తెలంగాణ

telangana

దేశంలోనే ఫస్ట్ అండర్​వాటర్​ మెట్రోను ప్రారంభించిన మోదీ- విద్యార్థులతో కలిసి ప్రయాణం

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 10:41 AM IST

Updated : Mar 6, 2024, 11:34 AM IST

PM Modi Underwater Metro : దేశంలో నీటి అడుగున నడిచే తొలి మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు.

PM Modi Underwater Metro Inauguration
PM Modi Underwater Metro Inauguration

PM Modi Underwater Metro: బంగాల్​లోని కోల్​కతాలో నిర్మించిన దేశంలోనే తొలి అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. విద్యార్థులు, మెట్రో సిబ్బందితో ప్రధాని మోదీ కాసేపు సంభాషించారు. ప్రధాని మోదీతో మెట్రోలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌, ఎమ్మెల్యే సువేందు అధికారి ప్రయాణించారు.

బంగాల్​ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ మెట్రో టెన్నెల్​తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆగ్రా మెట్రో, మీరట్‌ మెట్రో, పుణే మెట్రో సహా దేశవ్యాప్తంగా పలు మెట్రో సేవలను ప్రధాని మోదీ కోల్‌కతా నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఇదే వేదికపై కోల్‌కతాలో దాదాపు రూ. 15,400 కోట్ల రూపాయల విలువైన బహుళ కనెక్టవిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

మరో సరికొత్త రికార్డు
దేశంలో తొలిసారి 1984లోనే మెట్రో సేవలు మొదలైంది కోల్‌కతా నగరంలోనే. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు ప్రారంభంతో మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కోల్‌కతా ఈస్ట్‌- వెస్ట్‌ మెట్రో కారిడార్‌ కింద దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. ఈ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు. అయితే 10.8 కి.మీ. భూగర్భంలో ఉంటుంది. ఇందులో హావ్‌డా మైదాన్‌ నుంచి ఎస్‌ప్లెనెడ్‌ స్టేషన్ల మధ్య 4.8 కి.మీ.ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని 45 సెకన్లలో దాటే మెట్రోరైలు కోల్‌కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది.

తగ్గనున్న ప్రయాణ సమయం
ఈస్ట్‌-వెస్ట్‌ మెట్రో కారిడార్‌కు 2009 ఫిబ్రవరిలో పునాది పడింది. అండర్‌ వాటర్‌ మార్గం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ప్రకృతి విపత్తుల్ని సైతం తట్టుకునేలా ఈ కారిడార్‌ను బ్రిటన్‌కు చెందిన పలు ప్రఖ్యాత సంస్థల సహకారంతో నిర్మించారు. ప్రస్తుతం హావ్‌డా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్ఠంగా 90 నిమిషాల సమయం పడుతోంది. అండర్‌వాటర్‌ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనుంది. ఈ కారిడార్ల పరిధిలో ఎస్‌ప్లనాడె, మహాకారణ్‌, హావ్‌ డా, హావ్‌ డా మైదాన్‌ వంటి ముఖ్యమైన స్టేషన్​లు ఉన్నాయి.

3 అడుగుల పొడవు, 18 కేజీల బరువున్న డాక్టర్​- అప్పుడు ప్రభుత్వం తిరస్కరణ- ఇప్పుడు వరల్డ్​ రికార్డ్​కు అర్హత!

విద్యార్థులకు సైకిళ్లు ఇచ్చిన కూలీ- ఆదాయంలో కొంత పొదుపు- యువకుడిపై ప్రశంసలు

Last Updated :Mar 6, 2024, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details