తెలంగాణ

telangana

'7 ఏళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​' - క్రిసిల్‌

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 11:54 AM IST

CRISIL Ratings 2024 : వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదు కావచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. మరో ఏడేళ్లలో భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది.

S&P Global Ratings
crisil ratings 2024

CRISIL Ratings 2024 :భారత వృద్ధి రేటువచ్చే ఆర్థిక సంవత్సరం(2024-25)లో 6.8 శాతంగా నమోదు కావచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. 2031 నాటికి ఆర్థిక వ్యవస్థ రెట్టింపు అయ్యి 7 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని తెలిపింది. ఫలితంగా భారత్​ ఎగువ-మధ్య ఆదాయ దేశంగా అవతరిస్తుందని తెలిపింది. 'ఇండియా అవుట్‌లుక్‌ రిపోర్ట్‌' పేరుతో విడుదల చేసిన నివేదికలో, రానున్న ఏడేళ్లలో ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది.

అంచనాలకు మించి!
భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో అంచనాలకు మించి రాణించి 7.6 శాతం వృద్ధి రేటు నమోదు చేసిందని క్రిసిల్​ తెలిపింది. 2025-2031 మధ్య కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 7 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని క్రిసిల్ అంచనా వేసింది. ఈ కాలంలో సగటున 6.7 శాతం చొప్పున వృద్ధి నమోదైనా, ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని వెల్లడించింది.

  • భారతదేశం ప్రస్తుతం 3.6 లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇండియా కంటే ముందు యూఎస్​, చైనా, జపాన్‌, జర్మనీలు ఉన్నాయి.
  • క్రిసిల్ అంచనాల ప్రకారం, 2031 నాటికి భారతదేశం ఎగువ-మధ్య ఆదాయ దేశాల సరసన నిలుస్తుంది. దేశ తలసరి ఆదాయం కూడా 4,500 డాలర్లకు చేరుతుంది.
  • ప్రపంచ బ్యాంక్‌ లెక్కల ప్రకారం, ఒక దేశ తలసరి ఆదాయం 1,000 - 4,000 డాలర్ల మధ్య ఉంటే, దానిని దిగువ-మధ్య ఆదాయ దేశంగా గుర్తిస్తారు. 4,000-12,000 డాలర్ల మధ్య తలసరి ఆదాయం ఉంటే, అలాంటి వాటిని ఎగువ-మధ్య ఆదాయ దేశాలుగా పరిగణిస్తారు.
  • భారత ప్రభుత్వ చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు, అంతర్జాతీయ పోటీతత్వం, వాల్యూ చైన్‌ పెరగడం లాంటివి దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయని క్రిసిల్‌ ఎండీ, సీఈఓ అమీష్‌ మెహతా అభిప్రాయపడ్డారు.

2031 నాటికి దేశ జీడీపీలో తయారీ రంగం వాటా 20% ఉండవచ్చని అమీష్ మెహతా అంచనా వేశారు. 2025-31 ఆర్థిక సంవత్సరాల మధ్య తయారీ, సేవల రంగాలు వరుసగా 9.1%, 6.9% మేర పెరగవచ్చని క్రిసిల్‌ ముఖ్య ఆర్థికవేత్త ధర్మకృతి జోషి తెలిపారు.

S&P Global Ratings :వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) చివరి నాటికి ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను 100 బేసిస్‌ పాయింట్ల(1%) మేర తగ్గించే అవకాశం ఉందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌(ఆసియా- పసిఫిక్‌) సీనియర్‌ ఆర్థికవేత్త​​ విసృత్‌ రాణా అంచనా వేశారు. కీలక రేట్లను తగ్గించే విషయంలో ఆర్‌బీఐ చాలా అప్రమత్తతతో వ్యవహరించవచ్చని ఆయన పేర్కొన్నారు. 2024 రెండో అర్ధభాగం నుంచి ఆర్​బీఐ రేట్ల కోతను ప్రారంభించవచ్చని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినప్పటికీ, ఆహార ద్రవ్యోల్బణంలో మాత్రం హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని తెలిపారు. కొన్ని విభాగాల్లో బలహీనంగానే ఉన్నప్పటికీ, ఇండియా వృద్ధికి చాలా సానుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు. గత కొన్ని త్రైమాసికాల్లో దేశీయ వృద్ధి నెమ్మదించినప్పటికీ, మున్ముందు స్థిరత్వం చోటుచేసుకోవచ్చని రాణా వివరించారు. భారత్​లో అధిక రుణ- డిపాజిట్​ నిష్పత్తితో కార్యకలాపాలు నిర్వహించాల్సి వస్తోంది. కనుక ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే, ప్రైవేట్‌ రంగ బ్యాంకులకు సవాళ్లు ఎదురుకావచ్చని రాణా పేర్కొన్నారు.

రియల్ ఎస్టేట్​లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టిప్స్ పాటిస్తే లాభాలు గ్యారెంటీ!

టాటా, మారుతి కార్లపై భారీ ఆఫర్స్​ - ఆ మోడల్​పై ఏకంగా రూ.1.53 లక్షలు డిస్కౌంట్​!

ABOUT THE AUTHOR

...view details