తెలంగాణ

telangana

శరవేగంగా రామమందిర నిర్మాణ పనులు.. డిసెంబర్ నాటికి భక్తులకు అనుమతి!

By

Published : May 23, 2023, 12:14 PM IST

Updated : May 23, 2023, 12:25 PM IST

Ayodhya Ram Mandir Construction Status : అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబరు 30కల్లా రామ మందిర నిర్మాణం తొలి దశ పనులు పూర్తవుతాయని నిర్మాణ కమిటీ ఛైర్మన్​ నృపేంద్ర మిశ్ర తెలిపారు. మొదటి దశ నిర్మాణం పూర్తయ్యాక రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి.. భక్తులను దర్శనార్థం అనుమతిస్తామని ఆయన చెప్పారు.

ram mandir ayodhya construction
ram mandir ayodhya construction

Ayodhya Ram Mandir Construction Status : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబరు 30 నాటికి రామ మందిర నిర్మాణం తొలి దశ పనులు పూర్తవుతాయని రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్​ నృపేంద్ర మిశ్ర తెలిపారు. మూడు దశల్లో ఆలయాన్ని నిర్మిస్తున్నామని.. మొదటి దశ పనులు పూర్తవ్వగానే భక్తులను రామ మందిరంలోకి అనుమతిస్తామని ఆయన వెల్లడించారు. ఆలయ నిర్మాణానికి ఖర్చు రూ.1,400 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల మధ్య ఉండొచ్చని మిశ్ర తెలిపారు.

"2023 డిసెంబరు 30కల్లా రామ మందిరం మొదటి దశ నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఐదు మండపాలు, గర్భగుడిని మొదటి దశలోనే పూర్తి చేస్తాం. మందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. అప్పుడు భక్తులను దర్శనం కోసం ఆలయంలోకి అనుమతిస్తాం. ఐదు మండపాల నిర్మాణంలో 160 స్తంభాలు ఉన్నాయి. విద్యుత్, ఇతర సౌకర్యాలు ఈ ఏడాది చివరికల్లా పూర్తవుతాయి. ఆలయ మొదటి, రెండో అంతస్తులు పనులు 2024 డిసెంబరు 30 నాటికి పూర్తవుతాయి. రామ మందిర నిర్మాణం మొత్తం పనులు 2025 డిసెంబరునాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి."
-నృపేంద్ర మిశ్ర, రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్​

దాదాపు 80 శాతం పనులు పూర్తి!..
రామ మందిర నిర్మాణానికి సంబంధించిన ఫొటోలను శ్రీ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్​ ఇటీవల సోషల్​ మీడియాలో షేర్​ చేశారు. వీటన్నింటిని చూస్తుంటే ఆలయ నిర్మాణ పనులు దాదాపు 80 శాతం పూర్తైనట్లు కనిపిస్తోంది. రామ మందిర నిర్మాణ పనుల పురోగతికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు భక్తులతో పంచుకుంటోంది ట్రస్ట్​. తాజాగా బయటకు వచ్చిన చిత్రాలు ఈ ఏడాది ఏప్రిల్​ 30 వరకు జరిగిన పనులకు సంబంధించినవి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

2019లో సుప్రీం తీర్పు:
Ram Mandir Foundation stone : అయోధ్యలో రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వేద మంత్రాల మధ్య ఆలయానికి పునాది రాయి వేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి. 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉండనుంది. మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.

Last Updated :May 23, 2023, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details