తెలంగాణ

telangana

కోడిగుడ్లతో ఇన్ని ప్రయోజనాలా? ఒక ఎగ్ ఉత్పత్తికి ఎంత టైమ్ పడుతుందో తెలుసా? - FACTS ABOUT EGGS

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 7:13 AM IST

Facts About Eggs : కోడిగుడ్డు అంటే ఇష్టపడని వారు ఉంటారా! కానీ దాని గురించి మీకు అన్ని విషయాలు తెలుసా? గుడ్లు గురించి తెలియని ఆసక్తికర విషయాలు మీకోసం.

Facts About Eggs
Facts About Eggs

Facts About Eggs :గుడ్డు ప్రొటీన్లకు మూలం అని అంటారు. చాలా మంది వీటిని చాలా ఇష్టంగా తింటారు. రోజూ క్రమం తప్పకుండా గుడ్డును తినే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అంతకుమించి తినే వాళ్లు కూడా ఉన్నారనుకోండి అది పక్కన పెడితే గుడ్డు గురించి మీకు ఏం తెలుసు అంటే గుడ్డు కోడి నుంచి వస్తుంది. దీన్ని ఉడికించుకుని, ఆమ్లెట్ వేసుకుని లేదా కర్రీ చేసుకుని, రకరకాలుగా తినచ్చు అని చెప్పగలం. ఇది తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉండచ్చని, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ తినగలిగే ఆహార పదార్థం గుడ్డు అని కూడా చెప్పగలం. చాలా మంది ఫిట్ నెస్ ప్రియులకు గుడ్డు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసు. ఇవే కాకుండా గుడ్డు గురించి తెలుసుకోవాల్సినవీ, మీకు తెలియనివీ చాలా విషయాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  1. ఒక కోడి ఏడాదికి 300 నుంచి 325 గుడ్లు పెడుతుంది. ఒక గుడ్డును ఉత్పత్తి చేయడానికి కోడికి 24 నుంచి 26 గంటల సమయం పడుతుందట.
  2. గుడ్డు పెంకులను సహజమైన ఎరువుగా ఉపయోగించవచ్చు. మొక్కలు చక్కగా పెరిగేందుకు మట్టికి అవసరమయే కాల్షియం లాంటి ఖనిజాలు గుడ్డు పెంకుల్లో చాలా ఉంటాయి
  3. గది ఉష్ణోగ్రతలో ఉంచితే ఒకటి రెండు రోజుల్లో పాడయ్యే గుడ్లు రిఫ్రిజిరేటర్​లో ఉంచితే కనీసం వారం రోజుల పాటైనా పాడవకుండా ఉంటాయి.
  4. కుక్కలు, పక్షులు వంటి పెంపుడు జంతువులకు పెట్టే ఆహారాల తయారీలో గుడ్డు పెంకులను ఉపయోగిస్తారట. కాల్షియంకు సప్లిమెంట్​గా వీటిని వాడతారట.
  5. చాలా మందికి గుడ్డు ఉడికిందా లేదా అనే విషయంలో సందేహం ఎప్పుడూ కలుగుతుంది. మిగిలిన ఆహార పదార్థాలన్నీ మెత్తగా మారడాన్ని చూసి ఉడికాయని గుర్తిస్తాం. కానీ గుడ్డు విషయంలో అలా కాదు కదా. గుడ్డు పెంకు గట్టిగానే ఉంటుంది కనుక లోపల ఉడికిందా లేదా కనిపెట్టడం కష్టమే. ఇందుకు ఓ చిట్కా ఏంటంటే, ఉడికించిన గుడ్డును తీసుకుని నున్నగా ఉన్న చోటులో గుండ్రంగా తిప్పండి. ఉడికిన గుడ్డు గిరగిరా తిరుగుతుంది, పచ్చిగుడ్డు అలాగే ఉండిపోతుంది.
  6. గుడ్డును శుభ్రం చేయడానికి దాని మీద ఉప్పు చల్లి, కాసేపటికి దాన్ని టిష్యూతో తుడవడం లేదా నీటితో కడగడం చేయాలి.
  7. గుడ్డు పెంకు సాధారణంగా 0.3 మిల్లీమీటర్లు మందంగా ఉంటుంది. అలాగే ఇది 7000 నుంచి 17000 వరకు చిన్న రంథ్రాలను కలిగి ఉంటుంది. ఆ రంథ్రాలు ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, తేమను కలిగి ఉంటాయి. కనుక బ్యాక్టీరియాకు దూరంగా ఉంటాయి.
  8. కోడిగుడ్డు ఆకారం, పరిమాణం అనేది కోడి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుందట. అయితే దీని వల్ల గుడ్డు పెంకు, లోపలి సొన రంగులు మారచ్చు కానీ వాటి ఆకారం, రుచిలో ఎలాంటి నాణ్యత లోపాలు ఉండవట.
  9. గుడ్లలో ఉండే లుటీన్ వంటి పోషకాలు కంటిశుక్లం, కంటి కండరాల క్షీణతను నివారించి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయట. వీటిలోని అమైనో ఆమ్లాలు దృష్టిని మెరుగుపరుస్తాయి.
  10. చాలా మంది గుడ్డులోని తెలుపు భాగాన్ని తిని, లోపల ఉండే పచ్చ సొనను పడేస్తుంటారు. కానీ దీంట్లో శరీరానికి చాలా అవసరమైన విటమిన్-డీ పుష్కలంగా ఉంటుందట. గుడ్డు సొన తినడం వల్ల ఎముకలు, పళ్లు, గోళ్లు చాలా బలంగా తయారవుతాయట.
  11. తెల్లగా ఉండే కోడిగుడ్ల కన్నా గోధుమరంగు పెంకులు కలిగిన గుడ్డు (నాటు కోడి గుడ్డు) ధర ఎక్కువ ఉంటాయి. ఎందుకని మీకు తెలుసా? గోధుమ రంగు గుడ్డను పెట్టే కోడి తినే ఆహారం, అది పెరిగే వాతావరణం, దాని పెంపకం వేరుగా ఉంటాయట. తెలుపు రంగు పెంకులు ఉన్న గుడ్డు పెట్టే కోళ్లతో పోలిస్తే ఇవి ఎక్కువ ఆహారాన్ని తింటాయట.

ABOUT THE AUTHOR

...view details