ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సామాన్యుడా మేలుకో...! కొండెక్కిన ధరలు...ఆహార సంక్షోభం దిశగా దేశం..?

By

Published : Aug 2, 2023, 5:15 PM IST

food crisis and vegetable price in india: వాడకుంటే పూట గడవదు. కొనుగోలు చేద్దాం అనుకుంటే ధరలు ఆకాశంలో. ఒకటా రెండా ప్రతి నిత్యావసర వస్తువు ధరల పరిస్థితి అదే. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఇలాగే తయారైంది. కొండెక్కిన టమాట ధరలు దిగి రావడం లేదు. పప్పులు, వేరుశనగలు, వంట నూనెలు, బియ్యం, గోధుమ పిండి, ఉల్లిగడ్డలు ఇతర కూరగాయల పరిస్థితి కూడా ఇదే. అనూహ్య వాతావరణ మార్పుల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తర భారతంలో భారీ వర్షాలు వణికిస్తుంటే... దక్షిణాది రాష్ట్రాల్లో కూడా విస్తారంగా కురిసి పంటలు దెబ్బతినడం ఈ పరిస్థితికి ప్రధాన కారణం. రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరుగుతాయనే వార్తలు సామాన్యుడిని కలవరపెడుతున్నాయి.

food crisis and vegetable price in india
కొండెక్కిన ధరలు...ఆహార సంక్షోభం దిశగా దేశం..?

food crisis and vegetable price in india: ప్రపంచం ఆహార సంక్షోభం దిశగా పయనిస్తుందా...? రానున్న రోజుల్లో ఆహారోత్పత్తుల ధరలకు రెక్కలు రానునున్నాయా...? అంతర్జాతీయంగా ప్రస్తుత పరిణామాలు చూస్తే అదే ఆందోళన కలుగుతుంది. ఓ వైపు రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ దెబ్బతినగా, దీనికి ప్రకృతి ప్రకోపాలు తోడై సామాన్యులను సంక్షోభం దిశగా నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మే కురిసిన అకాల వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతిని దేశవ్యాప్తంగా వాటి ధరలు కేజీ 200రూపాయలకు చేరువ కాగా, ఇతర కూరగాయల ధరలు సైతం కొండెక్కి కూర్చున్నాయి. దాదాపు ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలు కొనలేని స్థాయిలో మండిపోతున్నాయి. నెల రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే పేద వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

Read more at:అమాంతంగా పెరిగిన ధరలతో.. అందని ద్రాక్షలా కూరగాయలు..

ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలపై కేంద్రం స్పందించి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాయితీపై టమాటా అందజేసి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు చర్యలు చేపట్టింది. జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య-N.C.C.F, జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య- N.A.F.E.Dలకు వ్యాన్ల ద్వారా టమోటాలు విక్రయించే బాధ్యత ఇచ్చింది. టమాటా ఎక్కువగా పండే రాష్ట్రాల నుంచి సేకరించి అధిక ధరలు ఉన్న దిల్లీ, ఇతర రాష్ట్రాలకు రాయితీపై పంపిణీ చేస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో 30 శాతం రాయితీ ధరలకు టామాటాలు అందిస్తోంది. దేశవ్యాప్త సగటు కంటే ఎక్కువ ధరలు పలుకుతున్న ప్రాంతాలు గుర్తించి అక్కడికి సరఫరా చేయాలని ఆదేశించింది. దేశంలో 56 నుంచి 58% టామాటా పంట దేశ దక్షిణ, పశ్చిమ ప్రాంతం నుంచి వస్తోంది. ఈ 2ప్రాంతాల్లో వాడకం కంటే ఎక్కువగా టమాటాలు వస్తున్నాయి. ఈ పంట సాగు డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు అత్యధికంగా ఉంటుంది. జులై, ఆగస్టు, అక్టోబరు, నవంబరు మాసాల్లో పంట దిగుబడులు కాస్త తక్కువగా ఉంటాయి.

కొండెక్కిన ధరలు...ఆహార సంక్షోభం దిశగా దేశం..?

Read more at:అక్కడ టమాట కిలో రూ.50 లే..! రైతు బజారుకు క్యూ కట్టిన జనాలు..!

జులైలో ఉత్తర భారతంలో భారీ వర్షాలతోపాటు రవాణా సవాళ్లు టమాటాధరల పెరుగుదలకు కారణం. మహారాష్ట్ర నాసిక్ టోకు మార్కెట్‌కు త్వరలో కొత్త పంట రానుంది. మధ్యప్రదేశ్ నుంచి టమాటా అందుబాటులోకి రానున్నట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెకు టామాటా బాగా వస్తోంది. కొన్ని చోట్ల కిలో టమాటా ధర 190 నుంచి 240 రూపాయల చొప్పున పలుకుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పంట దిగుబడి తగ్గడం, రవాణాలో అంతరాయం.. వెరసి టామాట ధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. టమాటాలు మాత్రమే కాదు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు సైతం పైపైకి ఎగిసి పడుతున్నాయి. సాధారణంగా భారతీయ వంటకాల్లో వినియోగించే ప్రధాన నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోతున్నాయి. ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 3 నెలల కిందట కంది పప్పు కిలో ధర 110 రూపాయలు ఉంటే... ఇప్పుడు 160 రూపాయలు దాటింది. మినపప్పు కిలో ధర 110 రూపాయలు ఉండగా... 140 రూపాయలు అయింది. పెసర పప్పు కిలో ధర మూడు నెలల క్రితం 120 రూపాయలు ఉంటే ఇప్పుడు 140 రూపాయలు దాటింది. 100 గ్రాముల పసుపు ప్యాకెట్ ధర 85 రూపాయలు ఉంటే... ఇప్పుడు వంద రూపాయలు పైగా ఉంది. 200 గ్రాముల జీలకర్ర ప్యాకెట్ 126 రూపాయలు ఉంటే... ఇప్పుడు 180 రూపాయలు దాటింది. కారం కిలో ధర 350 రూపాయలు ఉండగా... ఇప్పుడు ఏకంగా 600 రూపాయలు అయింది. ధనియాలు కిలో 186 రూపాయలు ఉంటే ఇప్పుడు 400 రూపాయలు దాటింది. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడానికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకుంటున్నా అవి పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు.

