తెలంగాణ

telangana

సిక్స్ డేంజర్ డిజిట్స్- OTP విషయంలో ఈ జాగ్రత్తలు మస్ట్ - safety tips for otp detection

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 7:43 AM IST

Safety Tips For OTP Detection : కేవలం ఒక్క క్లిక్‌తో నచ్చినవన్నీ కొంటున్నాం. బ్యాంకింగ్‌ లావాదేవీలన్నీ చక్కబెట్టేస్తున్నాం. అయితే వీటన్నింటికీ 6 అంకెల ఓటీపీ (వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌) అవసరం పడుతుంది. మరి వీటి ద్వారా ఇంత సౌలభ్యాన్ని పొందుతున్న మనకు కొన్ని ప్రమాదాల కూడా పొంచి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Safety Tips For OTP Detection
Safety Tips For OTP Detection

Safety Tips For OTP Detection :సైబర్‌ మోసగాళ్లు మన వ్యక్తిగత సమాచారాన్ని అపహరించి మోసం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. బ్యాంకులు, ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు, కొరియర్‌ సంస్థల పేర్ల సాయంతో ఓటీపీలను చెప్పాలని అడుగుతూ మన ఖాతాల్లోని డబ్బును కాజేస్తుంటారు. ప్రస్తుత తరుణంలో ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవలి కాలంలో కొరియర్‌ డెలివరీల పేరు చెప్పి, ఆర్థికంగా మనల్ని మోసం చేస్తున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. మరి వీటిపట్ల అలర్ట్​గా ఉండేందుకు ఈ కింది టిప్స్​ను ఫాలో అవ్వండి.

  • ఒక ఫోన్‌కాల్‌ లేదా మెసేజ్​ వచ్చి, ఆర్థిక విషయాల గురించి అవతలి నుంచి సంభాషణ జరుగుతుంటే ఒక్కసారి ఆలోచించాలి.
  • బ్యాంకులు, బీమా సంస్థలు, ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు, ఇతర ఆర్థిక సంస్థలు ఏవైనా సరే మీనుంచి ఓటీపీని ఎప్పుడూ అడగవు.
  • కొరియర్‌లో వచ్చిన వస్తువులను మనకు ఇచ్చేటప్పుడు వచ్చిన వ్యక్తి ఓటీపీని పంపించాం, చెప్పండి అని అడుగుతారు. అంతేకానీ, ఫోన్‌లోనే ఓటీపీలను అడగరు అని గుర్తుంచుకోండి.

మీకు ఏదైనా ఓటీపీ వచ్చిన వెంటనే మీకు రావాల్సిన సందేహాలివే!

ఈ అంశాలను చెక్​ చేయండి
ఓటీపీకి సంబంధించిన లావాదేవీని స్వయంగా మీరే నిర్వహించారా? ఓటీపీ విశ్వసనీయ సంస్థ నుంచే వచ్చిందా? మెసేజ్​లో ఏదైనా ఒత్తిడి, అత్యవసరం అని కనిపిస్తోందా? అనే అంశాలను చూసుకోండి.

భాషను పరిశీలించండి
ఆయా ఫోన్‌కాల్‌ లేదా మెసేజ్​లో వాడిన భాషను నిశితంగా పరిశీలించండి. మీరు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండానే ఓటీపీ వచ్చిందంటే అది కచ్చితంగా మోసపూరితమేనని గుర్తుంచుకోండి.

ఆ సమయంలో స్పందించకండి
బ్యాంకు, బీమా సంస్థల నుంచి ఫోన్‌ చేసి ఇ-కేవైసీ కోసం మీ వ్యక్తిగత వివరాలు కావాలి అని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకండి. మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోమని తెలియజేయండి.

అఫీషియల్​ వాటిని సంప్రదిస్తే మేలు
సంబంధిత సంస్థకు చెందిన అధికారిక వెబ్‌సైట్లు, వినియోగదారుల సేవా కేంద్రాలను సంప్రదించి అవసరమైన సేవలను పొందడం ఉత్తమం.

పొరపాటున క్లిక్​ చేస్తే అంతే
అధిక రాబడులు ఇస్తామంటూ వచ్చే మెసేజ్​లు, బ్యాంకు నుంచి పంపించే హెచ్చరికలు, తక్కువ వడ్డీకే లోన్స్​ అంటూ ప్రకటనలు- ఇలా పలురకాల సందేశాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. వీటిల్లో వెబ్‌సైట్‌ లింకులు కూడా ఉంటాయి. అత్యాశకు పోయి లేదా పొరపాటున వీటిని క్లిక్‌ చేసామంటే అంతే సంగతులు. తెలియని లింకులపై క్లిక్‌ చేస్తే మాల్వేర్‌, ఫిషింగ్‌ దాడులు వంటి సైబర్​ దాడులు మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి.

తరచూ బ్యాంక్​ స్టేట్​మెంట్స్​ను చెక్​ చేయండి
మీ బ్యాంకు ఖాతా విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తత పాటించాలి. బ్యాంకు స్టేట్‌మెంట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తుండాలి. ఏదైనా అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే మాత్రం వెంటనే దాని గురించి సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి.

చివరగా ఓటీపీ స్కాముల విషయంలో అప్రమత్తంగా ఉండటం ఒక్కటే మంత్రం. అనుమానాస్పదంగా అనిపించినప్పుడు కాస్త ఆగి, పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే లావాదేవీలను కొనసాగించడం ఉత్తమైన మార్గం.

గమనిక :ఓటీపీని ఎవరికీ చెప్పవద్దు అంటూ బ్యాంకులు, ఆర్థిక సంస్థలూ ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు చెబుతూనే ఉంటాయి. ఈ సూచనలు పాటించాలి.

అప్పులు త్వరగా తీర్చేసేందుకు సూపర్ మార్గం ఇది! - how to clear loans fast

జియో సరికొత్త ప్లాన్​ - అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీ! - Jio 857 Prepaid Plan

ABOUT THE AUTHOR

...view details