ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP leader Pattabhi మేం బయటపెట్టిన నివేదిక తప్పైతే, నిజమైంది ఎందుకు బయటపెట్టరు

By

Published : Aug 22, 2022, 2:54 PM IST

Updated : Aug 23, 2022, 7:36 AM IST

TDP leader Pattabhi
పట్టాభి

TDP leader Pattabhi వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియోపై తాము బయటపెట్టిన ఫోరెన్సిక్ నివేదిక అసత్యమైనదని చెప్పిన సీఐడీ చీఫ్​, నిజమైంది ఎందుకు బయటపెట్టలేదని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి నిలదీశారు. వాస్తవం తెలుసు కాబట్టే అసలు నివేదికను విడుదల చేసే ధైర్యం సునీల్ కుమార్ చేయలేదని ఆరోపించారు. వైకాపా పేటీఎం బ్యాచ్ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న నివేదికపై ఎందుకు విచారణ చేయట్లేదని పట్టాభి ప్రశ్నించారు.

TDP leader Pattabhi హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో కాల్‌కు సంబంధించి ప్రచారంలో ఉన్న వీడియో అసలైందేనని అమెరికాకు చెందిన ఫోరెన్సిక్‌ నిపుణుడు జిమ్‌ స్టాఫర్డ్‌ ఇచ్చిన నివేదికను సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ దాచిపెట్టి, ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు. సునీల్‌కుమార్‌ దాచిన రిపోర్టు కాపీ తన వద్ద ఉందంటూ ఆ పత్రాన్ని మీడియాకు విడుదల చేశారు. పట్టాభి సోమవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సునీల్‌కుమార్‌ తప్పు చేయకుంటే.. జిమ్‌ స్టాఫర్డ్‌ నివేదికకు సంబంధించి తెదేపా విడుదల చేసిన డాక్యుమెంట్‌, ఆయనకు ఎక్లిప్స్‌ ల్యాబ్‌ పంపిందని చెబుతున్న నివేదికను పోలుస్తూ ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘2022 ఆగస్టు 11న ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ లాబొరేటరీ అధినేత జిమ్‌ స్టాఫర్డ్‌ ఇచ్చిన ప్రాథమిక నివేదిక (సీఐడీ చీఫ్‌ దాచిపెట్టిన నివేదిక)లో పోతిని ప్రసాద్‌.. ఆ వీడియోను ఫోరెన్సిక్‌ పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు ఎప్పుడిచ్చారో ప్రస్తావించలేదు. అలాగే, ‘వీడియో కాల్‌’కు బదులు ‘ఫేస్‌టైం వీడియో కాల్‌’ అని రాశారు. దాంతో ప్రజలకు అర్థమయ్యేందుకుగానూ నివేదికలో రెండు చిన్న సవరణలు చేయాలని ల్యాబ్‌ను పోతిని ప్రసాద్‌ కోరారు. ల్యాబ్‌కు వీడియో అందజేసిన తేదీ (2022 ఆగస్టు 9)ని నివేదికలో ప్రస్తావించాలని, ‘ఫేస్‌టైం వీడియో కాల్‌’కు బదులు ‘వీడియో కాల్‌’ అని చేర్చాలని కోరారు. ల్యాబ్‌ సిబ్బంది ఆ రెండు చిన్న సవరణలు చేసి రిపోర్ట్‌ను ప్రసాద్‌కు ఇచ్చింది. అంతకుమించి మరే అంశాన్నీ సవరించలేదు. సీఐడీ చీఫ్‌ పంపిన ఈమెయిల్‌కు జిమ్‌ స్టాఫర్డ్‌ బదులిస్తూ.. ఆ రెండు సవరణలూ అంతగా పరిగణనలోకి తీసుకోవాల్సినవి కాదని స్పష్టంగా చెప్పారు. ల్యాబ్‌కు ప్రసాద్‌ పంపిన వీడియో నిజమైందేనని కూడా ధ్రువీకరించారు. ల్యాబ్‌ సిబ్బంది సవరించిన నివేదిక ప్రసాద్‌కు ఇచ్చిన విషయం తెలీక.. జిమ్‌ స్టాఫర్డ్‌ తన ప్రాథమిక నివేదికనే సునీల్‌కుమార్‌కు మెయిల్‌ ద్వారా పంపించారు’ అని పట్టాభి వివరించారు.

సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపే ధైర్యముందా?

‘జిమ్‌ స్టాఫర్డ్‌ తనకు పంపిన ప్రాథమిక నివేదికను సునీల్‌కుమార్‌ ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయకుండా, ఆకాశం బద్ధలై భూమిపై పడ్డట్టుగా, ఘోర తప్పిదమేదో జరిగిపోయినట్టుగా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. మాధవ్‌ వీడియో పరిశీలించిన స్టాఫర్డ్‌ అది నూరుశాతం నిజమని తేల్చిన మాట వాస్తవం. ప్రభుత్వానికి ఇంకా నమ్మకం కుదరకపోతే ఆ వీడియోను సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించి వాస్తవం తెలుసుకోవాలి. ప్రభుత్వానికి ఆ ధైర్యముందా?’ అని పట్టాభి సవాల్‌ చేశారు. ‘సునీల్‌కుమార్‌కు స్టాఫర్డ్‌ పంపిన ప్రాథమిక నివేదిక, ఈ రోజు నేను ప్రజల ముందు ఉంచుతున్న నివేదిక ఒక్కటే. ఒకవేళ కాదంటే సునీల్‌కుమార్‌ తన వద్దనున్న నివేదికను మీడియా వేదికగా లైవ్‌లో తన ఈమెయిల్‌ ఖాతా నుంచి డౌన్‌లోడ్‌ చేసి ప్రజలకు చూపించాలి’ అని డిమాండ్‌ చేశారు. తెదేపా విడుదల చేసిన ఎక్లిప్స్‌ ల్యాబ్‌ రిపోర్టుపై బురదజల్లుతున్న సునీల్‌కుమార్‌.. వైకాపా సామాజిక మాధ్యమాల్లో ‘ఆల్బర్ట్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌’ పేరుతో విడుదల చేసిన నకిలీ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని పట్టాభి డిమాండ్‌ చేశారు.

పట్టాభి

లిక్కర్‌ మాఫియా గుట్టు బయట పడకూడదనే : కేఎస్‌ జవహర్‌

దిల్లీ ఎక్సైజ్‌ విధానంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణలో తన లిక్కర్‌ మాఫియా గుట్టు బయట పడకూడదనే సీఎం జగన్‌రెడ్డి దిల్లీ వెళ్లి మంతనాలు జరుపుతున్నారని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ ఆరోపించారు. దిల్లీ మద్యం కుంభకోణంలో రాష్ట్ర వైకాపా నాయకులకు లింకులున్నాయని, విజయసాయిరెడ్డి అల్లుడి సన్నిహితుడిని కాపాడేందుకే జగన్‌ ఆకస్మిక దిల్లీ పర్యటన అని విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైకాపా నాయకులు కల్తీ మద్యం వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. దిల్లీ మద్యం కుంభకోణంలో అరబిందో ఇండస్ట్రీస్‌లో కీలకవ్యక్తి శరత్‌చంద్రారెడ్డి పేరు వినిపిస్తోంది. ఆయన విజయసాయిరెడ్డి వియ్యంకుడని చెబుతున్నారు. మరో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కంపెనీలు మూడు చోట్ల సిండికేట్లు దక్కించుకున్నాయని, ఇందుకోసం ఆయన రూ.కోట్లు ముడుపులుగా చెల్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి’ అని జవహర్‌ మండిపడ్డారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 23, 2022, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details