తెలంగాణ

telangana

పోలీసులుగా 'సెవెన్​ సిస్టర్స్'- ఎంతో కష్టపడి చదివి​- ఇప్పుడు మంచి పొజిషన్​లో సెటిలై! - Seven Police Sisters In Bihar

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 5:35 PM IST

Updated : Mar 26, 2024, 6:47 PM IST

Seven Police Sisters In Bihar : ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసు శాఖలకు సంబంధించిన వివిధ భద్రతా విధుల్లో చేరారు. అయితే వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. ఈరోజు వీరంతా ఈ స్థానంలో ఉండటానికి కారణం వీరి శ్రమ ఒకకారణం అయితే, వీరి తండ్రి కష్టం కూడా మరో కారణం. ఈ నేపథ్యంలో ఈ తండ్రీకూతుళ్లకు సంబంధించిన స్ఫూర్తిదాయక కథనం మీకోసం.

Seven Bihar Sisters In Police Forces
Seven Bihar Sisters In Police Forces

Seven Police Sisters In Bihar :ఒకే కుటుంబంలోని ఏడుగురు అక్కాచెల్లెళ్లు బిహార్​ పోలీసు శాఖతో పాటు దేశంలోని వివిధ భద్రతా విధుల్లో ఉద్యోగం సంపాదించారు. దీంతో ఈ 'సెవెన్​ సిస్టర్స్​' పేర్లతో పాటు వారిని ఈ స్థాయికి తీసుకువచ్చిన వీరి తండ్రి పేరు కూడా ప్రస్తుతం మారుమోగుతోంది. వీరంతా బిహార్​లోని ఛప్రా జిల్లా వాసులు. జిల్లాకు చెందిన కమల్​ సింగ్​కు 8మంది కూతుళ్లు, ఒక కుమారుడు. వీరిలో అనారోగ్య కారణంతో ఒక కుమార్తె చిన్నప్పుడే మృతి చెందింది. దీంతో మిగతావారిని ఎంతో కష్టపడి చదవించాడు.

పిండి గిర్నీ నడుపుతూ
కమల్​ సింగ్​కు ఒకరి తర్వాత ఒకరు ఆడపిల్లలే పుడుతూ ఉండడం వల్ల ఆయన్ను అనేక విధాలుగా మాటలతో మానసిక వేదనకు గురిచేశారు ఇరుగుపొరుగువారు. ఒకానొక సమయంలో ఆయన తన పూర్వీకుల సొంత గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో కమల్​ సింగ్​ సరన్​ జిల్లాలోని నాచాప్​ గ్రామంలోని తన ఇంటిని ఖాళీ చేసి చప్రాలోని ఎక్మాకు వచ్చి స్థిరపడ్డాడు. ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూనే తన కూమార్తెల సాయంతో ఇంటి వద్ద ఓ చిన్నపాటి పిండి గిర్నీని నడిపేవారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే ఏడుగురు ఆడపిల్లలను చదివించారు.

తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి 'సెవెన్​ సిస్టర్స్'​లోని ముగ్గురు సోదరీమణులు.

కుమార్తెల పట్టుదల-తండ్రి సహకారం!
అయితే తన ఏడుగురు కుమార్తెలను ఎలా పోషిస్తావు? త్వరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపండని కమల్​ సింగ్​కు ఎంతోమంది సలహాలిచ్చారు. అయినా వాటన్నింటినీ పట్టించుకోకుండా తన కుమార్తెలు ఎక్కడివరకైతే చదవాలనుకున్నారో అక్కడి వరకు చదవించి వారిని ఈరోజు ఈ స్థాయిలో నిలిపారు. ఈయన సహకారానికి తోడు ఈ ఏడుగురు అక్కాచెల్లెళ్లు కూడా ధైర్యం, పట్టుదలతో తాము అనుకున్నది సాధించి చూపించారు.

పోలీస్​ యూనిఫామ్​లో 'సెవెన్​ సిస్టర్స్'​!

