తెలంగాణ

telangana

ఎన్నికల వేళ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? ప్రభుత్వం లెక్క ఇదీ!

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 2:19 PM IST

Petrol And Diesel Prices : ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్ డీజిల్​పై రూ.3 వరకు నష్టపోతున్నాయి. మరోవైపు పెట్రోల్​పై వచ్చే లాభాలు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో మోదీ సర్కార్​ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తుందా? లేదా?

diesel price
petrol prices

Petrol And Diesel Prices :భారతదేశంలోని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అన్నీ లీటర్​ డీజిల్​పై సుమారుగా రూ.3 వరకు నష్టపోతున్నాయి. పెట్రోల్​పై వచ్చే లాభాలు కూడా గత రెండేళ్లుగా బాగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు ఒడుదొడుకుల్లో కొనసాగుతుండడమే ఇందుకు కారణం. అయినప్పటికీ గత రెండేళ్లుగా దేశీయ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా, స్థిరంగా ఉంచుతున్నాయి. త్వరలో లోక్​సభ ఎన్నికలు జరగనున్నాయి. మరి ఈ సమయంలో మోదీ సర్కార్​ ప్రజలను ఆకట్టుకునేందుకు పెట్రోల్, డీజిల్​ ధరలు తగ్గిస్తుందా? లేదా ఎప్పటిలానే స్థిరంగా ఉంచుతుందా? చమురు పరిశ్రమకు చెందిన అధికారులు ఏం చెబుతున్నారు?

90 శాతం వాటి చేతుల్లోనే
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్​ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్​ (HPCL) చేతుల్లోనే 90 శాతం ఇండియన్ ఫ్యూయెల్ మార్కెట్ ఉంది. ఇవి స్వచ్ఛందంగా గత రెండేళ్లుగా పెట్రోల్, డీజిల్​, వంట గ్యాస్​ (ఎల్​పీజీ) ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీని వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేస్తే, కంపెనీలకు లాభాలు వస్తున్నాయి. ఒక వేళ అధిక ధరకు రా-మెటీరియల్ కొనుగోలు చేస్తే, కంపెనీలకు నష్టాలు వస్తున్నాయి.

దిగుమతులే ఆధారం
భారతదేశం తన అవసరాల కోసం దాదాపు 85 శాతం వరకు విదేశీ ముడిచమురు దిగుమతులపైనే ఆధారపడుతోంది. గతేడాది చివరిలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, ఈ జనవరి ద్వితీయార్థం నుంచి మళ్లీ వాటి రేట్లు పెరుగుతున్నాయి.

రోజువారీగా రేట్లు పెంపు!
గతంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరించేవి. కానీ ఇప్పుడు ఆలా చేయడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు చాలా అస్థిరంగా ఉండడమే. ఒక రోజు ముడి చమురు ధరలు భారీగా తగ్గితే, మరో రోజు వాటి ధరలు భారీగా పడిపోతున్నాయి. దీనితో కంపెనీలు ధరలు నిర్ణయించడం చాలా కష్టమైపోతోంది. 'ప్రస్తుతం చమురు కంపెనీలు లీటర్​ డీజిల్​పై రూ.3 వరకు నష్టపోతున్నాయి. పెట్రోల్​పై వచ్చే లాభాలు లీటర్​కు కేవలం రూ.3- రూ.4లకు తగ్గిపోయాయి' అని ఓ ఇండస్ట్రీ అఫీషియల్​ చెప్పారు.

చమురు ధరల నిర్ణయంలో ప్రభుత్వ జోక్యం!
చమురు ధరల నిర్ణయంలో కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోదని ఇండియా ఎనర్జీ వీక్​లో పాల్గొన్న కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్​ సింగ్ పురి తెలిపారు. చమురు కంపెనీలే ధరలు పెంచడం లేదా తగ్గించడం గురించి నిర్ణయాలు తీసుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం మార్కెట్ కాస్త ఒడుదొడుకుల్లో ఉంది కనుక పెట్రోల్, డీజిల్​ ధరలు తగ్గించే అవకాశం ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

రూ.69 వేల కోట్ల లాభం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 9 నెలల్లో మూడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కలిసి రూ.69,000 కోట్ల లాభాలను సంపాదించాయి. దీని గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి, నాల్గో త్రైమాసికంలో కూడా ఇలానే లాభాలు వస్తే, అప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు సవరించాలా? లేదా? అనేది ఆలోచిస్తామని అన్నారు.

