తెలంగాణ

telangana

మూఢ విశ్వాసంతో కన్నబిడ్డలనే కడతేర్చే యత్నం

By

Published : Apr 14, 2021, 7:08 AM IST

మూఢవిశ్వాసంతో మిత్రురాలిని పెళ్లాడిన ఓ వివాహిత.. ఆమెతో కలిసి తన ఇద్దరు కుమారులను చిత్రహింసలకు గురిచేసింది. పిల్లలకు నిత్యం నరకం చూపింది. భర్త సాయంతో వారిని అత్యంత పాశవికంగా బలిచ్చేందుకు యత్నించింది. తెలివిగా తప్పించుకున్న చిన్నారులు ప్రాణాలు దక్కించుకున్నారు.

superstition
మూఢ విశ్వాసంతో కన్నబిడ్డలనే కడతేర్చే యత్నం

మూఢ విశ్వాసంతో తమను బలి ఇవ్వాలని చూసిన తల్లిదండ్రుల చెర నుంచి ఇద్దరు పిల్లలు తెలివిగా తప్పించుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

ఏం జరిగింది?

ఈరోడ్‌ జిల్లా రంగంపాళ్యం రైల్‌నగర్‌కు చెందిన రామలింగం(42), రంజిత(32) దంపతులు. వీరికి కుమారులు దీపక్‌ (15), కిషాంత్‌ (6) ఉన్నారు. రామలింగం చీరల వ్యాపారం చేసేవారు. తర్వాత ఇందుమతి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెను కూడా అదే ప్రాంతంలో తీసుకొచ్చి వేరే ఇంట్లో ఉంచాడు. ఇందుమతి స్నేహితురాలు ధనలక్ష్మి (38) అప్పుడప్పుడు వీరింటికి వచ్చి వెళ్తుండేది. ఈ క్రమంలో రంజితతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారి స్నేహాన్ని గమనిస్తూ వచ్చిన రామలింగం.. మీరిద్దరు శివుడు, పార్వతిలా ఉన్నారని చెప్పేవాడు.

రంజిత, ధనలక్ష్మీ

మామ అని పిలవాలని..

కొన్నాళ్లకు తాము పెళ్లి చేసుకుంటామని రంజిత, ధనలక్ష్మి తెలపగా రామలింగం అంగీకరించాడు. ఇంట్లోనే తన కుమారుల ఎదుటే వారికి వివాహం చేశాడు. అనంతరం అతీతశక్తులు వస్తాయనే నమ్మకంతో ధనలక్ష్మిని నాన్న అని, రామలింగాన్ని మామ అని పిలవాలని కుమారులను చిత్రహింసలకు గురిచేశారు. పాఠశాలకు వెళ్లనివ్వకుండా ఇంట్లో పనులన్నీ పిల్లలతోనే చేయించారు. శానిటైజర్‌ తాగించడం, ఒంటికి కారం పూసి ఎండలో పడుకోబెట్టడం వంటి దారుణాలకు పాల్పడ్డారు. చివరికి వారిని నరబలి ఇచ్చేందుకు రామలింగం, రంజిత, ధనలక్ష్మి యత్నించారు.

ఈ విషయం వారి మాటల ద్వారా గ్రహించిన పిల్లలు, వెంటనే తమ తాత ఇంటికి పారిపోయి జరిగిన విషయాన్ని చెప్పారు. తర్వాత ఈరోడ్‌ ఎస్పీ తంగదురైకు ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. రంజిత, ధనలక్ష్మి, రామలింగంలను ప్రశ్నిస్తున్నారు. పిల్లల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.

ఇదీ చూడండి:పనిచేసే చోట 8 ఏళ్ల బాలికపై అత్యాచారం!

ABOUT THE AUTHOR

...view details