తెలంగాణ

telangana

ఓటర్​ ఐడీతో ఆధార్ లింక్ చేశారా?.. గడువుపై కేంద్రం కీలక నిర్ణయం

By

Published : Mar 22, 2023, 12:31 PM IST

ఆధార్ కార్డుతో ఓటర్​ అనుసంధానానికి ఉన్న గడువును కేంద్రం మరోసారి పొడగించింది. ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

aadhaar voter link
aadhaar voter link

ఓటర్ కార్డును ఆధార్​తో లింక్ చేశారా? లేదంటే మీకోసమే ఈ గుడ్​ న్యూస్. ఓటర్ కార్డుతో ఆధార్ నెంబర్​ను అనుసంధానం చేసేందుకు ఉన్న గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడగించింది. 2023 ఏప్రిల్‌ 1నుంచి 2024 మార్చి 31 వ తేదీ వరకు గడువును పెంచింది. ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయ శాఖ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
నిజానికి ఆధార్- ఓటర్ అనుసంధానానికి గడువు ఏప్రిల్ 1తోనే ముగియాల్సి ఉంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గతేడాది జూన్ 17న తన నోటిఫికేషన్​లో పేర్కొంది. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. ఆధార్​తో అనుసంధానం చేయాల్సిన ఓటర్లు ఫామ్​-6ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టు నుంచి ఎన్నికల సంఘం.. నమోదిత ఓటర్ల నుంచి ఆధార్‌ కార్డు నెంబర్లు సేకరించడం ప్రారంభించింది. డిసెంబర్‌ 12వ తేదీ వరకు 54.32 కోట్ల ఆధార్‌ నెంబర్లను ఈసీ సేకరించినట్లు తెలుస్తోంది. కానీ, వీటిని అనుసంధానించే ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక దాఖలు చేసిన ఆర్​టీఐ దరఖాస్తు కింద కేంద్రం వెల్లడించింది.

'ఆ గడువు కూడా పెంచండి ప్లీజ్..'
ఓటర్- ఆధార్ లింక్​కు గడువు పెంచిన నేపథ్యంలో మరో కొత్త డిమాండ్ వినిపిస్తోంది. పాన్‌కార్డ్​ను ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియకు చివరి గడువును పెంచాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ఇందుకు సంబంధించి ప్రధాని మోదీకి ఓ లేఖ రాసింది. పాన్- ఆధార్ అనుసంధానానికి విధిస్తున్న రూ.1000 అపరాధ రుసుంను కూడా ఎత్తివేయాలని విజ్ఞప్తి చేసింది. ఆధార్‌- పాన్‌ కార్డు అనుసంధానానికి మార్చి 31 చివరి తేదీ అని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ ఆ లోపు ఆధార్​ నెంబర్​తో లింక్ చేయకపోతే.. వారి పాన్​ కార్డులు అసలే పనిచేయవు.

అయితే, 2022 మార్చి 31 వరకు పాన్- ఆధార్ అనుసంధానానికి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేదు. ఉచితంగానే అనుసంధానం చేసుకునే వీలు కల్పించింది కేంద్రం. 2022 మార్చి 31 తర్వాత రూ.500 అపరాధ రుసుమును వసూలు చేసింది. అలా ఏప్రిల్‌ 1, 2022 వరకు రూ.500 అపరాధ రుసుంతో ఆధార్ లింక్ చేసే అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత 2022 జులై 1 నుంచి దాన్ని రూ. వెయ్యికి పెంచింది. రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఆధార్- పాన్ లింక్​ చేసుకునేందుకు ఈ ఏడాది మార్చి 31 వరకే సమయం ఉంది. తాజాగా ఆ గడువు కూడా దగ్గరపడుతోంది.

ABOUT THE AUTHOR

...view details