నష్టాల నుంచి లాభాల్లోకి
గతేడాది చమురు సంక్షోభం వచ్చినప్పుడు ఐవోసీ, బీపీసీఎల్​, హెచ్​పీసీఎల్​ కంపెనీల మొత్తం లాభాలు రూ.39,356 కోట్లుగా ఉన్నాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఇవి ఏకంగా రూ.69,000 కోట్ల మేరకు లాభాలను సంపాదించాయి.

వాస్తవానికి 2022 ఏప్రిల్​-సెప్టెంబర్​ల్లో ఈ మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు కలిసి ఏకంగా రూ.21,201 కోట్ల నికర నష్టాలను చవిచూశాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, తాము ప్రకటించిన రూ.22 వేల కోట్ల ఎల్​పీజీ సబ్సిడీని రెండేళ్లపాటు ఇవ్వలేదు. దీనితో ఈ మూడు సంస్థలు తీవ్రమైన నష్టాలను భరించాల్సి వచ్చింది. కానీ తరువాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు అందించడం వల్ల కాస్త కోలుకున్నాయి. దీనితో ఐవోసీ, బీపీసీఎల్​ సంస్థలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్వల్ప లాభాలను నమోదు చేయగా, హెచ్​పీసీఎల్​ నష్టాల్లోనే కొనసాగింది.

కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాటకీయరీతిలో పరిస్థితులు అన్నీ మారిపోయాయి. మూడు ప్రభుత్వ రంగ సంస్థలు మొదటి రెండు త్రైమాసికాల్లో భారీ లాభాలను నమోదు చేశాయి. ముఖ్యంగా గతేడాది అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 72 డాలర్లకు పడిపోయింది. దీనితో కంపెనీలు అన్నీ భారీగా లాభపడ్డాయి. కానీ తరువాత బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర మరలా 90 డాలర్ల వరకు పెరిగింది. దీనితో కంపెనీల ఆదాయం కాస్త తగ్గింది.

వాస్తవానికి 2022 ఏప్రిల్ 6 నుంచి దేశంలో చమురు ధరలు స్థిరంగా ఉంచడం ప్రారంభమైంది. దీనితో 2022 జూన్ 4 వరకు చమురు సంస్థలు లీటర్​ పెట్రోల్​పై ఏకంగా రూ.17.4; లీటర్​ డీజిల్​పై రూ.27.7 వరకు నష్టపోవాల్సి వచ్చింది. ఆ తరువాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడం వల్ల నష్టాలు కాస్త తగ్గాయి. గతనెలలో చమరు సంస్థలు లీటర్​ పెట్రల్​పై రూ.11; లీటర్ డీజిల్​పై రూ.6 వరకు లాభపడ్డాయి.

ఎప్పుడు ఎలా ఉంటుందో?
2020లో కరోనా సంక్షోభం వచ్చినప్పుడు చమురు కంపెనీలు విపరీతంగా నష్టపోయాయి. రష్యా 2022 మార్చిలో ఉక్రెయిన్​పై దాడి చేయడం వల్ల బ్యారెల్ ముడి చమురు ధర 140 డాలర్లకు పెరిగిపోయింది. భారతదేశం తన అవసరాల కోసం 85 శాతం వరకు ముడిచమురు దిగుమతులపైనే ఆధారపడుతోంది. కనుక అంతర్జాతీయ అంశాలు కూడా మన దేశంలోని చమురు ధరలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

ఎన్నికల వేళ
2021 నవంబర్ నాటికి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్​-టైమ్ హైకు చేరుకున్నాయి. దీనితో రోజువారీ చమురు ధరల సవరణను నిలిపివేశారు. తరువాత కరోనా సమయంలో పెంచిన ఎక్సైజ్ డ్యూటీని కూడా తగ్గించారు. దీనితో చమురు ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీనితో చమురు సంస్థలు 2022 నుంచి నేటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచాయి. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కనుక మోదీ సర్కార్​ ప్రజలను ఆకర్షించేందుకు పెట్రోల్, డీజిల్​, వంట గ్యాస్ ధరలు తగ్గిస్తుందో, లేదో చూడాలి.

ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా ? ఈ 5 తప్పులు చేయకండి!

మొదటిసారిగా కారు కొన్నారా? ఈ టాప్​-10 బేసిక్​ మెయింటెనెన్స్ టిప్స్​ మీ కోసమే!

ABOUT THE AUTHOR

...view details