తెలంగాణ

telangana

కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు భుట్టో ఓకే- దేశాన్ని రక్షించేందుకే పొత్తు అన్న నవాజ్ పార్టీ!

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 11:22 AM IST

Updated : Feb 12, 2024, 11:49 AM IST

Pakistan New Government : పాకిస్థాన్​లో ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవరసమైన ఆధిక్యం రాలేదు. దీంతో పీపీపీతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పీఎంఎల్-ఎన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే జరిగిన చర్చల్లో ఇరు పార్టీల మధ్య సఖ్యత కుదిరింది.

Pakistan New Government
Pakistan New Government

Pakistan New Government : దాయాది దేశం పాకిస్థాన్​లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌ (PML-N) పార్టీ తమ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బిలావల్‌ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP) జరుపుతున్న చర్చల్లో పురోగతి సాధించింది.

పీపీపీ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ, అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీతో తమ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ ఆదివారం జరిపిన చర్చల్లో చాలా అంశాలపై సఖ్యత కుదిరినట్లు పీఎంఎల్‌-ఎన్‌ ప్రకటించింది. రాజకీయ అనిశ్చితి నుంచి దేశాన్ని రక్షించేందుకు ఇరు పార్టీల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని పేర్కొంది. త్వరలో జరగబోయే సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో పీపీపీ నాయకత్వం వారి ప్రతిపాదనలను తమ ముందు ఉంచుతుందని తెలిపింది.

యావత్‌ పాకిస్థాన్​ పరిస్థితిని సమీక్షించి, ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించాలని నిర్ణయించినట్లు పేర్కొంది పీఎంఎల్-ఎన్ పార్టీ. భవిష్యత్‌లో రాజకీయ సహకారంపైన కూడా పూర్తి వివరంగా చర్చించినట్లు వెల్లడించింది. ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు తమ పక్షానే నిలిచారని మరోసారి ప్రకటించింది. పీఎంఎల్‌-ఎన్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించినట్లు పీపీపీ కూడా ధ్రువీకరించింది.

ఆదివారం పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఫలితాల ప్రకారం, 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్‌-ఎన్‌కు 75 స్థానాలు దక్కాయి. ఇమ్రాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (PTI) పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాలు సాధించారు. అయితే పీఎంఎల్‌-ఎన్‌ అధికారంలోకి రావాలంటే 54 సీట్లలో విజయం సాధించిన పీపీపీ మద్దతు తప్పనిసరి.

పీఎంఎల్-ఎన్, పీపీపీ పార్టీలు కలిస్తే మొత్తం 129 సీట్లు అవుతాయి. 17 సీట్లు నెగ్గిన ఎంక్యూఎం-పీతోనూ నవాజ్‌ షరీఫ్‌ చర్చలు జరుపుతున్నారు. దేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు మొత్తం 133 సీట్లు అవసరం. ఈ మూడు పార్టీలు కలిస్తే అధికారం సొంతమవుతుంది. కానీ ఈ పొత్తుకు ఇంకా ఎంక్యూఎం-పీ పచ్చజెండా ఊపలేదు. మరి పాకిస్థాన్​లో​ కొత్త ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారో ఇంకా సస్పెన్సే!

'మేము ఎన్నికల్లో 170 స్థానాల్లో గెలిచాం'- కోర్టులో పిటిషన్లు వేసిన ఇమ్రాన్ అభ్యర్థులు

సంకీర్ణ ప్రభుత్వానికి జై కొట్టిన సైన్యం- స్వతంత్రుల మద్దతు నవాజ్​కే! ఇంకా తేలని పాక్​ ఫలితం

Last Updated : Feb 12, 2024, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details