తెలంగాణ

telangana

తల్లీకూతుళ్లపై చిత్రహింసలు.. జుట్టు, చర్మం కత్తిరించి.. మలం తినిపించి అర్ధనగ్నంగా..

By

Published : Jul 21, 2023, 1:28 PM IST

Updated : Jul 21, 2023, 2:27 PM IST

మంత్రాలు చేస్తున్నారని ఆరోపిస్తూ తల్లీకూతుళ్లను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశారు కొందరు వ్యక్తులు. తలపై వెంట్రుకలు, చర్మాన్ని కత్తిరించి.. బలవంతంగా మలం తినిపించారని బాధితురాలు ఆరోపించింది. బంగాల్​లో ఈ ఘటన జరిగింది.

Etv Bharat
Etv Bharat

మణిపుర్​లో ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగించి, వారిపై అత్యాచారం జరిపిన ఉదంతం మరువకముందే బంగాల్​లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. దుర్గాపుర్​ జిల్లాలో తల్లీకూతుళ్లపై కొందరు వ్యక్తులు.. పైశాచికంగా ప్రవర్తించారు. మంత్రాలు చేస్తున్నారని ఆరోపిస్తూ మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేశారు. 'భారత్ జకత్ మాఝీ పరగణ మహల్' అనే గిరిజన సంస్థ సహాయంతో బాధితురాళ్లు పోలీసులను ఆశ్రయించారు.

బాధితురాళ్ల కథనం ప్రకారం..
జిల్లాలోని ఇచాపుర్​ గ్రామానికి చెందిన బాధితురాలు(60) తన కుమార్తెతో కలిసి ఉంటోంది. అయితే వారిద్దరూ మంత్రాలు చేస్తుంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమీప గ్రామమైన దామరి బంద్​ నివాసితులు.. ఇచాపుర్​కు వచ్చి వారిని మంత్రగత్తెలని ఆరోపిస్తూ తీవ్రపదజాలంతో దూషించారు. అనంతరం దారుణంగా దాడి చేశారు.

తలపై వెంట్రుకలు, చర్మాన్ని కత్తిరించి..
పదునైన బ్లేడుతో తమ తలపై వెంట్రుకలు, చర్మాన్ని కత్తిరించారని వృద్ధురాలు వాపోయింది. బలవంతంగా మలం తినిపించారని ఆరోపించింది. ఆ తర్వాత విషపూరిత ముళ్లపై అర్ధ నగ్నంగా కూర్చోబెట్టారని, తన దగ్గర ఉన్న రూ.20వేలు తీసుకున్నారని తెలిపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేసింది.

బాధితురాళ్లకు అండగా..
ఈ దారుణ ఘటన గురించి తెలుసుకున్న భారత్ జకాత్ పరగణ మహల్ అనే గిరిజన సంస్థ అధికారులు.. వృద్ధురాలితో పాటు ఆమె కుమార్తెకు అండగా నిలిచారు. బాధితురాళ్లను తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఫరీద్​పుర్​ స్టేషన్​కు వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లాక పోలీసులు.. ఫిర్యాదును స్వీకరించలేదు. ఆండాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వారు నివసిస్తున్నందున, అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయమన్నారు.

నిందితులకు శిక్ష పడకపోతే తీవ్ర ఆందోళనలు..
ఈ విషయంపై భారత్​ జకత్​ మాఝీ పరగణ సభ్యుడు లెబు హెంబ్రామ్ మీడియాతో మాట్లాడారు. "వృద్ధురాలితోపాటు ఆమె కుమార్తె అమానవీయ హింసకు గురయ్యారు. వారితో మలం తినిపించి తీవ్రంగా దాడి చేశారు. ముళ్లపై కూర్చోబెట్టారు. ఊరి నుంచి వెళ్లగొట్టారు. అందుకే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాం. నిందితులకు కఠిన శిక్ష పడకుంటే తీవ్ర ఆందోళనలు చేపడతాం" అని ఆయన తెలిపారు.

'బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం'
అసన్​సోల్​ దుర్గాపుర్​ పోలీసు కమీషనర్​​ డీసీ పూర్వ కుమార్ గౌతమ్​ యాదవ్​.. ఈ విషయంపై ఈటీవీ భారత్​తో మాట్లాడారు. "మీ(ఈటీవీ భారత్​) ద్వారానే మాకు ఘటన గురించి తెలిసింది. ఇంకా మాకు ఫిర్యాదు అందలేదు. ఫిర్యాదు వచ్చాక దర్యాప్తు చేపడతాం. నేరం రుజువైతే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని ఆయన హామీ ఇచ్చారు.

Last Updated :Jul 21, 2023, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details