ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AMARAVATI FARMERS MAHA PADAYATRA IN NELLORE : వర్షంలోనూ ముందుకే.. 27వరోజు ముగిసిన రైతు మహాపాదయాత్ర

By

Published : Nov 27, 2021, 9:47 PM IST

భగభగమనే భానుడు సైతం వారి బాటకు అడ్డుతొలిగాడు. వణికించే వరుణుడు సైతం వారి సంకల్పానికి తలవంచాడు. ఎండైనా, వానైనా వెనకడుగేలేదంటూ ముందుకు సాగుతున్న అమరావతి రైతులు.. 300 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. నెల్లూరు జిల్లాలో 27వ రోజు మహాపాదయాత్ర(Amaravati maha padayatra reached 27th day) జన నీరాజనాల మధ్య సాగింది.

నెల్లూరు జిల్లాలో మహాపాదయాత్ర
నెల్లూరు జిల్లాలో మహాపాదయాత్ర

అమరావతి రైతుల మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. 27వ రోజు పాదయాత్రకు జనం పోటెత్తారు. వివిధ రాజకీయ పార్టీలతోపాటు ప్రజాసంఘాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద, సేవా సంస్థ ప్రతినిధులు మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపారు. పాదయాత్ర ప్రారంభమైన కొద్ది సేపటికే జోరు వర్షం కురిసింది. అయినా.. చెక్కు చెదరని సంకల్పంతో వర్షంలోనే తడుస్తూ రైతులు ముందుకు కదిలారు. జై అమరావతి నినాదాలు(Jai amaravathi slogans) చేశారు. వానైనా వరదైనా ఆగని ఉద్యమం అమరావతి ఉద్యమం అంటూ నినాదాలు చేశారు. భోజన విరామం తర్వాతా వర్షం ఇబ్బందిపెట్టినా రైతులు యాత్రను ఆపలేదు. పొదలకూరు రోడ్డు వద్ద పాదయాత్ర 300 కిలోమీటర్లకు చేరడంతో.. స్థానికులు బంతిపూలతో వారికి స్వాగతం పలికారు.

నెల్లూరు జిల్లాలో మహాపాదయాత్ర

నేతల మద్దతు..
రైతుల పాదయాత్రలో తెలుగుదేశం, కాంగ్రెస్‌ నేతలు(party leaders support) పాల్గొన్నారు. రైతులతో కలిసి పాదం కదిపారు. రాళ్ల వర్షం కురుస్తుందని వైకాపా చేసిన బెదిరింపులకు భిన్నంగా జనం పూల వర్షం కురిపిస్తున్నారని నేతలు అన్నారు. ప్రజల స్పందనను సీఎం జగన్ గ్రహించాలని హితవు పలికారు. భాజపా కిసాన్ మోర్చా , రైతు కూలీలు యాత్రలో పాల్గొన్నారు.

ఘనస్వాగతం..
బారా షహీద్‌ దర్గా వద్ద ముస్లింలు.. రైతులకు ఘనస్వాగతం పలికారు. అమరావతే ఏకైక రాజధాని కొనసాగాలంటూ ప్రార్థనలు చేశారు. శ్రీకృష్ణ మానస ప్రచార మండలి తరఫున రైతులందరికీ తిరునామాలు పెట్టారు. కార్తీకమాసం చివరి వారం సందర్భంగా స్వామివారి ప్రచార రథానికి ప్రత్యేక పూజలు చేశారు. నెల్లూరు బార్‌ అసోసియేషన్ తరఫున న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. నాయిబ్రాహ్మణులు, ట్రాన్స్‌జెండర్లు రాజధాని రైతులకు హారతులిచ్చారు. స్థానిక చిరు వ్యాపారులు రైతులకు పాలతో అభిషేకం చేశారు.

రేపు విరామం..
27వ రోజు 12 కిలోమీటర్ల మేర సాగిన యాత్ర అంబాపురంలో ముగిసింది. శాలివాహన ఫంక్షన్‌ హాల్‌లో రైతులు బస చేశారు. కాగా.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారుల హెచ్చరిక దృష్ట్యా.. రేపు పాదయాత్రకు అమరావతి ఐకాస విరామం ప్రకటించింది.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details