తెలంగాణ

telangana

అక్రమ మైనింగ్ కేసు - పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడు అరెస్ట్

By ETV Bharat Telangana Team

Published : Mar 15, 2024, 11:39 AM IST

Updated : Mar 15, 2024, 12:48 PM IST

Patancheru MLA Brother Arrested : అక్రమ మైనింగ్ కేసులో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడు మధుసూదన్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పరిమితికి మించి ఆయన తవ్వకాలు జరిపారని అధికారుల ఫిర్యాదుతో అరెస్టు చేసి పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మధుసూదన్‌ రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

Gudem Madhusudhan Reddy Arrest
Gudem Madhusudhan Reddy Arrest

పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడు అరెస్ట్

Patancheru MLA Brother Arrested : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Patancheru MLA Mahipal Reddy) సోదరుడు గూడెం మధుసూదన్‌ రెడ్డిని అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన నివాసానికి వచ్చిన పోలీసులు అరెస్టు చేసి పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

MLA Mahipal Reddy Brother Arrest :లక్డారం గ్రామంలో మధసూదన్‌ రెడ్డి సంతోష్‌ గ్రానైట్‌ మైనింగ్ పేరుతో క్రషర్‌ కంపెనీలు నిర్వహిస్తున్నారు. అయితే కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి తవ్వకాలు జరిపారని, అదే విధంగా అనుమతుల గడువు పూర్తయినా మైనింగ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల క్వారీని అధికారులు సీజ్ చేశారు. దీనిపై తాజాగా తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మధుసూదన్‌ రెడ్డిపై అక్రమ మైనింగ్‌, చీటింగ్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. క్రషర్లను సీజ్‌ చేశారు.

మధుసూదన్‌ రెడ్డిని (Madhusudan Reddy Arrested) అరెస్టు చేశారనే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు ఆయణ్ను వైద్య పరీక్షల కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా గులాబీ శ్రేణులు అడ్డుకున్నారు. పోలీసులు వారి నిలువరించి అక్కడి నుంచి మధుసూదన్​ రెడ్డిని సంగారెడ్డికి తరలించారు.

సంగారెడ్డి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత :మరోవైపు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడికి బీఆర్ఎస్‌ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఆసుపత్రిలోకి వెళ్లేందుకు వారు యత్నించారు. పోలీసులు ఆసుపత్రి ప్రధాన గేటును మూసివేశారు. తమను లోపలికి అనుమతించాలని గులాబీ శ్రేణులు నినాదాలు చేశారు. అత్యవసర విభాగంలో మధుసూదన్ రెడ్డికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

HarishRao on Madhusudhan Reddy Arrest :మధుసూదన్‌ రెడ్డి అరెస్ట్‌పై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. తమ పార్టీ నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. హస్తం పార్టీలో చేరని ఎమ్మెల్యేలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. అరెస్టు చేసే సమయంలో ఓ పద్ధతి ఉంటుందని చెప్పారు. పదేళ్లలో భారత్ రాష్ట్ర సమితి ఎప్పుడూ అధికార దుర్వినియోగం చేయలేదని అన్నారు.

మంత్రి ఆదేశాలతోనే అరెస్ట్‌ : మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతోనే మధుసూదన్‌ రెడ్డిని అరెస్టు చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. మూడు నెలల కాల వ్యవధిలో మూడు కేసులు పెట్టారని తెలిపారు. ప్రజా సమస్యలను కాంగ్రెస్‌ గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రతిపక్షాలపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తామని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదు : కాంగ్రెస్‌ హయాంలోనే లక్డారం క్వారీ అనుమతులు ఇచ్చారని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు. క్వారీని తన సోదరుడు మధుసూదన్‌ రెడ్డి చూస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. ఏదైనా తప్పు చేస్తే నోటీసులు ఇవ్వాలని లేదా పెనాల్టీ వేయాలని పేర్కొన్నారు. కానీ తెల్లవారుజామున 3 గంటలకు అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని అన్నారు. అన్ని అనుమతులతోనే క్రషర్లు నిర్వహిస్తున్నామని, హస్తం పార్టీ బెదిరింపులకు భయపడేది లేదని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.

రంగు రాళ్లపై కన్నేసి గుట్టను కరిగించేస్తున్న అక్రమార్కులు - మైనింగ్ మాఫియా​పై అధికారుల శీతకన్ను

Last Updated : Mar 15, 2024, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details