Read more at:ఆపిల్ దిగదుడుపే..! హోల్​సేల్ మార్కెట్​లో ఆల్​టైమ్ హిట్ కొట్టేసిన టమాటా ధర

కొండెక్కిన ధరలు...ఆహార సంక్షోభం దిశగా దేశం..?

2023 జూన్‌లో ఆహార ద్రవ్యోల్బణం 4.49%గా నమోదైంది. గతేడాది జూన్‌లో ఇది 7.56% ఉంది. పేద వర్గాల ప్రధాన ఆహారం బియ్యం, గోధుమ. గత సంవత్సరం గోధుమల సేకరణ తక్కువ జరగడంతో అవి వినియోగించే రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా చౌక ధరల దుకాణాల ద్వారా పెద్ద మొత్తంలో బియ్యం అందిస్తోంది. కొవిడ్‌ నేపథ్యంలో 2020 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు ప్రభుత్వం ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల గోధుమలు/బియ్యం అందించింది. ఇది రేషన్ కార్డ్ హోల్డర్లు బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం తగ్గించింది. 2023జూన్‌లో తృణధాన్యాల ద్రవ్యోల్బణం 12.71%గా నమోదైంది. జూన్‌లో గోధుమలు, గోధుమ పిండి కోసం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో మార్కెట్‌కు సరఫరా జరుగుతుంది. ఈ ఏడాదిమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం గోధుమలను ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ - O.M.S.S కింద విక్రయించాల్సి వచ్చింది. తద్వారా ధరల పెరుగుదలకు చెక్ పెట్టవచ్చన్నది ప్రణాళిక. బియ్యం ధరలు పెరగడానికి ఎల్-నినో భయం, దిగుబడి తగ్గడం కారణం. ఉత్పత్తి అంచనాలపై ఆందోళనల రీత్యా రాబోయే రోజుల్లో గోధుమల ధరా పెరగవచ్చు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఉత్పత్తి 112.7 మిలియన్ టన్నులు కాగా... వాణిజ్య అంచనాలు 105 మిలియన్ టన్నుల పరిధిలో ఉన్నాయి. 3 నెలల్లో ధరల పెరుగుదల.....ఉత్పత్తి అంచనాలో ఈ వ్యత్యాసం ప్రతిబింబిస్తుంది. పండుగ సీజన్ సమీపిస్తుండడం సహా వాయువ్య రాష్ట్రాల్లో అసాధారణంగా వర్షాలు కురుస్తుండడం, తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తుండడంతో ఈ ధరల ధోరణి కొనసాగుతోంది.

Read more at:సిరులు కురిపిస్తున్న టమాటా.. నెలలో కోటీశ్వరుడైన చిత్తూరు రైతు

ప్రపంచానికి అవసరమైన బియ్యంలో 40% భారతదేశమే సరఫరా చేస్తుంది. అయితే రుతుపవనాలు అస్థిరంగా కొనసాగిన కారణంగా కేంద్రం బాస్మతీయేతర బియ్యం ఎగుమతిని నిషేధిస్తూ జూన్‌ 20న నిర్ణయం తీసుకుంది. అయినా నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు సామాన్యుడిని భయపెడుతున్నాయి. కూరగాయల ధరలు మరో నెల రోజుల్లో అదుపులోకి రావచ్చని రైతులు, వ్యాపారవర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వినియోగదారులకు ఊరట కల్పించేందుకు మార్కెట్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి నాఫెడ్‌, మార్క్‌ఫెడ్‌ సహకారంతో నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు విక్రయించాలని నిపుణులు సూచించారు. ఇటీవల ఎప్పుడూ చూడని స్థాయికి చేరిన కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని కొంతైనా తగ్గించాలంటే.... తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పూనుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ధరల తగ్గింపుపై ముఖ్యమంత్రులు సమీక్ష నిర్వహించాలని హితవు పలుకుతున్నారు. టోకు, చిల్లర విపణిలో దళారులను నియంత్రించి పెరిగిన ధరలకు రైతులకు చెందేలా... ప్రజలకు ధరలు అదుపులోకి వచ్చేలా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Read more at: 1.ఈ బాదుడుకు సామాన్యులు బతికేదెలా.. భారీగా పెరుగుతున్న వంటింటి ఖర్చు

2.సెంచరీ కొట్టిన టమాటా ధర.. రానున్న రోజుల్లో రూ.150 దాటే ప్రమాదం!

3.అమెరికాలో 'బియ్యం' వ్యాపారులకు కాసుల వర్షం.. భారీగా ఆర్డర్లు.. బాస్మతికి ఫుల్​ డిమాండ్!

ABOUT THE AUTHOR

...view details