ETV Bharat / state

Increased prices: ఈ బాదుడుకు సామాన్యులు బతికేదెలా.. భారీగా పెరుగుతున్న వంటింటి ఖర్చు

author img

By

Published : Jul 5, 2023, 7:03 AM IST

Updated : Jul 5, 2023, 8:53 AM IST

Increased prices: బాదుడే బాదుడుతో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. కిరాణా సరుకులైనా, కూరగాయలైనా అదే పరిస్థితి. వంటగ్యాస్‌ నుంచి పచారీ సరుకుల వరకు అన్నీ మంటలే. జగన్‌ పాలనలో నెలకు సరాసరిన 3 వేల 400 రూపాయలు పెరిగిన వంటింటి ఖర్చుతో.. నాలుగేళ్లలో ఒక్కో కుటుంబంపై లక్షా 63 వేల భారం పడింది. పైగా రేషన్‌ దుకాణాల్లో రాయితీపై ఇచ్చే సరుకుల సంఖ్య తగ్గించడంతో పాటు.. ఇస్తున్న అరకొర సరుకుల ధరలు పెంచేసి భారాన్ని రెట్టింపు చేశారు.

Increased prices
ఈ బాదుడుకు సామాన్యులు బతికేదెలా.. భారీగా పెరుగుతున్న వంటింటి ఖర్చు

బాదుడుకు సామాన్యులు బతికేదెలా.. భారీగా పెరుగుతున్న వంటింటి ఖర్చు

Increased prices: కూరగాయలంటే ఠక్కున గుర్తొచ్చే టమాటా కేజీ 120 రూపాయలకు చేరి ఠారెత్తిస్తోంది. పచ్చి మిర్చి అంతకు మించిపోయింది. కందిపప్పు కిలో కొనాలంటే 150కి పైమాటే. బియ్యం ధరలు బరువెక్కుతున్నాయి. వంటగ్యాస్‌ వెలిగించకముందే మండిపోతోంది. పెరిగిన సిలిండర్‌ ధరలతో నాలుగేళ్లలో ఒక్కో కుటుంబంపై 12 వేల 800 రూపాయల చొప్పున అదనపు భారం పడింది. నిత్యావసరాల ధరలు నానాటికీ పెరుగుతుండటంతో.. పేద, మధ్యతరగతి వర్గాల వంటింటి బడ్జెట్‌ రాకెట్‌లా దూసుకెళ్తోంది.

నాలుగేళ్ల కిందటితో పోలిస్తే పప్పుల ధరలు 30 నుంచి 70 శాతం వరకు పెరిగాయి. నాణ్యమైన సన్న బియ్యం రేటు ఏడాదిలోనే 20 శాతం ఎగబాకింది. కరోనా, ఉక్రెయిన్‌- రష్యా యుద్ధ నేపథ్యంలో మండిన నూనెల ధరలు తర్వాత కాస్త దిగొచ్చినా.. ఇంకా సలసల మరుగుతూనే ఉన్నాయి. కూరగాయల ధరలు 100 శాతం నుంచి 200శాతం వరకు పెరిగాయి. మొత్తంగా చూస్తే నాలుగేళ్లలో పేదల వంటింటి బడ్జెట్‌ 60శాతం పెరిగింది. ఒక్కో కుటుంబంపై నెలకు 3 వేల 400 రూపాయలకుపైగా అదనపు భారం పడుతోంది.

అటకెక్కిన కూరగాయలు.. కిలోల లెక్కన కూరలు కొనడం కష్టమే. గతంలో 100 తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు కిలో టమాటా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉత్పత్తి తగ్గిపోవడంతో టమాటా ధర అంతకంతకూ పెరుగుతూ కిలో 120కి చేరింది. పచ్చిమిర్చి ధర కూడా వారం వ్యవధిలోనే 80కి పైగా పెరిగి.. ప్రస్తుతం కిలో 150కి పైనే పలుకుతోంది. పట్టణాల్లో కొన్ని మాల్స్, ఆన్‌లైన్‌లో కిలో పచ్చి మిర్చి 280 వరకు ఉండటం గమనార్హం. సుగంధ ద్రవ్యాల ధరలూ పరుగులు తీస్తున్నాయి. ఫిబ్రవరిలో కిలో 60 నుంచి 70 మధ్య ఉన్న అల్లం.. మార్చి నెలాఖరుకు 100కు పైగానే చేరింది. అక్కడి నుంచి 250 వరకు వచ్చింది. కారంపొడి ధర ఏకంగా 150 శాతం నుంచి 200శాతం వరకు పెరిగింది. పచ్చళ్లకు ఉపయోగించే కారమైతే మరింత ఘాటెక్కింది. వెల్లుల్లి రేటు కూడా 20శాతం వరకు పెరిగింది.