నో కోచింగ్​- అక్కలే శిక్షకులు!​
ప్రస్తుతం ఈ ఏడుగురు అక్కాచెల్లెళ్లు బిహార్​ పోలీసు శాఖలో, వివిధ కేంద్ర సాయుధ బలగాలకు ఎంపికై విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఒకరు 2006లోనే సశస్త్ర సీమా బల్-ఎస్​ఎస్​బీలో కానిస్టేబుల్​ పోస్టుకు ఎంపికయ్యారు. దీంతో మిగతా వారందరికీ పోలీసు శాఖలో చేరాలనే ఆశ, ధైర్యం వచ్చింది. ఇక వీరిలో రెండో సోదరి రాణి పెళ్లి తర్వాత 2009లో బీహార్​ పోలీస్​ శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. అలా ఒకరితర్వాత ఒకరు వరుసగా ఇతర ఐదుగురు సోదరీమణులు కూడా ఎక్సైజ్​ శాఖ, సీఆర్​పీఎఫ్, జీఆర్‌పీ సహా వివిధ దళాలకు ఎంపికయ్యారు. అయితే ఉద్యోగానికి ఎంపిక అయ్యేందుకు ముందు కావాల్సిన నైపుణ్యాలు, మెలకువలను వీరంతా తమ అక్కల ద్వారా నేర్చుకున్నారు. గ్రామంలోని ఓ పాఠశాలలో చదివిన వీరు పొలంలోనే ఈవెంట్స్​ ప్రాక్టీస్​ చేసేవారు.

సోదరుడు రాజీవ్ సింగ్​తో అక్కాచెల్లెళ్లు.

తండ్రికి 4 అంతస్తుల బంగ్లా బహుమతి!
ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్న తమ తండ్రికి ఆసరాగా ఉండేందుకు కుమార్తెలందరూ కలిసి ఓ గొప్ప బహుమతి ఇచ్చారు. ఛప్రాలోని ఎక్మా బజార్‌లో ఓ నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించి బహుకరించారు. దీని ద్వారా నెలకు రూ.18-20 వేల అద్దెను పొందుతున్నారు కమల్​ సింగ్​. ఇక ఆర్థికంగా ప్రస్తుతం తనకేమీ ఇబ్బందుల్లేవని అంటున్నారు కమల్​.

ఒక్క మగాడు!
ఇక ఈ 'సెవెన్​ సిస్టర్స్​'కు వన్​ అండ్​ ఓన్లీ బ్రదర్​ ఉన్నాడు. ఇతడి పేరు రాజీవ్ సింగ్​​​. ఇతడిని కొందరు స్నేహితులు, బంధువులు 'నీ ఏడుగురు సోదరిమణులు మీ ఆస్తిని మొత్తం లాగేసుకుంటారు. నీ కోసం ఏమీ వదిలిపెట్టరు' అని అనేవారట. అయితే ఇప్పుడు వారికి సమాధానంగా 'నా అక్కాచెల్లెళ్లు మా నుంచి ఏమీ తీసుకుపోలేదు కదా, నా కోసం ఇంకా చాలానే చేసి పెట్టారు. నేను సెవెన్​ సింగ్​ సిస్టర్స్​ సోదరుడిని అయినందుకు గర్వంగా ఉంది' అని దీటైన బదులిస్తున్నాడు రాజీవ్​. మరోవైపు 'వీరి చిన్నప్పుడు చాలా కష్టపడ్డాం. భోజనానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్లం. ఇక ఆ భగవంతుడి దయతో ప్రస్తుతం అందరూ వారివారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది' అని అంటున్నారు ఈ ఏడుగురు అక్కాచెల్లెళ్ల తల్లి శారదా దేవీ.

కొడుకుతో కలిసి పదో తరగతి పరీక్షలకు తల్లి- 32ఏళ్లకు టెన్త్​ క్లాస్​ - Mother And Her Son Write 10th Exams

రైతుల మంచి మనసు- నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు- జంతువుల దాహం తీర్చడమే లక్ష్యం! - Farmers Drains Water To River

Last Updated :Mar 26, 2024, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details