తెలంగాణ

telangana

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ బెనిఫిట్ల గురించి తెలుసా?

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 3:27 PM IST

Health Insurance Policy Benefits : మారుతున్న మనుషుల జీవనశైలితో తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవతున్నాయి. దీంతో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. దీన్ని తట్టుకోవాలంటే ఆర్థికంగా ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. వైద్య ఖర్చులను తట్టుకునేలా ఆరోగ్య బీమా పాలసీ ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది. పాలసీలు తీసుకునే విషయాంలో చాలా మంది అపోహలు ఉంటాయి. అసలు బీమా ప్రయోజనాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం.

Health Insurance Policy Benefits
Health Insurance Policy Benefits

Health Insurance Policy Benefits : ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కుటుంబంలో ఒక్కరు అనారోగ్యం పాలైనా ఆర్థిక లక్ష్యాలన్నీ తారుమారైపోతున్నాయి. ఈ తరుణంలోనే ఆరోగ్య బీమా తప్పనిసరి అవసరంగా మారింది. ఇది వైద్య అవసరాలకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న వైద్య ఖర్చులు అందరీ ఆందోళనలు కలిగిస్తున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం చూస్తే వైద్య ద్రవ్యోల్బణం ఏటా 20 శాతం వరకూ ఉంటోంది. వైద్య ఖర్చులు కూడా అలానే పెరిగుతున్నాయి. మంచి ఆరోగ్య బీమా పాలసీ ఉన్నప్పుడే ఏదైనా వచ్చినప్పుడు ఆర్థికంగా మనపై ఒత్తిడి ఉండదు.

ఆరోగ్యంగా ఉన్నప్పుడే పాలసీ తీసుకోవాలి
చాలామందికి నేను ఆరోగ్యంగా ఉన్నాను కాదా పాలసీ అవసరమా అని అనుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ పాలసీని కొనుగోలు చేసేందుకు అనువైన సమయం. చిన్న వయసులోనే ఆరోగ్య బీమాలను తీసుకోవడం వల్ల ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పుడు తీసుకోవటం వల్ల సులభంగా పాలసీ లభిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు పాలసీ తీసుకోవాలంటే అధిక ప్రీమియం ఉంటుంది. పైగా ముందస్తు వ్యాధులకు వేచి ఉండే సమయం నిబంధన వర్తిస్తుంది. ఆరోగ్య బీమా పాలసీ అంటే కేవలం వ్యాధులు వచ్చినప్పుడే ఉపయోగపడేది కాదు ప్రమాదాలు జరిగినప్పుడు వర్తిస్తుంది. అనుకోని ప్రమాదం వల్ల ఆసుపత్రిలో చేరినప్పుడూ ఆరోగ్య బీమా చికిత్స ఖర్చులను చెల్లిస్తుంది. ఆరోగ్య బీమ పాలసీ తీసుకోవడాన్ని వాయిదా వేయకుండాఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది.

తక్కువ ప్రీమియం పాలసీలు తీసుకోవాలా
ఆరోగ్య బీమా పాలసీల విషయంలో ప్రీమియం కాస్త అధికంగా ఉండటం చాలామంది వెనకడుగు వేస్తుంటారు. ఏటా ప్రీమియం చెల్లించటం కష్టం అవుతుందని అనుకుంటారు. అయితే తక్కువ ప్రీమియంతో అధిక రక్షణ ఇచ్చే టర్మ్‌ పాలసీలను తీసుకోవచ్చు. కానీ, ఆరోగ్య బీమా పాలసీలను విషయంలో కేవలం ప్రీమియం ఒక్కటే ఆలోచించి తీసుకోవడం మంచిదికాదు. ఏ రెండు సంస్థల పాలసీలూ, లేదా ఒక సంస్థ అందించే రెండు పాలసీలూ ఒకే విధంగా రక్షణ కల్పించవు. అందుకే పాలసీల విషయంలో అవసరం ఏమిటి? నిబంధనలు ఎలా ఉన్నాయి? ఆసుపత్రిలో చేరినప్పుడు నగదు రహిత చికిత్స, మినహాయింపులు, ఉప పరిమితులు, అదనపు ప్రయోజనాల్లాంటివి చూసుకొని ఎంచుకోవాలి. కాస్త అధిక ప్రీమియం ఉన్నా కొన్నిసార్లు తప్పదు.

సొంత బీమా తీసుకుంటే మంచింది
ఉద్యోగుల ప్రయోజనం కోసం యాజమాన్యాలు బృంద ఆరోగ్య బీమా పాలసీని అందిస్తాయి. నిజానికి ఇది చాలా మంచి పాలసీ. ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా ఇందులో రక్షణ లభిస్తుంది. కొన్ని పరిమితులు ఉంటాయి. కాకపోతే ఉద్యోగంలో ఉన్న రోజులు వరకే ఈ బీమా రక్షణ ఉంటుంది. ఉద్యోగం మానేసినా, పదవీ విరమణ చేసినా ఈ బీమా వర్తించదు. కొన్నిసార్లు ఈ పాలసీలను వ్యక్తిగత పాలసీలుగా మార్చుకునే సదుపాయం ఉంటుంది. ఇది బీమా సంస్థలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఉద్యోగంలో ఉన్నప్పుడు అదనపు రక్షణగా సొంతంగా ఒక ఆరోగ్య బీమాను తీసుకోవాలి. కనీసం రూ.5 లక్షల విలువైన ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ ఉండేలా చూసుకోవాలి.

మొదటి రోజు నుంచే పాలసీ అమలయ్యే సందర్భాలు
ప్రమాదం లాంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే చెల్లుతుంది. కొత్తగా పాలసీ తీసుకున్నప్పుడు కనీసం 30 రోజుల పాటు వేచి ఉండే వ్యవధి ఉంటుంది. ముందస్తు వ్యాధులు ఉన్నప్పుడు తీసుకుంటే ఇది 36-48 నెలలపాటు ఉండొచ్చు. నాలుగేళ్లు ముగిసిన తర్వాత నుంచి ఎలాంటి నిబంధనలు ఉండకపోవచ్చు.

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ
తీవ్ర వ్యాధులు సోకినప్పుడు పరిహారం ఇచ్చేది క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ. గుండెపోటు, క్యాన్సర్‌, మూత్రపిండాల వ్యాధుల్లాంటి 8-20 తీవ్ర వ్యాధుల్లో ఏదైనా వచ్చిందని తేలితే నిర్ణీత పరిహారం చెల్లిస్తుంది. కొన్నిరకాల శస్త్ర చికిత్సలకూ ఇది వర్తిస్తుంది. అయితే పాలసీ తీసుకున్న 90 రోజుల వరకూ జీవించి ఉన్నప్పుడే పరిహారం అందిస్తాయి. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలతో పోలిస్తే ఇవి ప్రత్యేకమే. ఆసుపత్రిలో చేరినప్పుడు చికిత్స ఖర్చులను చెల్లించే ఆరోగ్య బీమా పాలసీకి తోడుగా మాత్రమే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ ఉండాలి.

ABOUT THE AUTHOR

...view details