తెలంగాణ

telangana

సేమ్ ప్లాన్​ రిపీట్​ - భారత్​ x ఇంగ్లాండ్​ - జట్టులో వాళ్లే కీలకం!

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 6:53 AM IST

India vs England Test Series 2024 : ఉప్పల్​ వేదికగా జరగనున్న ఐదు టెస్టుల సిరీస్​కు సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్​ కోసం అటు భారత్​తో పాటు ఇటు ఇంగ్లాండ్ జట్టు తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల విజయావకాశాలు ఎలా ఉన్నాయంటే ?

India vs England Test Series 2024
India vs England Test Series 2024

India vs England Test Series 2024 : హైదరాబాద్​లోని ఉప్పల్​ స్టేడియం వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య అయిదు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న తొలి టెస్టు కోసం ఇప్పటికే రెండు జట్లు ప్రాక్టీస్‌ మొదలెట్టాయి. ఇక సొంతగడ్డపై టీమ్ఇండియా టెస్టు సిరీస్‌ ఓడి 11 ఏళ్లు గడిచిపోయాయి. కానీ చివరగా ఓడింది మాత్రం ఇంగ్లాండ్‌ చేతిలోనే కావడం గమనార్హం. 2012లో నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-2తో ఓటమిని చవి చూసింది. అప్పటి నుంచి సొంతగడ్డపై భారత్‌ మరో టెస్టు సిరీస్​లో ఓడిపోలేదు. ప్రత్యర్థికి సిరీస్‌ డ్రా చేసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. వరుసగా అన్ని సిరీసుల్లోనూ గెలిచింది. 46 టెస్టుల్లో 36 నెగ్గింది. మూడు మాత్రమే ఓడింది. ఏడు డ్రా చేసుకుంది. 2016లో 4-0తో, 2021లో 3-1తో ఇంగ్లాండ్‌నూ చిత్తుచేసింది. ఇప్పుడు మరోసారి ఇంగ్లాండ్‌తో పోరుకు మైదానంలోకి దిగనుంది.

మరోవైపు భారత్‌లో మరో టెస్టు సిరీస్‌ విజయం కోసం ఇంగ్లాండ్‌ పరితపిస్తోంది. ఇక్కడ 15 టెస్టు సిరీస్​లు (1980లో జరిగిన ఏకైక టెస్టు తప్ప) ఆడిన ఇంగ్లాండ్‌ నాలుగింట్లో గెలిచి మూడు మాత్రమే డ్రా చేసుకుంది. మిగతా 8 సిరీస్‌ల్లో ఓటమిపాలైంది. అయితే భారత్‌లో టెస్టు సిరీస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్లు టోనీ గ్రెయిగ్‌, డగ్లస్‌ జార్డిన్‌, డేవిడ్‌ గోవర్‌, కుక్‌ సరసన నిలవాలనే పట్టుదలతో స్టోక్స్‌ ఉన్నాడు. అలా స్టోక్స్​ కోచ్‌ మెక్‌కలమ్‌తో కలిసి ఇంగ్లాండ్‌ టెస్టులాడే విధానాన్నే పూర్తిగా మార్చేశాడు. అలా బజ్‌బాల్‌ ఆటతో ఇంగ్లీష్​ జట్టు దూకుడు అందుకుంది. పూర్తిస్థాయి కెప్టెన్‌గా స్టోక్స్‌ 18 టెస్టుల్లో 13 విజయాలు అందుకున్నాడు.

అబుదాబిలో ట్రైనింగ్​ : అయితే గత 18 నెలలుగా ఇంగ్లీష్​ జట్టు టెస్టుల్లో సగటున ఓవర్‌కు 4.8 పరుగుల చొప్పున సాధించింది. భారత్‌తో సిరీస్‌ ముంగిట వార్మప్‌ మ్యాచ్‌లు ఆడకుండా, అబుదాబిలో 11 రోజులు ట్రైనింగ్​ తీసుకుంది. ఇక్కడి స్పిన్‌ పిచ్‌లకు తగ్గట్లుగా సిద్ధమైంది. పైగా పాకిస్థాన్‌లో టెస్టు సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేయడం వల్ల స్పిన్‌ పరిస్థితుల్లో సమర్థంగా ఆడగలమనే ఆత్మవిశ్వాసంతో ఆ జట్టు అడుగుపెట్టింది.

