తెలంగాణ

telangana

వాష్​రూమ్​లోకి ఫోన్​ పట్టుకెళ్తున్నవా? - ఒక్కసారి ఆగు - ఈ డాక్టర్ సాబ్​ ఏం చెబుతున్నారో విను! - Using Smartphone in Toilets

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 11:02 AM IST

Using Smartphone in Toilets : టాయిలెట్​ సీటు మీద కూర్చొని న్యూస్ పేపర్ పట్టుకోనిదే వాష్​ రూమ్​ పని పూర్తికాదు అనే వాళ్లు నిన్నటి తరం. నేటితరం కూడా అదే అంటోంది. కాకపోతే చేతిలో పేపర్​ బదులు.. మొబైల్ ఉండాలంటోంది! కానీ.. ఇలా రెస్ట్​ రూమ్​లోకి ఫోన్​ పట్టుకెళ్తే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Smartphone
Using Smartphone in Toilets

Are You Using Smartphone in Toilets? :నేటి యువతకుపొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే దాకా చేతిలో స్మార్ట్​ఫోన్ ఉండాల్సిందే. ఇది పక్కన లేకపోతే నిమిషం కూడా ఉండలేనట్టుగా ప్రవర్తిస్తుంటారు కొందరు. అందుకే.. వాష్​రూమ్​కు సైతం మొబైల్ తీసుకొనిపోతారు. మీకు కూడా అలాంటి అలవాటు ఉందా? అయితే.. మీ చేతులా కొన్ని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నట్టే అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రతి వాష్​రూమ్​లోనూ ప్రమాదకరమైన బ్యాక్టీరియా, జెర్మ్స్ వంటివి ఉంటాయి. అదే మీరు టాయిలెట్​లో మొబైల్ ఫోన్ తీసుకెళ్లినప్పుడు అక్కడ ఉన్న సాల్మోనెల్లా, ఇ-కొలి వంటి బ్యాక్టీరియాలు ఫోన్ మీదకు చేరి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఫోన్​కి అతుక్కుపోయిన ఆ బ్యాక్టీరియా కారణంగా కడుపు నొప్పి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(యూటీఐ) వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు.

పైల్స్, మలబద్ధకం : మీరు టాయిలెట్​కి వెళ్లేటప్పుడు ఫోన్ వాడడం వల్ల దానిపై చేరే బ్యాక్టీరియా చేతులకు అంటుకొని అది కడుపులోకి చేరడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. ఇది మిమ్మల్ని మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కొనేలా చేస్తుందని నిపుణులంటున్నారు. అంతేకాదు.. మీరు వాష్​రూమ్​లో ఎక్కువసేపు ఫోన్​ని ఉపయోగించడం వల్ల మీ విసర్జన అవయవాలపై అదనపు ఒత్తిడి పడుతుందట. ఇది పైల్స్, ఫిషర్స్ వచ్చే అవకాశాలను పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2016లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. టాయిలెట్‌లో ఫోన్ ఎక్కువగా వాడే వ్యక్తులకు పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్​లోని మౌంటి సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్​కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అలెన్ బెర్మాన్ పాల్గొన్నారు. టాయిలెట్​లో ఎక్కువ సేపు మొబైల్ వాడడం వల్ల పైల్స్, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

స్మార్ట్​ఫోన్​కు బానిసలుగా మారారా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి!

అతిసారం, ఉబ్బరం సంబంధిత సమస్యలు : టాయిలెట్​కి వెళ్లేటప్పుడు చాలా మంది అక్కడి పరిశుభ్రతను అంతగా పట్టించుకోరు. పైగా వాష్​రూమ్​లో మొబైల్ యూజ్ చేశాక హ్యాండ్స్ వాష్ చేసుకోవడం మర్చిపోతుంటారు. ఇక కొందరైతే ఆ ఆలోచన లేకుండానే ఫుడ్ తీసుకుంటుంటారు. ఒకవేళ హ్యాండ్స్ వాష్ చేసుకున్నా మొబైల్ మీద జెర్మ్స్ అలాగే ఉండిపోతాయి కాబట్టి.. చేతులు శుభ్రం చేసుకున్నా ఉపయోగం లేదంటున్నారు. మొత్తం మీద మీరు తినే ఫుడ్​తో పాటు ఆ బ్యాక్టీరియా కడుపులోనికి వెళుతుందంటున్నారు నిపుణులు. ఫలితంగా అతిసారం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు దారి తీస్తుందంటున్నారు.

చూశారుగా.. వాష్​రూమ్​లో ఫోన్ వాడడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో! కాబట్టి, మీకు అలాంటి అలవాటు మానుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ స్మార్ట్​ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? ఈ సింపుల్ టిప్స్​తో అంతా సెట్!

ABOUT THE AUTHOR

...view details