తెలంగాణ

telangana

Azadi Ka Amrit Mahotsav: చీరకట్టుకొని పారిపోయిన  వారెన్‌ హేస్టింగ్స్‌

By

Published : Dec 14, 2021, 8:28 AM IST

Azadi Ka Amrit Mahotsav: కాశీ నగరం నుంచి అత్యంత బలీయమైన బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌ ప్రాణభయంతో చీరకట్టుకొని పారిపోయాడు. వారణాసికి కొత్త రూపును ఆవిష్కరిస్తూ సోమవారంనాడు ప్రధాని నరేంద్రమోదీ నోట వారన్ హేస్టింగ్​ పేరు వినిపించింది. ఈ నేపథ్యంలో ఆ గవర్నర్ జనరల్ ఎందుకు అలా పారిపోయాడో తెలుసుకుందాం!

Azadi ka Amrit Mahotsav
వారెన్‌ హేస్టింగ్స్‌

Azadi Ka Amrit Mahotsav: వారణాసికి కొత్త రూపును ఆవిష్కరిస్తూ సోమవారంనాడు ప్రధాని నరేంద్రమోదీ నోట ఓ పేరు వినిపించింది. అదే వారెన్‌ హేస్టింగ్స్‌! సుమారు 250 ఏళ్ల కిందటి.. ఈస్టిండియా కంపెనీ గవర్నర్‌ జనరల్‌ హేస్టింగ్స్‌ను మోదీ ఎందుకు తలచుకున్నారో చూస్తే.. మహా శ్మశానం కాశీ నుంచి అత్యంత బలీయమైన బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ ప్రాణభయంతో.. చీరకట్టుకొని ఎలా పారిపోయాడో తెలుస్తుంది.

కాశీరాజు బలవంత్‌సింగ్‌కు ఇద్దరు రాణులు. మొదటి రాణికి ఓ కుమార్తె పద్మా కన్వర్‌. రెండో రాణికి ఇద్దరు కుమారులు చేత్‌సింగ్‌, సుజన్‌సింగ్‌. కానీ బలవంత్‌సింగ్‌ తర్వాత మొదటి రాణి కుటుంబీకులు రాజపీఠాన్ని అధిరోహించటానికి ఎత్తులు వేశారు. ఇలా వారసుల మధ్య గొడవల్ని ఆసరాగా తీసుకునే బ్రిటిష్‌ ప్రభుత్వం.. అదే పనిచేసింది. తమ చెప్పుచేతుల్లో ఉంటాడని భావించి.. చేత్‌సింగ్‌కు మద్దతిచ్చింది. ఫలితంగా.. 1770 ఆగస్టులో చేత్‌సింగ్‌ కాశీ రాజ్య సింహాసనం అధిష్ఠించాడు. ఇంతలో అయోధ్య నవాబు షుజాహుద్దౌలా కాశీపై దండయాత్రకు వచ్చాడు. కానీ చేత్‌సింగ్‌ తెలివిగా.. మధ్యలోనే ఆయనతో రాజీ కుదుర్చుకున్నాడు. వీరిద్దరి స్నేహంపై బ్రిటిష్‌ ప్రభుత్వంలో చర్చలు మొదలయ్యాయి. తమపై తిరుగుబాటు చేస్తారేమోననే అనుమానం తలెత్తింది. ఫలితంగా చేత్‌సింగ్‌ రాజ్యాన్ని, ఆస్తులను స్వాధీనం చేసుకొని.. కేవలం జమీందార్‌గా ఉంచాలని యోచించారు. ఇది తెలిసిన చేత్‌సింగ్‌ మరాఠాలతో సంప్రదింపులు మొదలెట్టాడు.

కప్పం కట్టాలంటూ కయ్యం..