ఇక బ్యాటర్లు బెయిర్‌స్టో, క్రాలీ, డకెట్‌, లారెన్స్‌, ఫోక్స్‌, పోప్‌, రూట్‌, స్టోక్స్‌, పేసర్లు అట్కిన్సన్‌, అండర్సన్‌, రాబిన్సన్‌, మార్క్‌ వుడ్‌ స్పిన్నర్లు టామ్‌ హార్ట్‌లీ, జాక్‌ లీచ్‌, రెహాన్‌ షోయబ్‌ బషీర్‌, అహ్మద్‌లతో ఇంగ్లాండ్‌ జట్టు బలంగానే ఉంది. సీనియర్‌ బ్యాటర్‌ రూట్‌కు భారత్‌లో మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 10 టెస్టుల్లో 50.10 సగటుతో 952 పరుగులు చేశాడు. అతను స్పిన్‌తోనూ జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించగలడు. ఇక్కడ 8 వికెట్లూ పడగొట్టాడు. ఓవరాల్‌గా భారత్‌పై 30 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో స్టోక్స్‌ 773 పరుగులు చేశాడు. అంతే కాకుండా 39 వికెట్లు పడగొట్టాడు. కానీ మోకాలి శస్త్రచికిత్స తర్వాత అతను ఈ సిరీస్‌లో బౌలింగ్‌ చేయడం కష్టమే అని మాజీలు అంటున్నారు.

ఆ ఒక్కడు ప్రమాదకరమే : మరోవైపు బ్యాటింగ్‌లో బెయిర్‌స్టో భారత్​కు ప్రమాదకరమే. డకెట్‌, క్రాలీ, పోప్‌ కూడా క్రీజులో కుదురుకుంటే ఇక పరుగులు సాధించగలరు. బౌలింగ్‌లో అండర్సన్‌, అట్కిన్సన్‌, రాబిన్సన్‌, మార్క్‌వుడ్‌ రూపంలో నాణ్యమైన పేసర్లున్నారు. వయసు మీదపడుతున్నా కూడా వన్నె తగ్గని పేస్‌తో అండర్సన్‌ దూసుకెళ్తున్నాడు. భారత్‌లో ఆడిన 13 టెస్టుల్లో అతను 34 వికెట్లు పడగొట్టాడు. దీంతో 700 టెస్టు వికెట్లకు మరో 10 వికెట్ల దూరంలో ఉన్న 41 ఏళ్ల అండర్సన్‌పై అందరి దృష్టి నిలవనుంది.

ఇక్కడి స్పిన్‌ పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన ఇంగ్లాండ్‌ మేనేజ్​మెంట్​ నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. కానీ అనుభవలేమి స్పష్టంగా తెలిసిపోతుంది. టామ్‌ హార్ట్‌లీ ఇంకా టెస్టు అరంగేట్రం చేయలేదు. 20 ఏళ్ల షోయబ్‌ బషీర్‌ కూడా ఇంకా అంతర్జాతీయ క్రికెట్లోనే అడుగుపెట్టలేదు. గాయం నుంచి కోలుకున్న జాక్‌ లీచ్‌ 35 టెస్ట్​లు ఆడగా, 19 ఏళ్ల రెహాన్‌ అహ్మద్‌ ఆడింది ఒకటే టెస్టు. మరి ఈ స్పిన్‌ దళంతో ఇంగ్లాండ్‌ ఏమేర పోటీనిస్తుందో వేచి చూడాల్సిందే.

ఇంగ్లాండ్​తో సిరీస్​ - ఉప్పల్​ గడ్డపై టీమ్​ఇండియా రికార్డులు

భారత్​-ఇంగ్లాండ్​ టెస్టు- కోహ్లి స్థానంలో ఎవరికి ఛాన్స్​ దక్కేనో?

ABOUT THE AUTHOR

...view details