తెలంగాణ

telangana

'అబద్ధాలు, విద్వేషాన్ని తిరస్కరించాలి- మెరుగైన భవిష్యత్తు కోసం ఓటు వేయండి' - lok sabha election 2024

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 10:47 PM IST

Sonia Gandhi On BJP : ఎలాంటి పరిస్థితుల్లో అయినా అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకువెళ్తోందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ విమర్శించారు. లోక్​సభ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఓ వీడియో సందేశం విడుదల చేశారు

Sonia Gandhi On BJP
Sonia Gandhi On BJP (ANI)

Sonia Gandhi On BJP :సార్వత్రిక ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతున్న క్రమంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ వీడియో సందేశం విడుదల చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు విపక్ష ఇండియా కూటమి పార్టీలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. విద్వేషాన్ని, అబద్ధాలు తిరస్కరించాలని, మెరుగైన భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటువేయాలని ఓటర్లను కోరారు. బీజేపీ పాలనలో నిరుద్యోగం, మహిళలపై నేరాలు, కొన్ని వర్గాలపై వివక్ష తీవ్ర స్థాయికి చేరుకుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని పొందడమే బీజేపీ, ప్రధాని మోదీ లక్ష్యమని విమర్శించారు. అందరితో కలిసిపోవడం, చర్చలు జరపడాన్ని ఆ పార్టీ తోసిపుచ్చుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రధానమైన హామీ దేశాన్ని ఐక్యంగా ఉంచడమేనని, రైతులు, యువత, మహిళలు, అణగారిన వర్గాల అభివృద్ధి దిశగా తమ నిర్ణయాలు ఉంటాయని సోనియా వివరించారు.

ప్రతిపక్షాలకు ఖర్గే లేఖ
మరోవైపు ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటాలో వ్యత్యాసాలపై గళమెత్తాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపక్షాలను కోరారు. రాజ్యాంగాన్ని, అతిపెద్ద ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడాలనే ఏకైక లక్ష్యం మేరకు ఈసీ విడుదల చేసిన డేటాలోని వ్యత్యాసాలపై అభ్యంతరం తెలపాలన్నారు. ఈ మేరకు ఖర్గే ప్రతిపక్షాలకు లేఖ రాశారు. ఆ లేఖను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రజాస్వామ్యంతోపాటు రాజ్యాంగాన్ని కాపాడేందుకు చేస్తున్న పోరాటమే లోక్‌సభ ఎన్నికలని ఖర్గే చెప్పారు. మొదటి 2దశల పోలింగ్‌ శాతాన్ని 11రోజుల తర్వాత వెల్లడించటం దేశచరిత్రలో మొదటిసారి అన్నారు.

మూడోదశ పోలింగ్‌కు సంబంధించిన ఓటర్ల తుదిజాబితా విడుదల చేయలేదనే వార్త కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఖర్గే తెలిపారు. ఈ పరిణామాలన్నీ చూస్తే ఎన్నికల సంఘం పనితీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంతోపాటు ఈసీ స్వయంప్రతిపత్తిని కాపాడటానికి ఇండియాకూటమి సమష్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మొదటి రెండు విడుదలకు సంబంధించి ఈసీ విడుదల చేసిన డేటా చూసిన తర్వాత తుది ఫలితాలను కూడా తారుమారు చేసే ప్రమాదం ఉన్నట్లు కనిపిస్తోందని ప్రతిపక్షాలకు రాసిన లేఖలో ఖర్గే పేర్కొన్నారు. మొదటి రెండు దశల పోలింగ్‌ తర్వాత ప్రధాని మోదీలో కనిపించిన ఆందోళన, విసుగును దేశమంతా చూసిందన్నారు. నిరంకుశ, అధికారదాహంతో ఉన్న ఈ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతకైనా దిగజారుతుందని ఖర్గే అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details