ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP : జగన్ ఎప్పుడు జైలుకు వెళ్తారా అని మంత్రులు ఎదురు చూస్తున్నారు : బుద్దా వెంకన్న

By

Published : Apr 26, 2023, 1:32 PM IST

Budda Venkanna : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి డబ్బు, అధికారం పిచ్చిలో నైతిక విలువలు విస్మరించాడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. సొంత చెల్లి, తల్లిని వాడుకుని వదిలేసిన జగన్.. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడంటే నమ్మాలా అని ప్రశ్నించారు. జగన్ ఈ రాష్ట్రానికి పట్టిన కరోనా వైరస్ లాంటి వాడైతే.. చంద్రబాబు బూస్టర్ డోస్ లాంటి వాడని పేర్కొన్నారు.

budda venkanna
budda venkanna

Budda Venkanna : వివేకా హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు జైలుకెళ్తాడా అని మంత్రులు కూడా ఎదురు చూస్తున్నారని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. అందుకే చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారన్నారు. తల్లి, చెల్లిని జగన్మోహన్ రెడ్డి అవసరానికి వాడుకుని వదిలేశాడని విమర్శించారు. అసెంబ్లీలో విజయమ్మను అవమానించిన బొత్సను అందలమెక్కించాడని మండిపడ్డారు. గతంలో షర్మిల అరెస్ట్ అయినపుడు ప్రధాని మోదీ సైతం ఖండించినా, జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శించలేదన్న బుద్దా వెంకన్న... అన్న వదిలిన బాణం ఇప్పుడు జైల్లో ఉంటే కనీసం స్పందించలేదని దుయ్యబట్టారు. మరో చెల్లెలైన సునీతపై వైఎస్సార్సీపీ శ్రేణులు అసభ్య పోస్టులు పెడుతున్నా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండించట్లేదని ప్రశ్నించారు. రాష్ట్ర సీఐడీలా సీబీఐ కూడా జగన్ చేతుల్లో ఉంటే ఈపాటికి వివేకా కూతురు, అల్లుడిని జైల్లో పెట్టించేవాడని ఆక్షేపించారు. సీఐడీ.. జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థలా ఉంది కాబట్టే మార్గదర్శిపై తప్పుడు కేసులు పెడుతోందని బుద్దా వెంకన్న మండిపడ్డారు.

కనీస విలువలు లేని జగన్... నైతిక విలువలు మాట్లాడే జగన్ మోహన్ రెడ్డి.. తనకున్న విలువలు ఏమిటో చెప్పాలి అని బుద్దా డిమాండ్ చేశారు. తల్లికి భోజనం పెట్టలేని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్లుగా ఉంది ఆయన వైఖరి అని ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి అరెస్టయి 16 నెలలు జైలులో ఉంటే విజయమ్మ, షర్మిల, బ్రదర్ అనిల్ కూడా పరామర్శించారు. కాళ్లకు బలపం పట్టుకుని రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేశారని గుర్తు చేస్తూ.. ఇవాళ షర్మిల చంచల్ గూడ జైలులో ఉంటే కనీసం పలకరించలేదని, కనీసం ఫోన్ లో అయినా పరామర్శించాలి కదా అని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులనైనా పరామర్శించాల్సిన బాధ్యత ఉందా లేదా అని ప్రశ్నించారు. సొంత చెల్లిని, తల్లిని పట్టించుకోలేదు కానీ, అన్నలా ఉంటా, మేన మామగా ఉంటా అని ఎలా చెప్తున్నావు అని నిలదీశారు. ముందు నీ కుటుంబానికైనా అండగా ఉంటున్నావా..? ఇతర పార్టీల నేతలైనా స్పందిస్తున్నారే గానీ ఎందుకు నువ్వు పరామర్శించడం లేదు అని విమర్శించారు.

జగన్ ను సీబీఐ అరెస్టు చేయాలి.. కనీస విలువలు లేని జగన్ రాష్ట్రాన్ని ఎలా బాగు చేస్తాడని బుద్దా వెంకన్న దుయ్యబట్టారు. సొంత చెల్లెలు సునీతా రెడ్డి మీద పార్టీకి చెందిన నాయకులు, నీకు చెందిన వ్యక్తులు దారుణంగా పోస్టులు పెడుతుంటే తప్పని ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. వివేకా హత్యకు చంద్రబాబు నాయుడు కారణం అంటూ.. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి చెందిన గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసిన జగన్ పై సీబీఐ నోటీసులు ఇచ్చి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

డబ్బు, పదవి పిచ్చితో దిగజారి పోయిన జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి పదవిని ఇష్టానుసారం వాడుకుంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి, ఆయన క్యాబినెట్ మంత్రులు ఎవరైనా సరే విలువల గురించి మాట్లాడే దమ్ముందా.. విలువలతో కూడిన రాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడు మాత్రమే. ఈ రాష్ట్రానికి జగన్ కరోనా వైరస్ అయితే, చంద్రబాబు నాయుడు బూస్టర్ డోస్ లాంటి వాడు. రాష్టాన్ని బాగు చేసేందుకు చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకుంటే.. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నాడు. ప్రజలు ఒకసారి మోసపోయారు. మళ్లీ మళ్లీ మోసపోరు అనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి. రాష్ట్రాన్నే కాదు.. కుటుంబాన్ని కూడా ప్రశాంతంగా ఉంచలేని జగన్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. - బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details