తెలంగాణ

telangana

కాంగ్రెస్​కు ఖుష్బూ రాజీనామా.. భాజపాలో చేరిక!

By

Published : Oct 12, 2020, 11:28 AM IST

ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపారు. ఖుష్బూను అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ ప్రకటించిన కాసేపటికే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధం లేని నేతల దిశానిర్దేశం నచ్చక కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ఖుష్బూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

Khushboo Sundar resigns from Congres
కాంగ్రెస్​కు ఖుష్బూ రాజీనామా

దక్షిణాదిన కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ నటి ఖుష్బూ.. కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారంటూ ఆమెను తొలుత జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి కాంగ్రెస్‌ అధిష్టానం తొలగించింది. అనంతరం కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఖుష్బూ ప్రకటించారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు.

దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు సోనియాకు లేఖలో కృతజ్ఞతలు తెలిపారు ఖుష్భూ. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తోన్న తన లాంటి వ్యక్తులకు కాంగ్రెస్‌లో గుర్తింపు లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా తీవ్రంగా ఆలోచించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధం లేని నేతల పెత్తనం నచ్చక పార్టీని వీడుతున్నట్లు ఖుష్బూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

భాజపా గూటికి..

ఖుష్బూ భాజపాలో చేరతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అక్టోబరు 10న ఆమె చేసిన ట్వీట్​ను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

" నాలో చాలా మార్పులొచ్చాయి. వయసుతో పాటే వృద్ది చెందుతాం. ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. ఇష్టాఇష్టాలు మారతాయి. ఆలోచనలకు కొత్త రూపు వస్తుంది. కొత్త కలలు కంటాం. ఇష్టానికి ప్రేమకు మధ్య తేడాను అర్థం చేసుకుంటాం. తప్పొప్పులు తెలుసుకుంటాం. మార్పు మాత్రం తథ్యం"

- ఖుష్బూ ట్వీట్

అంతకుముందు జులైలోనూ కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు ఖుష్బూ. ఆ తర్వాత పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details