ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జావలా అన్నం.. నీళ్లలా సాంబారు

By

Published : Feb 16, 2021, 7:43 AM IST

జావలా అన్నం.. నీళ్లలా సాంబారు.. ఈ భోజనం ఎలా తింటాం సార్ అంటూ.. మధ్యాహ్న భోజనం పథకం కింద పెడుతున్న భోజనాన్ని పట్టుకుని మూడు ప్రభుత్వ కార్యాలయాలు తిరిగారు విద్యార్థులు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా చినకొండేపూడిలో జరిగింది.

worst mid day meals
మధ్యహ్నా భోజనంపై విద్యార్థుల ఫిర్యాదు

పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని 12 మంది విద్యార్థులు భోజనం ప్లేట్లు, సాంబారు గ్లాసులు పట్టుకుని కిలోమీటరున్నర దూరంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. జావకారుతున్న అన్నం, నీళ్ల లాంటి సాంబారును పోలీసులకు చూపించారు. తమకు ఇటువంటి భోజనం పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మా పరిధి కాదు... విద్యాశాఖాధికారి కార్యాలయానికి వెళ్లండని సిబ్బంది చెప్పడంతో అక్కడి నుంచి ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్దకు వెళ్లారు.

ముందుగా తహసీల్దారు కార్యాలయంలోకి వెళ్లగా.. అక్కడి సిబ్బంది వీరిని విద్యా వనరుల కేంద్రానికి పంపారు. ఎంఈవో కె.స్వామినాయక్‌ను కలిసిన విద్యార్థులు... రోజూ నాసిరకం భోజనం పెడుతున్నారని, ఒక్కో రోజు బియ్యంలో రాళ్లు, పురుగులు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లేట్లలో వారు తీసుకొచ్చిన ఆహార పదార్థాలను ఆయనకు చూపించారు. విద్యార్థులను అక్కడే కూర్చోబెట్టి ఎంఈవో విచారణ చేయించారు. అనంతరం విద్యార్థులకు తోడుగా సీఆర్పీలను ఇచ్చి పాఠశాలకు పంపారు. అందరు విద్యార్థులతో మాట్లాడామని, నాణ్యత లేని భోజనం పెడుతున్నారని వారంతా చెప్పారని ఎంఈవో వెల్లడించారు. విద్యాకమిటీ ఆధ్వర్యంలో మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 8, 9 తరగతుల విద్యార్థులు పలువురు అధికారుల ఎదుట తమ గోడు వినిపించారు.

ABOUT THE AUTHOR

...view details