తెలంగాణ

telangana

Azadi Ka Amrit Mahotsav: వందేమాతరం.. వరస కట్టిందిలా!

By

Published : Nov 7, 2021, 8:29 AM IST

స్వాతంత్య్ర సమరంలో (azadi ka amrit mahotsav celebrations) గాంధీజీ నుంచి సామాన్యుల దాకా.. కరాచీ నుంచి కన్యాకుమారి దాకా ప్రతిరోజూ ప్రతిధ్వనించింది. ఉద్యమంగా, గీతంగా యావద్దేశాన్నీ ఉర్రూతలూగించింది. తెల్లవారి గుండెల్లో ప్రమాద ఘంటికలు మోగించింది. వందేమాతరం!

AZADI KA AMRIT
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​

1875 నవంబరు 7న బంకించంద్ర ఛటర్జీ కలం ద్వారా వెలుగుచూసిన నాటి నుంచి.. నేటి అమృత మహోత్సవం (azadi ka amrit mahotsav celebrations) దాకా అజరామరంగా సాగుతున్న మహాగేయం ఆవిర్భావమే కాదు.. ప్రస్థానమూ స్ఫూర్తిదాయకమే! 1838 జూన్‌ 27న బెంగాల్‌లో జన్మించిన బంకించంద్ర ఛటర్జీ చదువులో చురుకు. న్యాయశాస్త్రంలో పట్టా పొందాక 1858లో బ్రిటిష్‌ ప్రభుత్వ కొలువులో చేరారు. మరోవంక సామాజిక ఇతివృత్తాలతో కథలు, నవలలు రాసేవారు. ఇంగ్లిష్‌లో రాసిన 'రాజ్‌మోహన్స్‌ వైఫ్‌' నవలకు మంచి పేరే వచ్చినా.. ప్రజలకు చేరువయ్యేందుకు బెంగాలీలో రాయటం మొదలెట్టారు. వందేమాతరం రాయటానికి నేపథ్యంపై ప్రదీప్‌ భట్టాచార్య అనే విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, మరికొంతమంది పరిశోధించి.. ఓ ఆసక్తికరమైన సంఘటనను వెలికి తీశారు.

క్రికెట్‌ గోలలోంచి..

1873లో బహరాంపుర్‌లో (75 independence day essay) బంకించంద్ర ఛటర్జీ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు.. కర్నల్‌ డఫిన్‌ కంటోన్మెంట్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌గా ఉండేవారు. ఛటర్జీ ఓ రోజు ఆఫీసు నుంచి పల్లకీలో ఇంటికి బయల్దేరారు. రోజూ వెళ్లే దారి నుంచి కాకుండా బోయీలు పల్లకీని కంటోన్మెంట్‌ మైదానం దారిలో తీసుకెళ్లారు. ఆ సమయానికి మైదానంలో డఫిన్‌ క్రికెట్‌ ఆడుతున్నారు. బోయీల గోలతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో డఫిన్‌ ఆగ్రహంతో.. పల్లకీలోంచి బంకించంద్రను దించి చేయి చేసుకున్నాడు. ప్రభుత్వంలో అత్యంత ఉన్నతస్థానంలో ఉన్న అధికారిని అందరిముందూ అలా చేయటం సంచలనం సృష్టించింది. ఈ అవమానాన్ని భరించలేని బంకించంద్ర కోర్టుకు వెళ్లారు. విచారణానంతరం డఫిన్‌ను బహిరంగంగా న్యాయస్థానంలో క్షమాపణ చెప్పాలని ఆదేశించింది కోర్టు! తప్పనిసరి పరిస్థితుల్లో బంకించంద్రకు అందరిముందు క్షమాపణలు చెప్పాడు డఫిన్‌! కోర్టు ఆవరణలోనే బంకించంద్రకు మద్దతుగా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కర్నల్‌ డఫిన్‌ ముఖం మాడిపోయింది. ఎలాగైనా బంకించంద్రను ఇరికించాలని డఫిన్‌ కుట్ర పన్నాడు. ఈ విషయం తెలిసిన ఓ చిన్న సంస్థానాధీశుడు రాజాజోగీందర్‌ నారాయణ్‌ ఆయన్ను అప్రమత్తం చేశారు. బంకించంద్ర సెలవు తీసుకొని ఉద్యోగానికి దూరంగా.. రాజా జోగీందర్‌కు చెందిన లాల్‌గోలా ప్యాలెస్‌లో ఉండసాగారు.

