తెలంగాణ

telangana

'బంగాల్​లో దీదీ సర్కార్​ను​ గద్దె దించేది బీజేపీనే.. 2024 ఎన్నికల్లో 35 స్థానాలు మావే!'

By

Published : Apr 14, 2023, 5:44 PM IST

Updated : Apr 14, 2023, 6:43 PM IST

2024 లోక్​సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని 35 స్థానాల్లో గెలిపించాలని.. బంగాల్​ రాష్ట్ర ప్రజలకు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా కోరారు. అవినీతిలో కూరుకుపోయిన టీఎంసీని కేవలం బీజేపీయే ఓడించగలదంటూ వ్యాఖ్యలు చేశారు.

Amit Shah
Amit Shah

కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా 2024 లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించారు. భారతీయ జనతా పార్టీని 2024 లోక్​సభ ఎన్నికల్లో 35 స్థానాల్లో గెలిపించాలని బంగాల్​ రాష్ట్ర ప్రజలకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 42 పార్లమెంట్​ నియోజకవర్గాల్లో 35 చోట్ల తమను గెలిపిస్తే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఆయన వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం.. రాష్ట్రంలో 'హిట్లర్ తరహా పాలన'ను కొనసాగిస్తోందని షా దుయ్యబట్టారు. బంగాల్​లోని బీర్భూమ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో షా ఈ వ్యాఖ్యలు చేశారు. బంగాల్​లో రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్​ షా.. శుక్రవారం బీర్భూమ్​ చేరుకున్నారు.

ఇటీవలే జరిగిన శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన హింసను ప్రస్తావించిన షా.. తాము అధికారంలో ఉంటే ఇటువంటి ఘటనలు జరిగేవా అని ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రంలో శ్రీరామ నవమి శోభాయాత్రలను జరుపుకోకూడదా? శోభాయాత్రలపై దాడులు చేస్తారా? అని ప్రశ్నలు వేశారు. ఈ దారుణానికి కారణం ముఖ్యమంత్రి మమత బెనర్జీ అనుసరిస్తున్న బుజ్జగింపు రాజకీయాలేనని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే, శ్రీరామ నవమి శోభాయాత్రలపై దాడి చేసే ధైర్యం ఎవరికీ ఉండదన్నారు. మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు పాల్పడుతున్న చర్యలకు వ్యతిరేకంగా పోరాడగలిగేది బీజేపీ మాత్రమేనని చెప్పారు. మరోసారి నరేంద్ర మోదీయే దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని తదుపరి ముఖ్యమంత్రిగా చేయాలన్నదే మమతా బెనర్జీ లక్ష్యమని అమిత్ షా ఆరోపించారు. "మమత దీదీ.. మీరు మీ తర్వాత మీ మేనల్లుడు ముఖ్యమంత్రి అవుతారని కలలు కంటుండవచ్చు. కానీ బీర్భూమ్​ గడ్డపై నుంచి నేను చెప్తున్నాను.. తదుపరి ముఖ్యమంత్రి బీజేపీ నుంచి వస్తారు. దీనికి ట్రైలర్ 2024లో కనిపిస్తుంది" అని అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన టీఎంసీని కేవలం బీజేపీయే ఓడించగలదని షా చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంలో టీఎంసీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్​ పార్టీలు ఏళ్ల తరబడి అడ్డంకులు సృష్టించాయని.. కానీ మోదీ రామ మందిరానికి శంకుస్థాపన చేశారని ఆయన అన్నారు.

మరోవైపు అమిత్​ షా వ్యాఖ్యలను అధికార తృణమూల్​ పార్టీ తీవ్రంగా ఖండించింది. షా మాటలు అప్రజాస్వామికమని.. రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించింది. "2021 అసెంబ్లీ ఎన్నికల్లో 200కు పైగా సీట్లు గెలుచుకున్నట్లే ఆయన 35 సీట్లు గెలవాలని కలలు కంటారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని పూర్తి కాలం పూర్తి కాకుండానే కూల్చేస్తామన్నట్లు కేంద్ర మంత్రి బహిరంగంగా ఎలా చెబుతున్నారు ? రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతోందని ఇప్పుడు రుజువైంది' అని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ విమర్శించారు.

Last Updated : Apr 14, 2023, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details