డెల్టా రైతుల భగీరథ యత్నం- కిలోమీటర్‌ మేర పైపులు వేసి నీటిని తరలిస్తున్న వైనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2024, 10:11 AM IST

thumbnail

Farmers Problems for Water: కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగు చేసిన రబీ పంటలకు సాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. పంటకు నీరందించేందుకు అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. సకాలంలో నీరందకపోవడంతో బాపట్ల ,రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో వేల ఎకరాల్లో మొక్కజొన్న, మినుము, పెసర పైర్లలో ఎండుముఖం పట్టాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఖరీఫ్‌లో లక్షల ఎకరాల్లో పండించిన వరి పంట మిగ్‌జాం తుపాను కారణంగా పూర్తిగా దెబ్బతింది. కనీసం రబీ పంటలైన బాగా పండితే వచ్చే ఆదాయంతో అప్పుల నుంచి కొంతైనా ఉపశమనం లభిస్తుందని కర్షకులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. 

పంటను కాపాడుకునేందుకు కాలువల నుంచి ఇంజన్ల ద్వారా తోడిన నీటిని కిలోమీటర్‌ మేర పైపులు వేసి పొలాలకు తరలిస్తున్నారు. ఎకరా విస్తీర్ణంలోని మొక్కజొన్న పంట ఒకసారి తడపడానికి సుమారు 5 వేల రూపాయల ఖర్చు అవుతుందని రైతులు చెప్తున్నారు. అయినా పైర్లు ఎండిపోకుండా ఉండడానికి అదనపు భారం భరిస్తున్నామంటున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు స్పందించి కాలువలకు సాగునీటిని విడుదల చేసి కనీసం ఒక్కసారైనా పంట తడికి అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.