రవీంద్రుడి బాణీలో..

ఈ సెలవుల్లో తన రచనలపై బంకించంద్ర మరింత దృష్టిసారించారు. అందులోంచి వచ్చిందే.. వందేమాతరం. తొలుత 1875లో దీన్ని బంగదర్శన్‌ మేగజీన్‌లో ప్రచురించారు. బెంగాలీ లిపిలో రాసిన సంస్కృత గేయమిది. తర్వాత తన ఆనంద్‌మఠ్‌ నవలలో దీన్ని భాగం చేశారు. అది కూడా ఇదే పత్రికలో ధారావాహికగా వచ్చింది. 1884 ఏప్రిల్‌ 8న బంకించంద్ర కన్నుమూశాక.. 1896లో తొలిసారిగా రవీంద్రనాథ్‌ ఠాగోర్‌ దీనికి బాణీకట్టి, జాతీయ కాంగ్రెస్‌ సదస్సులో పాడారు. అక్కడి నుంచి వందేమాతరం అందరినోళ్లలో నానటం ఆరంభమైంది. 1905లో బ్రిటిష్‌ ప్రభుత్వం బెంగాల్‌ను విభజించటంతో వందేమాతరం ఉద్యమంగా ఊపిరిలూదుకుంది. కులమతాలకు అతీతంగా ప్రజల్ని నడిపించే ప్రబల శక్తిగా మారింది. కలిస్తే వందేమాతరం, పిలిస్తే వందేమాతరం!

ముస్లింలీగ్‌ నో.. ఆజాద్‌ సై

బెంగాల్‌ విభజనానంతరం కొత్తగా ఏర్పడ్డ ముస్లింలీగ్‌ 1909లో వందేమాతరం గేయం (vandematharam independence day song) పట్ల అభ్యంతరం లేవనెత్తింది. దేశాన్ని మాతగా భావించి మొక్కడం; గేయంలో చాలా చోట్ల కాళి, దుర్గామాతల పేర్లుండటం ఇస్లాం మనోభావాలకు వ్యతిరేకమంది. కానీ ఆనాటి ఇస్లామిక్‌ పండితుడు, స్వాతంత్య్రసమరయోధుడు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌లాంటి వారు మాత్రం ఇస్లాం చెప్పినట్లే వందేమాతరం కూడా ప్రపంచశాంతిని కాంక్షిస్తుందంటూ మద్దతు పలకటం గమనార్హం. ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్నకాలంలో ప్రతి సమావేశంలో వందేమాతరం తప్పనిసరిగా పాడేవారు. గాంధీజీ సైతం వందేమాతరాన్ని సమర్థించారు. వినగానే తన ఒళ్లు పులకించిందంటూ ఈ గేయం భారతావనికి బెంగాల్‌ ఇచ్చిన బహుమతన్నారు. పోనుపోనూ మతవిభజన రాజకీయం పెరిగిపోవటంతో ముస్లింలీగ్‌ను సంతృప్తిపరిచేందుకు కాంగ్రెస్‌ కొన్నాళ్లపాటు వందేమాతరాన్ని ఆపేసింది. ఆ తర్వాత.. ఆరు భాగాల్లోంచి ఎలాంటి మతపరమైన ప్రస్తావనా లేని తొలి రెండింటిని మాత్రమే స్వీకరించింది. స్వాతంత్య్రానంతరం దీన్ని జాతీయగీతంగా ప్రకటిస్తారనుకున్నారంతా! కానీ, నెహ్రూ ప్రభుత్వం వివాదంలేని తొలి రెండు భాగాలతో.. వందేమాతరాన్ని జాతీయగేయంగా ప్రకటించి వివాదానికి తెరదించింది.

ఇదీ చదవండి:సంక్షేమ రాజ్యంలో 'మందు'పాతరలా?

రేపు భాజపా జాతీయ కార్యవర్గ భేటీ- అజెండా అదే?

ABOUT THE AUTHOR

...view details