తెలంగాణ

telangana

మాట నిలబెట్టుకున్న మహీంద్ర.. తుక్కు బండికి బదులు బొలెరో..

By

Published : Jan 25, 2022, 6:43 PM IST

Anand Mahindra Bolero: సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సహించడంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ముందుంటారని మరోసారి రుజువైంది. ఇచ్చిన మాట ప్రకారం మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తయారు చేసిన తుక్కు వాహనాన్ని తీసుకొని.. అందుకు బదులుగా అతనికి బొలెరో కానుకగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్​లో షేర్ చేశారు.

Anand Mahindra delivers his promise,
తుక్కు బండికి బదులు బొలెరో ఇచ్చి మాట నిలబెట్టుకున్న మహీంద్ర

Anand Mahindra Bolero: వ్యాపార దిగ్గజం ఆనంద్​ మహీంద్ర ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా దేవ్‌రాష్ట్రే గ్రామానికి చెందిన దత్తాత్రేయ లోహర్​ తయారు చేసిన తుక్కుబండిని తనకు అప్పగిస్తే.. బదులుగా బొలెరోను కానుకగా ఇస్తానని గత నెలలో హామీ ఇచ్చారు ఆనంద్​ మహీంద్ర. మాట ఇచ్చిన విధంగానే దత్తాత్రేయ కుటుంబానికి సోమవారం బొలెరోను అందించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్​లో మంగళవారం షేర్ చేశారు ఆనంద్​ మహీంద్ర. బొలెరో తీసుకున్న అనంతరం దత్తాత్రేయ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

తుక్కు బండికి బదులు బొలెరో.. మాట నిలబెట్టుకున్న మహీంద్ర
బొలెరోకు పూజలు చేస్తున్న దత్తాత్రేయ కుటుంబ సభ్యులు
బొలెరోలో వాహనంలో కూర్చున్న దత్తాత్రేయ

దత్తాత్రేయ లోహర్‌.. స్థానికంగా కంసాలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన కుమారుడికి కారు ఎక్కాలని చిన్నప్పటి నుంచి కోరిక. అయితే అంత స్థోమత లేని దత్తాత్రేయ తుక్కు వాహనాల విడి భాగాలు సేకరించి.. సొంతంగా ఓ నాలుగు చక్రాల వాహనం తయారుచేశారు. బైక్ తరహాలో కిక్‌ ఇస్తే స్టార్ట్‌ అయ్యేలా దీన్ని రూపొందించారు.

తుక్కు బండికి బదులు బొలెరో.. మాట నిలబెట్టుకున్న మహీంద్ర

Anand Mahindra Bolero tweet: ఈ కథనాన్ని ఈటీవీ భారత్​ మహారాష్ట్ర గతేడాది డిసెంబర్​ 20న ప్రచురించింది. ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఈ వాహనం ఆనంద్‌ మహీంద్రా దృష్టిలో పడింది. ఈ వీడియోను తన ట్విట్టర్​ ఖాతాలో షేర్‌ చేసిన మహీంద్రా వాహనాన్ని తయారు చేసిన వ్యక్తి నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. వాహనం ఆటోమొబైల్ నిబంధనలను అందుకోలేకపోయినప్పటికీ మన దేశ ప్రజల తెలివితేటలు, తక్కువ వనరులతో ఎక్కువ పనిచేసే సామర్థ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానని ట్వీట్ చేశారు.

నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా స్థానిక అధికారులు ఇప్పుడైనా, తర్వాతైనా ఈ వాహనాన్ని రోడ్డుపైకి రాకుండా అడ్డుకుంటారన్నారు ఆనంద్ మహీంద్రా. ఈ బండిని తనకు ఇస్తే బదులుగా బొలెరో వాహనాన్ని ఇస్తానని.. ఆఫర్ ఇచ్చారు. దత్తాత్రేయ సృజనాత్మకతను మహీంద్రా రీసర్చ్‌ వ్యాలీలో ప్రదర్శనకు ఉంచుతామని, అది తమలో స్ఫూర్తిని నింపుతుందంటూ నాాడు ట్వీట్ చేశారు.

మహీంద్ర ఆఫర్​కు దత్తాత్రేయ ఒప్పుకొన్నారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం తుక్కు వాహనం తీసుకొని దానికి బదులుగా దత్తాత్రేయ కుటుంబానికి బొలెరో అందించారు మహీంద్ర.

తుక్కు బండికి బదులు బొలెరో ఇచ్చి మాట నిలబెట్టుకున్న మహీంద్ర

రెండేళ్ల శ్రమ..

తుక్కు సహా ద్విచక్ర వాహన విడి భాగాలతో దత్తాత్రేయ నాలుగు చక్రాల వాహనం తయారు చేశారు . ఈ కారు రోడ్డు వెంబడి జనాల్ని విపరీతంగా ఆకర్షించింది. దీన్ని రూపొందించడం కోసం రెండేళ్లు తీవ్రంగా శ్రమించారు. ద్విచక్రవాహన ఇంజిన్​, రిక్షా చక్రాలు, ఇతర విడి భాగాలతో జీపు లాంటి వాహనాన్ని సృష్టించారు. పాతకాలపు జీపులా కనిపించే ఈ వాహనం.. నానో కారు కంటే పరిమాణంలో చాలా చిన్నగా ఉంటుంది. స్టీరింగ్​ను ఎడమవైపు ఏర్పాటు చేశారు. పెట్రోల్​తో నడిచే ఈ వాహనం.. లీటర్​ పెట్రోల్​తో 40- 45 కిలోమీటర్ల మైలేజ్​ ఇస్తుందంట. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:భారత్​లోనే అత్యంత పొట్టి లాయర్.. కేస్ టేకప్​ చేస్తే మాత్రం..!

TAGGED:

ABOUT THE AUTHOR

...view details