British Rule In India: ఇంతలో ఇతర ప్రాంతాల్లో బ్రిటిష్‌ యుద్ధాలు మొదలయ్యాయి. ఏడాదికి రూ.5 లక్షల చొప్పున మూడేళ్లు కప్పం చెల్లించాలంటూ చేత్‌సింగ్‌కు అప్పటి బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌ సందేశం పంపించాడు. తొలి ఏడాది డబ్బులిచ్చిన చేత్‌సింగ్‌ తర్వాత చేతులెత్తేశాడు. దీంతో ఆయనకు మరో లక్ష జరిమానా విధించటంతో పాటు వెయ్యిమంది సైనికులను పంపాల్సిందిగా హేస్టింగ్స్‌ ఆదేశాలు జారీ చేశాడు. డబ్బులివ్వలేనంటూ.. 500 మంది సైనికులను పంపించాడు చేత్‌సింగ్‌. దీంతో హేస్టింగ్స్‌ ఆగ్రహంతో కమాండర్‌ గేహం సారథ్యంలోని ఓ సైనిక పటాలాన్ని కాశీ పంపించాడు. అడిగిన సొమ్ము ఇవ్వకుంటే జరిమానా చెల్లించటంతో పాటు.. తమ సైనికుల ఖర్చులు భరించాలని కొత్త ఫర్మానా జారీ చేశాడు. తన సోదరుడు సుజన్‌సింగ్‌ సాయంతో ఎలాగోలా లక్ష రూపాయల్ని పంపించాడు చేత్‌సింగ్‌. దీంతో సంతృప్తి చెందని హేస్టింగ్స్‌...ఆగ్రహంతో 1781 ఆగస్టు 15న తన సైనికులతో కాశీలో అడుగుపెట్టాడు. రాజును అరెస్టు చేసి, ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని కాశీ రెసిడెంట్‌ కమాండ్‌ మార్కోమ్‌ను ఆదేశించాడు.
ఆగస్టు 17న చేత్‌సింగ్‌ రామ్‌నగర్‌లోని తన రాజప్రాసాదాన్ని వీడి.. పూజ కోసం కాశీలోని తన శివాల ప్యాలెస్‌ (ప్రస్తుతం చేత్‌సింగ్‌ ఘాట్‌)కు వచ్చాడు. ఈ విషయం తెలిసిన హేస్టింగ్స్‌ మళ్లీ స్థానికుడొకరితో యుద్ధ సందేశం పంపించాడు. ఆ దూత 'ఈస్టిండియా కంపెనీ ప్రతి సైనికుడూ కంపెనీ కంటే బలవంతుడు. తలచుకుంటే నిన్ను ఈడ్చుకుంటూ గవర్నర్‌ జనరల్‌ దగ్గర పడేస్తాను' అంటూ వాగడంతో.. చేత్‌సింగ్‌ సహచరుడు నాన్కుసింగ్‌ అక్కడికక్కడే అతడి తలతీసేశాడు.

రాజుకు అండగా..

British Governor General Warren Hastings: ఈ విషయం తెలియగానే.. అగ్గిమీద గుగ్గిలమైన హేస్టింగ్స్‌ రెండు కంపెనీల సైన్యాన్ని పంపించాడు. చేత్‌సింగ్‌ను ఈడ్చుకొని తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. లెఫ్టినెంట్‌ ఆర్చ్‌స్కాట్‌, లెఫ్టినెంట్‌ సైమ్స్‌ల సారథ్యంలోని బ్రిటిష్‌ సైన్యం శివాల ప్యాలెస్‌పై విరుచుకుపడింది. ఆ సమయానికి పూజ కోసం వచ్చిన కారణంగా చేత్‌సింగ్‌ వద్ద కొద్దిమంది సైనికులే ఉన్నారు. కానీ.. తమ రాజుపై దాడి జరుగుతోందంటూ తెలియగానే.. స్థానికులు.. వీరిలో చాలామంది పడవలు నడిపేవారు, కొంతమంది సైనికులు అప్పటికప్పుడు దూసుకొచ్చి చేత్‌సింగ్‌కు అండగా నిలిచారు. ఆ పోరాటంలో.. ఆర్చ్‌స్కాట్‌, సైమ్స్‌లతో సహా 200 మంది బ్రిటిష్‌ సైనికులు చనిపోయారు. ఈ విషయం కాశీ పట్టణంలో దావానలంలా పాకింది. స్థానిక ప్రజలు బ్రిటిష్‌ రెసిడెంట్‌ మార్కోమ్‌ ఇంటిపై దాడి చేశారు. కాశీ శివారు తోటలో బస చేసిన వారెన్‌ హేస్టింగ్స్‌కు విషయం తెలిసింది. పరిస్థితి తీవ్రత గమనించిన స్థానిక గుమాస్తాలు ఆయన్ను పారిపోవాల్సిందిగా కోరారు. బ్రిటిష్‌ దుస్తుల్లో వెళితే తరిమి కొడతారనే భయంతో.. హేస్టింగ్స్‌కు చీరకట్టించి.. పల్లకీ ఎక్కించి రాత్రికిరాత్రి ఊరు దాటించేశారు. అలా.. వారణాసి పట్టణం అత్యంత బలీయమైన బ్రిటిష్‌ రాజ్యాధీశుడిని తరిమి కొట్టింది. అప్పటి నుంచి 'ఘోఢే పర్‌ హౌదా.. హాథీ పర్‌ జిన్‌... ఐసే భాగే వారెన్‌ హేస్టింగ్స్‌' (ఏనుగుపై వేయాల్సినవి గుర్రంపై.. గుర్రంపై వేయాల్సినవి ఏనుగుపై వేసి.. అంటే హడావుడిలో ఏం చేస్తున్నాడో తెలియకుండా హేస్టింగ్స్‌ పారిపోయాడనే అర్థం) అంటూ కాశీలో హేస్టింగ్స్‌ ఓ సామెతగా మిగిలిపోయాడు.

ఇదీ చదవండి:వారణాసిలో వైభవంగా గంగా హారతి- ప్రధాని హాజరు

Kashi Vishwanath Dham: 'కాశీ వైభవంలో సరికొత్త అధ్యాయం'

ABOUT THE AUTHOR

...view details