం తగ్గించాలని పాక్​ను ఇటీవల భారత్ కోరింది. భారత్​కూడా తమ దౌత్య కార్యాలయంలో సిబ్బంది సంఖ్యను తగ్గిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పాక్ కపట నాటకాలు ఆడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఒప్పందంలోని అంశాలను పాక్ పూర్తి చేయని కారణంగా యాత్రికుల భద్రతపై భారత్ అనుమానం వ్యక్తం చేస్తోంది.

"కర్తార్​పుర్​ నడవా ఒప్పందంలో భాగంగా రావి నదీ ప్రవాహాన్ని అడ్డుకునేలా పాక్​లో వంతెన నిర్మించాల్సి ఉంది. అయితే పాకిస్థాన్​ దీని నిర్మాణం పూర్తి చేయలేదు. ప్రస్తుత రుతుపవన కాలంలో యాత్రికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది."

- భారత సీనియర్ అధికారి

4 కిలోమీటర్ల దూరంలో..

సిక్కుల సందర్శనార్థం పాకిస్థాన్​లోని కర్తార్​పుర్​ నుంచి భారత్​లోని గురుదాస్​పుర్​ వరకు కారిడార్​ను ఇరుదేశాలు కలిసి నిర్మించాయి. గతేడాది నవంబర్​లో ఈ కారిడార్​ను ప్రారంభించాయి. పాక్​లోని నరోవాల్ జిల్లా రావి నది సమీపంలో కర్తార్​పుర్ సాహిబ్ గురుద్వారా ఉంది. భారత్​లోని డేరాబాబా నానక్ నుంచి ఈ ప్రాంతం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.

సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ తన జీవిత చరమాంకాన్ని కర్తార్​పుర్​లోనే గడిపినట్లు భక్తులు విశ్వసిస్తారు. 18 ఏళ్ల పాటు గురునానక్ ఈ ప్రాంతంలో జీవించారు. భారత్​లోని అన్ని మతాల ప్రజలకు ఈ చారిత్రక గురుద్వారాను సందర్శించుకోవడానికి అనుమతి ఉంటుంది.

- స్మితా శర్మ, సీనియర్ పాత్రికేయురాలు

ఇదీ చూడండి:కర్తార్​పుర్ కారిడార్ పునఃప్రారంభానికి పాకిస్థాన్ రెడీ

ABOUT THE AUTHOR

...view details