ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CMRF: సీఎంఆర్‌ఎఫ్‌లో అవకతవకలు.. నలుగురు అరెస్ట్

By

Published : Sep 23, 2021, 7:49 AM IST

Updated : Sep 23, 2021, 8:19 AM IST

ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించి అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఏసీబీ నలుగురిని అరెస్ట్ చేసింది. 2014 నుంచి అక్రమాలు జరిగాయని వెల్లడించింది. రూ. 60 లక్షలు పక్కదారి పట్టినట్లు గుర్తించింది.

acb arrest four members about manipulations of cm relief fund
acb arrest four members about manipulations of cm relief fund

ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)కి సంబంధించి 2014 నుంచి పలు అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై తాజాగా నమోదు చేసిన కేసులో ఏసీబీ బుధవారం నలుగురిని అరెస్టు చేసింది. సీఎంఆర్‌ఎఫ్‌ కార్యాలయంలో సబార్డినేట్‌ సీహెచ్‌.సుబ్రహ్మణ్యం, ఆయన అనుచరుడు చదలవాడ మురళీకృష్ణ, సచివాలయంలో రెవెన్యూ శాఖలో ఆఫీస్‌ సబార్డినేట్‌ సోకా రమేష్‌లతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలకు ప్రైవేటు పీఏగా పనిచేస్తున్నానని చెప్పుకొనే కొండేపూడి జగదీష్‌ ధనరాజ్‌ అలియాస్‌ నానీని అరెస్టు చేసి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచింది. 2014 నుంచి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ క్లెయిములలో కొన్నింటిని పరిశీలించగా, రూ.60 లక్షలు పక్కదారి పట్టినట్లు తేలిందని ఏసీబీ బుధవారం వెల్లడించింది. దర్యాప్తు పూర్తయితే మొత్తం వివరాలు బయటికొస్తాయని తెలిపింది. 2014 నుంచి మంజూరైన వాటిల్లో అనుమానాస్పద 88 క్లెయిమ్‌లను పరిశీలించిన ఏసీబీ... వాటి కోసం రూ.1.81 కోట్లు మంజూరైనట్లు తేల్చింది. వాటిల్లో 35 క్లెయిములకు సంబంధించి రూ.61.68 లక్షలు నకిలీ దరఖాస్తుదారుల ఖాతాల్లో జమయ్యాయని, మిగతా 55 క్లెయిములకు సంబంధించిన రూ.1.20 కోట్లును వారి ఖాతాలకు జమచేయకుండా నిలిపివేయించామని ఏసీబీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

అక్రమ పద్ధతుల్లో కొల్లగొట్టి

కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మయ్య యాదవ్‌ 2016లో తప్పుడు బిల్లులు సమర్పించి సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు కాజేశారన్న ఆరోపణలపై 2017లో సింహాద్రిపురం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. 2014 నుంచి సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరు దస్త్రాలు పరిశీలించాలని సీఎం కార్యాలయం ఏసీబీని ఆదేశించింది. ఒకే ఫోన్‌ నంబరును వేర్వేరు దరఖాస్తుల్లో పేర్కొన్నారని, ఐపీ నంబరు లేదని, చెన్నై, బెంగళూరు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నామని క్లెయిముల్లో పేర్కొని అవకతవకలకు పాల్పడినట్లు తేల్చింది. సీఎంఆర్‌ఎఫ్‌ ఉద్యోగుల లాగిన్‌ వివరాలు దొంగిలించి అక్రమ పద్ధతుల్లో వెబ్‌సైట్‌లోకి చొరబడినట్లు గుర్తించింది. ఈ నెల 21న గుంటూరు రేంజి ఏసీబీ కేసు నమోదు చేసి, నలుగుర్ని అరెస్టు చేసింది.

ఇదీ చదవండి:FUNDS: 'కేంద్రం నిధులివ్వగానే రూ.400 కోట్లు చెల్లిస్తాం'

Last Updated :Sep 23, 2021, 8:19 AM IST

ABOUT THE AUTHOR

...view details