ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కన్నీరు పెట్టిస్తున్న మిర్చి - 'గిట్టుబాటు' కాలేదంటున్న అన్నదాతలు - Mirchi farmers

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 12:39 PM IST

No Sufficient Price Mirchi Crop : రాష్ట్రంలో మిర్చి పంట రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టపడిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాలేదని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. రైతులు కష్టకాలంలో ఉంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తోందని కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

mirchi_crop
mirchi_crop

రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న మిర్చి పంట - పెట్టిన పెట్టుబడి కూడా రాలేదంటున్న రైతన్నలు

No Sufficient Price Mirchi Crop : ఆరుగాలం శ్రమించినా ఫలితం శూన్యమంటూ మిరప రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదని రైతులు వాపోయారు. సాధారణంగా ఏప్రిల్‌ వరకూ తోటల్లో కోతలు సాగుతుంటాయి. ఈ ఏడాది జనవరిలోనే పంట కోత ప్రక్రియ ముగిసిపోయింది. అక్కడకక్కడా కొందరు రైతులు అరకొరగా పండిన కాయల్ని కోసి మిగిలిన పంటను వదిలేస్తున్నారు. మరోవైపు ధరలు సైతం తక్కువగా ఉండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. మూడేళ్లుగా రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం రైతులకి ఎలాంటి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆశాజనకంగా లేని మిరప ధరలు - ఆవేదనలో అన్నదాతలు - No Sufficient Price To Mirchi
రాష్ట్రంలో ఈ ఏడాది 6 లక్షల 45 వేల ఎకరాల్లో మిరప సాగు చేశారు. కర్నూలు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, ఎన్టీఆర్‌, నంద్యాల, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మిర్చి పంటను అత్యధికంగా సాగు చేస్తారు. కోత ఖర్చులతో కలిపి ఎకరాకు 2 లక్షల 50 వేల వరకు పెట్టుబడి పెట్టారు. రైతన్నలను ఎవర్నీ కదిలించినా లక్షల్లో నష్టపోయామంటున్నారు.

మిరప పంట వేసే ఆరంభంలోనే తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడం వల్ల ట్యాంకర్ల నీటితో మొక్కలు నాటామని రైతులు తెలిపారు. ఫలితంగా ఎకరాకు రూ. 6 వేలు అదనంగా ఖర్చయింది. గత నవంబరులో జెమిని వైరస్‌ రాగా ఆకులు ముడుచుకు పోయాయి. చాలామంది రైతులు పాడైన మొక్కల్ని తొలగించి కొత్త మొక్కలు నాటేందుకు ఎకరాకు రూ.10 వేలకు పైగా అదనంగా ఖర్చు పెట్టారు. దీనికితోడు వర్షాభావంతో గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల తోటల్ని తొలగించారు. కొందరు రైతులు ట్యాంకర్ల ద్వారా నీరు పెట్టేందుకు ఎకరాకు రూ.8 వేలు నుంచి రూ.12 వేలు అదనంగా ఖర్చుచేశారు.ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు సాగునీటి కోసం ఆందోళన చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని రైతాన్నలు వాపోతున్నారు.

కర్ణాటకలో మిర్చి రైతుల ఆందోళన - జీపు, లారీకి నిప్పు - ఉద్రిక్తత

గత డిసెంబరులో మిగ్‌జాం తుపాను విరుచుకుపడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులను నట్టేట ముంచింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో మిరప నేల వాలింది. చాలాచోట్ల నీరు నిలిచి ఉరకెత్తి మొక్కలు చనిపోయాయి. తెగుళ్లు పెరిగి, పంటను కాపాడుకునేందుకు భారీగా రసాయనాల్ని పిచికారీ చేయాల్సి వచ్చింది. ఎకరా మిరప సాగుచేస్తే పురుగు మందులకే లక్షకు పైగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని రైతులు వాపోయారు. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందనుకుంటే కోత ఖర్చులకే క్వింటాకు రూ.6 వేలు దాకా ఖర్చులయ్యాయని రైతులు తెలిపారు.

ప్రతి సంవత్సరం పంట కాల పరిమితి ఏప్రిల్ వరకు ఉండగా ఈ ఏడాది రైతులు ముందుగానే ముగించారు. చాలాచోట్ల ఇప్పటికే పంటలను దున్నేశారు. మరికొన్నిచోట్ల పంటను చివరి కోతకు సిద్ధం చేస్తున్నారు. మూడేళ్లుగా రైతులు తీవ్రంగా నష్టపోయినా మిర్చి రైతులను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. గతేడాది దిగుబడులు తగ్గినా నామమాత్రంగా పంటల బీమా ఇచ్చి, ఎక్కువశాతం మందికి మొండిచేయి చూపించారు. ఈ ఏడాదీ రైతులకు ఉపశమనం కలిగించే చర్యల్ని ప్రభుత్వం తీసుకోవడం లేదు. ఇప్పటికైనా మిరప రైతుల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details