Inter Exams Telangana 2024 : రాష్ట్రంలో ఈనెల 28వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు.
Telangana Inter Exams Schedule 2024 :రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసినట్లు శ్రుతి ఓజా తెలిపారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. టెలిమానస్ ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. విద్యార్థులు మానసకింగా ఒత్తిడికి గురైనా, పరీక్షల సమయంలో ఇతర ఏ రకమైన మానసిక సమస్యలకు గురైనా టెలిమానస్‌ను సంప్రదించొచ్చని అన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
"పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే విద్యార్థులంతా రావాలి. వేసవి కాలం కావడంతో డీహైడ్రేషన్‌కు గురి కాకుండా సరైన ఆహారం తీసుకోవాలి. సరిపడా నీళ్లు తాగాలి. ఎగ్జామ్ హాల్‌లో ఉదయం 9 గంటల లోపే ఉండాలి. 9 గంటలు దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోం. ఇది గమనించి విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు." - శ్రుతి ఓజా, ఇంటర్ బోర్డు కార్యదర్శి
ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు - షెడ్యూల్ ఇదే
పరీక్షల సమయం కాబట్టి విద్యార్థులు ఒత్తిడికిలోనవుతారని, తల్లిదండ్రులంతా వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని శ్రుతి ఓజా తెలిపారు. వారు ఒత్తిడికి లోనవ్వకుండా ధైర్యం చెబుతూ వెన్నుతట్టి ప్రోత్సహించాలని సూచించారు. ఎండలు మండిపోతున్నందున విద్యార్థులకు సరైన ఆహారం అందించాలని, వారు సరిపడా నీళ్లు తాగేలా చూడాలని తల్లిదండ్రులకు శ్రుతి ఓజా సలహా ఇచ్చారు.