వంటగ్యాస్‌ ఎంత తక్కువగా వినియోగించినా ప్రతి ఇంటికీ ఏడాదికి కనీసం 8 సిలిండర్లు అవసరమవుతాయి. ఒక్కో సిలిండర్‌ ధర నాలుగేళ్ల కిందట 541 రూపాయలు ఉండగా.. ఇప్పుడు 11వందల 9 అయింది. గ్రామీణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల 11వందల 50 నుంచి 11వందల 75 పైమాటే. అంటే 2019 జులై నాటితో పోలిస్తే సిలిండర్‌పై 568 రూపాయలు పెరిగింది. సగటున సిలిండర్‌పై 400 చొప్పున ధర పెరిగిందనుకున్నా.. నాలుగేళ్లకు ఒక్కో కుటుంబం నుంచి 12వందల 800 చొప్పున లాగేస్తున్నారు.

సామాన్యుడు బతికలేని పరిస్థితి.. పంచదార, బెల్లం ధరలు సగటున 20శాతం వరకు అధికమయ్యాయి. గోధుమపిండి, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, ఇతర సరుకుల ధరలూ సగటున 30శాతం పైనే పెరిగాయి. టీ, కాఫీ పొడుల ధరలూ కిలోకు 150 వరకు ఎగబాకాయి. పచ్చజొన్నల ధరలు కిలో 90కి చేరాయి. చిరు వ్యాపారులు తెచ్చే గేదె పాల ధర లీటరు 90పైనే ఉంది. కోడి మాంసం ధర ఇటీవలి వరకు కిలో 320కి చేరింది. ప్రస్తుతం కిలోకు 80 వరకు తగ్గింది. కోడి గుడ్డు ధర 6కు చేరింది. ఈ ధరల మంటతో సామాన్యుడు బతికే పరిస్థితి కనబడటం లేదు.

రేషన్‌ దుకాణాల్లో బియ్యం తప్ప మరేమీ దొరకడం లేదని ఎన్నికల ముందు చెప్పిన జగన్‌.. సీఎం అయ్యాక అప్పటివరకు రేషన్‌ కార్డులపై అందించే నిత్యావసరాలకు కోత పెట్టారు. 2019 జూన్‌ వరకు ఒక్కో కార్డుపై రెండు కిలోల కందిపప్పు, అరకిలో పంచదార, ఉప్పు, గోధుమపిండి, జొన్నలు, రాగులు రాయితీపై అందించేవారు. కందిపప్పును 2 కిలోల నుంచి కిలోకు కుదించడంతో పాటు.. కిలో ధర 40 నుంచి 67కి పెంచారు. జూన్, జులైలో పంపిణీ పూర్తిగా నిలిపేశారు. పంచదార ధరనూ అరకిలోకు 10 చొప్పున పెంచారు. గోధుమపిండిని ఇటీవలే ప్రారంభించినా.. అదీ పట్టణ ప్రాంతాలకే పరిమితం చేశారు.

జొన్నలు, రాగులు కూడా గత నెల నుంచే ప్రారంభించి కొన్ని ప్రాంతాల్లోనే ఇస్తున్నారు. 2019 వరకు ఉద్యాన పంటల సాగుకు అధిక ప్రోత్సాహకాతో పాటు రక్షిత సేద్య విధానంలో కూరగాయ పంటల సాగుకు అప్పటి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. రైతులకు హైబ్రిడ్‌ కూరగాయ విత్తనాలను రాయితీపై అందించడంతోపాటు.. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి జరిగేలా చర్యలూ తీసుకుంది. గత నాలుగేళ్లుగా ఉద్యానరంగానికి ప్రోత్సాహకాలే అందడం లేదు. దీనికితోడు అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోయింది. మొత్తంగా ధరలు పెరిగి.. సామాన్యుడి నడ్డి విరిగింది.

Last Updated : Jul 5, 2023, 8:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.